తప్పుడు కేసులు రద్దు చేయాలి
- BAGADI NARAYANARAO
- Apr 7
- 1 min read
కలెక్టర్‌ను కోరిన డీసీసీబీ కాలనీవాసులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్థానిక డీసీసీబీ కాలనీ, శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని నర్సెస్ కాలనీ పరిసర ప్రాంత వాసులపై ఆక్రమణదారులు పెట్టిన తప్పుడు కేసులు రద్దు చేయాలని కాలనీకి చెందిన పలువురు బాధితులు కలెక్టర్‌ను కోరారు. సోమవారం జెడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల ఆస్తుల రక్షణ కోసం ఆక్రమణదారులను అడ్డుకొనే క్రమంలో శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఆక్రమణదారులు తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు బాధితులు విన్నవించారు. డీసీసీబీ కాలనీలోని శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నర్సెస్ లే అవుట్ 1988లో డీటీపీసీ ద్వారా ఆమోదం పొందినట్టు తెలిపారు. సదరు లే అవుట్‌లో ప్రధాన రహదారి మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగులుగా నిర్ధారించారని వివరించారు. ఇప్పటికీ 80 అడుగుల రహదారిగానే చలామణి అవుతుందన్నారు. దీన్ని కొందరు దౌర్జన్యంగా డాక్యుమెంట్ నెంబర్ 818/2025, 819/2025, 6296/2011ను చూపించి 80 అడుగుల రోడ్డులో పడమర వైపు 40 అడుగుల ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు. ప్రజలకు చెందిన ఆస్తిని రక్షించే క్రమంలో కాలనీవాసులంతా కలిసి పనులు అడ్డుకున్నందుకు 9 మందిపై రూరల్ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు నమోదు చేయించారని కలెక్టర్‌కు వివరించారు. డీటీపీసీ అప్రూవల్ చేసిన ఎల్పీ నెంబర్ 155/88లో గల 80 అడుగుల రహదారిని పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని తప్పుడు కేసును ఎత్తివేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో బిర్లంగి రామ్మోహనరావు, అంబటి ఉమాశంకర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Comments