ఎమ్మెల్యేకు వినతినివ్వడానికి సిద్ధపడుతున్న వ్యాపారులు
విశాలంగా కనిపిస్తున్న పాలకొండ రోడ్డు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలో ఏడురోడ్ల జంక్షన్ నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు ఉన్న కోనోకార్పస్ చెట్లను తొలగించి, ఆ ప్రాంతాన్ని సుందరీకరించడానికి కూటమి ప్రభుత్వం పూనుకోవడం హర్షించదగ్గ పరిణామం. అయితే 2000`2005 మధ్య టీడీపీ హయాంలో పాలకొండ రోడ్డు వెడల్పయిన తర్వాత అప్పటి వరకు సెమీ కమర్షియల్ జోన్‌గా ఉన్న ఈ ప్రాంతం పూర్తి కమర్షియల్ ఏరియాగా మారింది. ఇందులో భాగంగానే ప్రధాన రహదారికి ఇరువైపులా షాపులు వచ్చాయి. ఆ మేరకు మున్సిపాలిటీ అనుమతులు కూడా మంజూరు చేసింది. పాలకొండ రోడ్డు వెడల్పు చేసినప్పుడు భవనాలు, స్థలాలు కొంతమేర కోల్పోయినవారికి టౌన్‌ప్లానింగ్ నిబంధనలు సడలించి వెడల్పయిన రోడ్డుకు ఆనుకొని కమర్షియల్ నిర్మాణాలు చేపట్టుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఇంతవరకు బాగానే ఉన్నా విస్తరించిన నగరంలో షాపులు పెరిగి పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. జీటీ రోడ్డులో, రద్దీ సమయాల్లో కళింగ రోడ్డులో సెంటర్ పార్కింగ్‌ను అమలుచేయడం వల్ల కనీసం ఆ రోడ్లలో నడవగలుగుతున్నాం. ఇప్పుడు కోనోకార్పస్ చెట్లను తొలగించి సెంటర్ డివైడర్‌ను వెడల్పు చేసి, అందులో అందంగా ఉండే మొక్కలు పెంచడం వల్ల పాలకొండ రోడ్డు కొత్త సొబగులు చేకూరవచ్చు. కానీ ఇక్కడ పార్కింగ్ పరిస్థితి ఏమిటనే ఆందోళన స్థానిక వ్యాపారుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2014`19 మధ్యలో ఉడా నిధులు సమకూర్చిందని ఈ రోడ్డుకు రెండు వైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించారు. ఒకవైపు ఫుట్‌పాత్‌లు పోగా, మరోవైపు డివైడర్ ఉంటే పార్కింగ్ కష్టతరమవుతుందన్న విషయం పాలకులు గుర్తించాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. ఇందులో భాగంగానే తమ వ్యాపారాలకు, పాలకొండ రోడ్డు వెలుగుకు అడ్డంకిగా ఇన్నాళ్లూ మారిన కోనోకార్పస్ చెట్లను తొలగించినందుకు ధన్యవాదాలు చెబుతునే సెంటర్‌పార్కింగ్ ఏర్పాటుపై ఆలోచించాలని కోరుతూ ఎమ్మెల్యే గొండు శంకర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడి వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు గురువారం స్థానిక వరం రెసిడెన్సీలో పాలకొండ రోడ్డు వ్యాపారస్తులు సమావేశం నిర్వహించనున్నారు. కొన్నిచోట్ల మొక్కలు ఏర్పాటుచేసి, మిగిలినచోట్ల సెంటర్ పార్కింగ్ కోసం అవకాశం ఇవ్వాలని వీరు కోరుతున్నారు. వాస్తవానికి పాలకొండ రోడ్డుకు పార్కింగ్ సదుపాయం లేదు. ఈ ప్రాంతంలో ఉన్న రెండు కల్యాణ మండపాలు, కోదండరామస్వామి కోవెలలో శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, తిరుప్పావై వంటి కార్యక్రమాలు జరుపుతున్నప్పుడు వాహనాలు ఎక్కడ పెడుతున్నారో కార్పొరేషన్ అధికారులకు తెలుసు. జీటీ రోడ్డు ఈ రోజు శ్రీకాకుళం అబిడ్స్ సెంటర్‌గా తయారైందంటే అందుకు కారణం పార్కింగ్ సదుపాయం ఉండటమే. పాలకొండ రోడ్డుకు అంతమేర పార్కింగ్ ఇవ్వనవసరం లేదు కానీ, అందులో మూడోవంతు కల్పిస్తే సరిపోతుంది. మరోవైపు కోనోకార్పస్ చెట్లు తొలగించిన తర్వాత అవి భూమి లోతుల్లోకి ఏమేరకు వెళ్లిందో ఇప్పుడు అధికారులకు అర్థమవుతుంది. కొన్నాళ్ల నుంచి కృష్ణాపార్క్ డౌన్ ప్రాంతంలో సైతం బోర్ల నుంచి నీరు వచ్చేది కాదు. నాగావళికి వరదొస్తే ముందుగా మునిగిపోయే సున్నపువీధి, బాలభాను స్కూల్ రోడ్డు వంటి ప్రాంతాల్లో సైతం బోర్లు ఎండిపోవడం ఏమిటనేది ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు కోనోకార్పస్ చెట్లు తొలగించిన తర్వాత వాటి మొదళ్లు (వేళ్లు) ఏమేరకు భూగర్భ జలాలను తాగేశాయో అర్థమవుతుంది. అప్పట్లో మొదటిగా విస్తరణకు నోచుకున్నది పాలకొండ రోడ్డే. 40 అడుగులు వెడల్పు అవుతుందంట అంటూ గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 40 అడుగులు ఏమాత్రమూ కాదు. కానీ చెట్లు తొలగించిన తర్వాత డివైడర్లను తవ్వుతున్న తర్వాత రోడ్డు ఇంత విశాలంగా ఉందా అని సిక్కోలువాసులు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా 40 అడుగులు అవసరాలకు సరిపోదు కాబట్టి పార్కింగ్ సెంటర్ చేసి డివైడర్ లేకుండా చూస్తేగాని సమస్యకు పరిష్కారం దొరకదు. దీన్నే ఇక్కడి వ్యాపారస్తులు కూడా కోరుకుంటున్నారు.
Komentáre