top of page

తనిఖీలు తూతూమంత్రం - తవ్వకాలు యథాతథం!

Writer: NVS PRASADNVS PRASAD
  • `జిల్లాలో ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా

  • `సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా మొక్కుబడిగా పరిశీలన

  • `ఎన్నికల సమయంలో మరింత జోరుగా అక్రమాలు

  • `అనుమతులు గోరంత.. తవ్వకాలు కొండంత

  • `మంత్లీలతో అధికారుల చేతులు కట్టేస్తున్న అక్రమార్కులు

జాతీయ రహదారిపై ఎచ్చెర్ల పరిధిలో గురువారం అర్థరాత్రి ఒక ఇసుక లారీ బోల్తాపడిరది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రమాదానికి గురైన లారీ ఒడిశా నుంచి విశాఖకు ఇసుకను రవాణా చేస్తున్నట్లు అధికారులు పేర్కొనడమే అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో నాలుగు నదులు, పక్కనే ఉన్న విజయనగరంలో రెండు నదుల్లో ప్రభుత్వం అనుమతిచ్చిన రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతుండగా, అందులోనూ విశాఖ అవసరాల కోసం జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని రీచ్‌లు కేటాయించినా ఒడిశా నుంచి ఇసుక తరలించడమేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలోని నాగావళి, వంశధార నదుల్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను కప్పిపుచ్చుకోవడానికే ఒడిశా పేరు చెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఒడిశా సాకు చెప్పడానికి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కారణమని తెలిసింది. ఇసుక తవ్వకాల పూర్తి వివరాలు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన తరుణంలోనే బయటపడిన అక్రమ రవాణా ఉదంతం నుంచి తప్పించుకోవడానికే ఒడిశా పేరు వాడుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమాలను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అక్రమ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎన్జీటీ (జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌) ఆదేశాలు అమలవుతున్నాయా లేదా, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలేమిటి, ఇసుక తవ్వకాలు అక్రమ రవాణా, ఇంతవరకు ఎంత తవ్వకాలు జరిగాయన్న వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలవారీగా అన్ని రీచ్‌లను సందర్శించి ఎన్జీటీ నిబంధనలు అమలవుతున్న తీరు, రీచుల్లో ఇప్పటివరకు జరిగిన తవ్వకాలు, నిల్వల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దాంతో ఈ నెల 20న కలెక్టర్‌, ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులు కలిసి కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న కిల్లిపాలెం, కలెక్టరేట్‌ బంగ్లా ఆవలివైపు ఉన్న హయాతినగరం ఇసుక రీచ్‌లను పరిశీలించారు. కలెక్టర్‌కు కొత్త కాబట్టి ఆయనకు ఇక్కడంతా సవ్యంగా ఉందని పక్కన ఉన్న అధికారులు చెప్పుకొచ్చారు.

సమాచారం ఇచ్చి.. తనిఖీలు!

ఈ తనిఖీలు, పరిశీలనలు ఎంత మొక్కుబడిగా జరిగాయంటే.. ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్‌ తీసుకున్న ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థకు తాము రీచ్‌ల పరిశీలనకు వస్తున్నామని ముందుగానే సమాచారం ఇచ్చి కొన్ని రోజుల పాటు తవ్వకాలు నిలిపివేయాలని సొమ్ములు తిన్న అధికారులు చెప్పారు. దాంతో ఈ నెల 17 నుంచి జిల్లాలోని అన్ని రీచుల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారులు తీరుబడిగా పరిశీలించి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిచ్చిన ఇసుక రీచ్‌ల్లో యంత్రాల సహాయంతో నదీగర్భంలో తవ్వకాలు జరపకూడదు. నదిలో వాహనాలు రాకపోకలకు బాటలు వేయకూడదు. కూలీలతో మాత్రమే ఇసుక ఎత్తించాలి. నదిలో రహదారి నిర్మించకూడదు. 2007లోనే ఈ మార్గదర్శకాలు నిర్దేశించిన గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వాటిని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే ఇవి అప్పుడూ, ఇప్పుడూ అమలుకు నోచుకోవడంలేదు. 2013కు ముందు ఇసుక రీచ్‌లకు టెండర్‌ నిర్వహించే విధానం ఉన్నప్పుడు గానీ, 2014లో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చినప్పుడు గానీ ఈ నిబంధనలను పాటించలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చిన తర్వాత కూడా యంత్రాలతోనే నదుల్లో తవ్వకాలు జరిపారు. దీనిపై 2023 మార్చిలో కొందరు హైకోర్టులో పిటిషన్లు వేయగా అసలు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలే జరగడంలేదని రాష్ట్ర గనులశాఖ న్యాయస్థానానికి చెప్పింది.

అన్ని శాఖలకు మంత్లీలు

జిల్లాలో నాలుగు నదుల పరిధిలో 28 రీచ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ఆరు రీచ్‌ల్లోనే తవ్వకాలకు అనుమతిచ్చారు. బట్టేరు, బూరవెల్లి, అంబళ్లవలస, గోపాలపెంట, ముద్దాడపేట, హయాతినగరం రీచ్‌లకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఈ రీచ్‌ల్లో తవ్వకాలు జరుపుతున్న ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థకు జిల్లాలో ఎక్కడా కార్యాలయం లేదు. ఆమదాలవలస వైకాపా నాయకుల సిఫార్సుతో సింగూరు గ్రామానికి చెందిన జి.మోహనరావు అనే వ్యక్తిని మొక్కుబడిగా పెట్టి ఇసుక దందా నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు వీరంతా సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు ఇసుక తవ్వకాలు నిర్వహించిన జేపీ సంస్థ కొల్లగొట్టుకుపోయిన తర్వాత మిగిలిన ఆ కాస్త కూడా ఇప్పుడు మిగల్చకుండా ఊడ్చేస్తున్నారు. సంస్థ మారడంతో పాటు ఎన్నికల హడావుడి ప్రారంభమైన తర్వాత నుంచి జిల్లాలో ఇసుక అక్రమాలు జోరందుకున్నాయి. శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, ఆమదాలవలస మండలాల పరిధిలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి వెనుక అన్ని శాఖల అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీస్‌ శాఖలో కింది నుంచి పైస్థాయి వరకు మామూళ్లు ఇచ్చి అక్రమార్కులు మేనేజ్‌ చేస్తున్నారని తెలిసింది. ఇక మైన్స్‌, సెబ్‌, ఆర్టీవో, విజిలెన్స్‌, రెవెన్యూ, స్థానిక రాజకీయ నేతలతో పాటు రిపోర్టర్లకూ మంత్లీలు ఇచ్చి దర్జాగా అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. సగటున ప్రతి రీచ్‌ నుంచి నెలకు రూ.15 లక్షల వరకు మంత్లీల రూపంలో చేతులు మారుతున్నాయని విశ్వసనీయ సమాచారం. కాగా ఈ వాటాల పంపకాల్లో స్థానిక పోలీసులు, సెబ్‌ అధికారుల మధ్య నాలుగు నెలల క్రితం నుంచి పెద్ద పంచాయితీ నడుస్తున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే కొందరు అధికారులను బదిలీల పేరుతో జిల్లా దాటించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

నాలుగు మండలాల్లో వారి కనుసన్నల్లో

గార మండలం బూరవల్లిలో జగన్‌, మాధవనాయుడు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలున్నాయి. నరసన్నపేట మండలం కరజాడలో పట్నాన క్రిష్ణ, బలగ శ్రీను, గొండు శేఖర్‌ తదితరులు తవ్వకాలు జరుపుతున్నారని భోగట్టా. పొన్నాంలో వాసు, ప్రసన్న, గురువు లక్ష్మణరావు, రాజారావు, అంబటివలస అచ్యుత్‌, అర్జున్‌ ప్రధాన పాత్రధారులని తెలుస్తుంది. వీరంతా నదిలో ఇసుకను యంత్రాలతో తవ్వించి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. తరలించిన ఇసుకను స్టాక్‌ చేసి అక్కడ నుంచి ఎచ్చెర్ల పాపారావు ద్వారా కొనుగోలుదారులకు రవాణా చేస్తున్నారు. ఇవన్నీ నిరంతరాయంగా సాగుతున్నాయి. ఇసుకను ఇతర ప్రాంతాలకు భారీ వాహనాల్లో రవాణా చేయడానికి ముందే పోలీసులకు, సెబ్‌, ఆర్టీవో, రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులకు సమాచారం ఇచ్చి, ఇవ్వాల్సిన మామూళ్లు ముట్టజెప్పి లైన్‌క్లియర్‌ చేసుకుంటున్నారు. ఇంత యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నా అస్సలు ఏమీ జరగడం లేదని అధికారులు నివేదిక ఇవ్వడం విడ్డూరం.

వేరే జీపీఆర్‌ఎస్‌తో అనుమతులు

నాగావళి రివర్‌మౌత్‌లో ఉన్న ముద్దాడపేటలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడానికి వీల్లేదు. కానీ అనుమతి ఇచ్చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వేరే ప్రాంతానికి చెందిన ల్యాటిట్యూడ్‌, లాంగిట్యూడ్‌ చూపించి కేవలం 1800 మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలకే పర్యావరణ అనుమతి ఇచ్చారు. కానీ దానికి వంద రెట్లు అదనంగా తవ్వి తరలించుకుపోయారు. కిల్లిపాలెంలో 2021లోనే తవ్వకాలు అధికారికంగా నిలిచిపోయాయి. అయితే ఇప్పటికీ అనధికారకంగా అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ఇసుక వాహనాలు కలెక్టరేట్‌ మీదుగానే వెళుతున్నా ఎవరూ అడ్డుకోవడంలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత స్థానికంగా వచ్చిన ఫిర్యాదులతో అక్రమ రీచ్‌లపై అధికారులు కన్నెర్ర చేశారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక వైకాపా నాయకులు రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి ఈ సమయంలో సెబ్‌, పోలీసులు దాడులు చేసి పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్ట్టడం భావ్యం కాదని హెచ్చరించడంతో అధికారులు మౌనం వహించారు. దీంతో ఈరోజు వరకు అక్రమ తవ్వకాలు, రవాణాకు ఆటంకం లేకుండా జరుగుతున్నాయి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page