ఈ ఏడాది మొదటి త్రైమాసంలో 6.7 శాతం వృద్ధి
గత పదిహేను నెలల్లో కెల్లా తక్కువ రేటు నమోదు
అయినా ప్రపంచంలో అత్యంత వృద్ధి నమోదు

గడచిన నెల వెళ్తూ వెళ్తూ దేశ ప్రజలకు వింత కబురు ఒకటి చెప్పి వెళ్లిపోయింది. ఈ ఏడాదిలో మొదటి త్రైమాసికానికి భారతదేశపు వృద్ధి రేటు గురించి నిరాశాజనకమైన కబురు చెప్పింది. గత ఏడాదిన్నరగా ఎన్నడూ చూడనంత తక్కువ జిడిపి వృద్ధి రేటు నమోదైందని తేలింది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడిరచిన వివరాల ప్రకారం దేశ ప్రస్తుత వృద్ధి రేటు 6.7గా తేలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సవరించిన అంచనాల ప్రకారం 7.2గా ఉండాల్సిన వృద్ధిరేటు యధార్ధానికి తగ్గింది. ఇలా తగ్గడానికి కారణం ఏమైవుంటుందని ఆర్బీఐ ఇప్పుడు ఏవో అంచనాలు వేస్తోంది. కాని వాస్తవాలు వాస్తవాలే. ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధి సన్నగిల్లడం వల్లనే వృద్ధిరేటు కుదేలైందని తేల్చిచెప్తోంది. మరి వ్యవసాయం ఎందుకు దిగజారిందనే దానికి కారణాలు ఆర్బీఐ చెప్పదు. ఎందుకంటే అది దాని పని కాదు. ఆ జవాబు చెప్పాల్సింది ప్రభుత్వం. ఈసారి ‘నైరుతి’ పుష్కలంగా నీరు అందించినప్పటికీ వ్యవసాయం నానాటికీ తీసికట్టు నాగంభొట్టు ఎందుకు అవుతోందో ఎవరు తేలుస్తారు?
గత ఏడాది ఇదే సమయానికి 8.2 శాతం వృద్ధి చూపించింది. దానికి కారణం మనకు తెలిసిందే. ఎన్నికల వేళలో భారత ప్రభుత్వం అంచనాలను పెంచి తయారుచేసుకున్న వృద్ధిగానే దానిని మనం భావించాలి. అయితే ప్రభుత్వానికి గొప్ప ఉపశమనం ఏమిటంటే ఇప్పుడు మనం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. దానికి కారణం మన బలంతో పాటు ప్రత్యర్ధుల బలహీనత కూడా. అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొనడం, చైనాలో వృద్ధిరేటు మరింత మందగించడం మనకు ప్లస్ పాయింట్లయ్యాయి. ప్రస్తుతం ఈ పావు ఏడాదిలో చైనా వృద్ధిరేటు 4.7 శాతంగా నమోదైంది. మనకంటే బాగా తక్కువ వృద్ధి జరుగుతున్నట్టుగా గోచరిస్తోంది. చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒడిదుడుకులు దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నిజానికి దలాల్ స్ట్రీట్ అంచనాల ప్రకారం మన వృద్ధి రేటు మరింత మెరుగ్గా ఉండాలని అంచనా వేశారు. పూర్తి వేగంతో ఎనిమిది దాటుతుందని లెక్కలు కట్టారు. అయితే ఆ అంచనాలకు చేరుకోలేకపోయాం. దానికి కారణం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులుగానే పరిశీలిస్తున్నారు.
వ్యవసాయానికి సాయమే మనకు రక్ష
ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి)) సమావేశానికి వెళ్తూ, చివరి నిమిషంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ఊపందుకుని గ్రామీణ వినిమయం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. గడచిన పదకొండేళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడులు పెరిగాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ద్రవ్యోల్బణానికి విరుగుడుగా చేయాల్సిన పనులన్నీ ప్రస్తుతం ఆశాభావంగా కనిపిస్తున్నాయి. ఆహ్లాదకరమైన రుతుపవనాలు, ఖరీఫ్ విత్తులో క్రమమైన మెరుగుదల, రిజర్వాయర్లలో నిండుగా నీరుండడం మొదలైనవన్నీ రబీ దిగుబడులపై ఆశలు రేకెత్తిస్తున్నాయి’ అని శక్తికాంత్ దాస్ చెప్పారు. ధరల స్థిరీకరణకు తోడుగా సరైన ద్రవ్య విధానం అవలంబిస్తే ఆయన ఆశించిన ఫలితాలు తప్పక సమకూరుతాయని రైతాంగ నిపుణులు అంటున్నారు. అయితే ఈ వృద్ధి రేటు విషయంలో మార్కెట్ నిపుణుల అంచనాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ఉదాహరణకు ఎక్యూట్ రేటింగ్స్ అనే సంస్థకు చెందిన ప్రధాన ఆర్థికవేత్త దీని గురించి చెప్తూ 6.7 శాతపు వృద్ధి రేటు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉందని, దీని గురించి భయపడవలసిన పని లేదని అన్నారు. గత ఏడాది చివర్లో రైతులకు ఇచ్చిన ఎరువులు, విత్తనాల సబ్సిడీల లెక్కలు అంచనాలలో చేరి వృద్ధి తగ్గినట్టు నమోదయిందని చెప్పారు. ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉన్న నిర్మాణ రంగం ఇప్పుడు నెమ్మదిగా జోరందుకుని 10.5 శాతం వృద్ధి చూపించడం చాలా ఆశావహకంగా ఉందని ఆయన అంటున్నారు. జిడిపిలో చాలా కీలకమైనవని ఎగుమతులని, ఇప్పుడు ఈ ఎగుమతులలో తగినంత వృద్ధి చూపించడం మరింత శుభ సూచకమని తెలిపారు. దేశీయ ఎగుమతులలో 8.7 శాతం వృద్ధి రేటు సాధారణ విషయం కాదన్నారు.
ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి తప్ప
నిజానికి జిడిపి వృద్ధి రేటు ధరల పెరుగుదలను గాని, మరే ఇతర విషయాలను గానీ ప్రభావితం చేయదు. కేవలం దేశ ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి తప్ప మరి దేనికీ ఉపయోగపడదు. ముఖ్యంగా సామాన్యులకు పట్టని విషయం ఇది. అయినప్పటికీ వృద్ధిరేటు పెరుగుదల బలోపోతమైన ఆర్థిక వ్యవస్థను తయారుచేస్తుందన్న ఆశతో మాత్రమే దీనిని అధ్యయనం చేయాలి. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి దేశ జిడిపి రెండంకెల సంఖ్యకు చేరవేయాలని చేయని ప్రయత్నం లేదు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఊపందుకుని అందరిలో ఆశలు మోసులెత్తించినప్పటికీ వాస్తవ రూపం దాల్చలేదు. ప్రధానిగా నరేంద్రమోదీ ఆర్థిక వృద్ధి రేటు పన్నెండుకు చేర్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. గత పదేళ్లలో అందుకు జరుపుతోన్న కృషి ఫలితాలు ఇస్తున్నట్టు కనిపించడం లేదు. మన దృష్టి మిగిలిన వాటన్నింటిపై కంటే అంటే పరిశ్రమలు, కార్పొరేట్లు, ఎగుమతులు, నిర్మాణరంగం, రియల్‌ఎస్టేట్ వంటి వాటికంటే, వ్యవసాయం, దీని అనుబంధ రంగాలపై పెడితేనే వాస్తవిక వృద్ధి రేటు సాధించి దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందించవచ్చని ఈ ఏడాది విశ్లేషణలు మరోసారి నిరూపిస్తున్నాయి.
దుప్పల రవికుమార్
Comments