తప్పించుకోలేదు.. పోలీసులే తప్పించారు
- SATYAM DAILY
- Jul 28
- 1 min read
హత్యాయత్నం కేసులో నిందితుడు సెల్ఫీ వీడియో కలకలం
లంచం తీసుకొని తనను తప్పించారంటూ ఎస్పీకి హరి సందేశం
జిల్లా పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన వైనం

(సత్యంన్యూస్, కొత్తూరు)
ఒక కుటుంబాన్ని హతమార్చేందుకు కుట్ర పన్నడం, మరో ఇంటిలో దొంగతనానికి పాల్పడటం వంటి నేరాల్లో కొత్తూరు పోలీసులు ముద్దాయిగా పేర్కొని పరారీలో ఉన్నాడని మీడియాకు చెప్పిన సొంఠ్యాన హరి ఇప్ప్పుడు కొత్తూరు పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసుల అదుపు నుంచి తాను తప్పించుకున్నట్లు కొత్తూరు పోలీసులు బయటి ప్రపంచానికి తెలిపారని, వాస్తవానికి వారే తన నుంచి సొమ్ములు తీసుకుని పరారీ కావడానికి సహకరించారని ఆ వీడియోలో సొంఠ్యాన హరి ప్రకటించారు. ఎస్పీని ఉద్దేశించి చేసిన ఈ వీడియోలో తన నుంచి సొమ్ములు వసూలు చేసి తప్పించి, ఇప్ప్పుడు తన కుటుంబాన్ని వేధిస్తున్నారని హరి పేర్కొనడం గమనార్హం.
అసలేం జరిగింది?
జులై 3న కొత్తూరు మండలం రాజవీధిలో అర్థరాత్రి ఒక ఇంటిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కారంపొడి చల్లి కత్తులతో దాడికి ప్రయత్నించారు. దీన్ని ఛేదించిన పోలీసులు వలిసినాయుడు అనే వ్యక్తిని హతమార్చడానికి, అలాగే ఆయన ఇంటిలో ఉన్న బంగారం, నగదు దోచుకోవడానికి ఉద్దేశించి నిందితులు వచ్చారని, కాకపోతే చీకట్లో ఇల్లు పోల్చుకోలేక లోతుగడ్డ ధనుంజయ ఇంటిలోకి దూరారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సొంఠ్యాన నవీన్ అలియాస్ దాసు, టొంపల వినయ్‌కుమార్, కొన్న తరుణ్, కురమాన శ్రీనివాసరావులను అరెస్టు చేసినట్లు స్వయంగా టెక్కలి డీఎస్పీయే ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అదే సమయంలో ఈ కేసులో ప్రదాన కుట్రదారుడు సొంఠ్యాన హరి పరారీలో ఉన్నాడని, ఆయనకు, వలిసినాయుడుకు మధ్య పెట్రోల్‌బంక్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివాదం ఉండటం వల్ల సుపారీ బ్యాచ్‌ను రంగంలోకి దించి హత్య చేయించాలని చూశారని, అయితే హరి పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. ఇప్ప్పుడు అదే హరి సెల్ఫీ వీడియో ద్వారా తాను పరారీ కాలేదని, పోలీసులే తన వద్ద నుంచి సొమ్ములు తీసుకుని తప్పించారని చెబుతున్నాడు. ఇది కాకుండా ఆయన మేనకోడలు కేసులో ఎంత తీసుకున్నది, వేరే వ్యక్తి నుంచి ఐఫోన్, సొమ్ములు వసూలుచేసిన విషయాలు కూడా ఈ వీడియోలో నిందితుడు హరి తెలిపారు. హరి కోసం వెతుకుతున్నామని ఇన్నిరోజులూ పోలీసులు చెబుతుంటే, ఇప్ప్పుడు పోలీసుల మీదే హరి వీడియో బాంబ్ వేశాడు. ఒక పథకం ప్రకారం తనను తప్పించారంటూ విడుదల చేసిన వీడియో ఇప్ప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే పోలీసులు మాత్రం ఇంతవరకు ఈ వీడియోపై స్పందించకపోవడం గమనార్హం.






Comments