top of page

తప్పుల ‘పుణ్యం’ వారిది.. తిప్పల శాపం వీరికి!

Writer: NVS PRASADNVS PRASAD
  • `మున్సిపల్‌ ఇంజినీర్ల అనాలోచిత చర్యలు

  • `పదేళ్లుగా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య ధోరణి

  • `నిరంతరం మురుగు కూపంలో పుణ్యపు వీధివాసులు

  • `రోడ్డు కంటే ఎత్తుగా కల్వర్లు నిర్మాణం

  • `పల్లంగా మారిన రోడ్డులోకి చుట్టుపక్కల మురుగునీరు

  • `పాములు, దోమలకు ఆవాసంగా ఆ ప్రాంతం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో అదొకటి. అక్కడ సుమారు వంద కుటుంబాలు నివాసముంటున్నాయి. వాటిలో అక్షరాలా 45 కుటుంబాలవారు ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారంటే.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొదట ఈ వార్తను నిర్ద్వంద్వంగా ఖండిస్తూ అబ్బే.. అటువంటిదేమీ లేదని కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. లేదు లేదు.. కనీసం ఎంతోకొంత ఇబ్బంది ఉందని ఎవరైనా నిలదీస్తే సీజన్‌ మారుతున్న సమయంలో ఇటువంటి జ్వరాలు సాధారణమేనని.. దీనికోసం కలెక్టర్‌ డ్రైడే ప్రవేశపెట్టారని, వైద్య ఆరోగ్యశాఖ యాంటీ మలేరియా కార్యక్రమాలు చేపడుతోందని సమర్ధించుకోవచ్చు. అయితే ఇక్కడ 45 కుటుంబాలు ఆస్పత్రులపాలవడానికి ప్రధాన కారణం వర్షాల సీజనో, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల నిర్లక్ష్యమో కాదు. ముమ్మాటికీ కార్పొరేషన్‌ అధికారుల బుర్రలేనితనమే ఈ దుర్భర స్థితికి కారణమని చెప్పాలి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా శతశాతం ఇదే వాస్తవం. చిన్నబజారు రోడ్డులోని దూదివారి కోవెల ఎదురుగా ఉన్న పుణ్యపువీధి ఎంట్రన్స్‌ రోడ్డు విషయంలో అవగాహన లేని ఇంజినీరింగ్‌ విధానం వల్ల దశాబ్దానికిపైగా ఈ ప్రాంతం సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం మురుగులోనే మగ్గిపోతోంది. ఇక వర్షాలు పడితే ఈ ప్రాంతవాసుల అవస్థల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏడాది పొడవునా ఇక్కడి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన కాలువల్లో పూడికలు తొలగిస్తున్నా పుణ్యపువీధి రోడ్డుకు మాత్రం మోక్షం కలగడం అసాధ్యం. చిన్నబజారు రోడ్డును విస్తరించి ఎత్తు చేసినప్పటికీ పుణ్యపువీధి వద్ద నిర్మించిన కల్వర్టులు ఇంకా రోడ్డు లెవెల్‌కు రెండు అడుగుల ఎత్తులో ఉండటమే ఆ వీధిలో ఉన్నవారికి శాపంగా మారింది.

కల్వర్టులు ఎత్తుచేయడంతోనే సమస్య

శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎన్నికైన నాయకులు మంత్రులయ్యారు. తెలుగుదేశం నుంచి గతంలో గుండ లక్ష్మీదేవి, ప్రస్తుతం గొండు శంకర్‌ రికార్డు మెజార్టీ సాధించినా పుణ్యపువీధి సమస్యకు మాత్రం పరిష్కారాన్ని చూపించలేకపోయారు. కారణం.. అప్పటి పురపాలక సంఘంలో పని చేసిన బుర్రతక్కువ ఇంజినీర్లు పుణ్యపు వీధి రోడ్డు కంటే చాలా ఎత్తులో కాలువపై కల్వర్టులు నిర్మించేశారు. భవిష్యత్తులో పుణ్యపువీధి రోడ్డును ఎత్తు చేసినప్పుడు ప్రత్యేకంగా కల్వర్టులు నిర్మించే అవసరం లేకుండా వీటిని దిట్టంగానే కట్టారు. అయితే వీటిని కట్టి దశాబ్దం దాటిపోయినా ఇప్పటి వరకు ఆ కల్వర్టు స్థాయికి రోడ్డును ఎత్తు చేయలేదు. దీంతో మున్సిపాలిటీ ఏర్పడినప్పటి కాలం నుంచి ఉన్న పురాతన వీధుల్లో ఒకటైన పుణ్యపువీధి ప్రాంత ఇళ్లలోని వాడుక నీరు ప్రధాన కాలువలోకి వెళ్లకుండా రోడ్డుపైనే నిలిచిపోతోంది. దాదాపు అడుగు మేరకు ఉండే మురుగు నీటిలో రాకపోకలు సాగించేందుకు వీలుగా స్థానికులు కొందరు డెబ్రిస్‌ తెచ్చి వేస్తున్నారు. ఎంత చేసినా కల్వర్టు స్థాయికి మొత్తం రోడ్డును ఎత్తు చేయడం వ్యక్తులతో జరిగే పని కాదు. అలా అని వ్యవస్థ ఇటువైపు దృష్టి సారించడంలేదు. ఈ వీధిలో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కల్వర్టులు కట్టడం వల్ల అప్పటికే పాడైపోయిన కాలువల నీరు రెండు కల్వర్టుల మధ్య నిలిచిపోయి వైతరిణిలా కనిపిస్తుంది.

పాములు, దోమలకు ఆవాసంగా

సాధారణంగా మురుగునీరు నిల్వ ఉన్నచోట దోమలు నివాసాలు ఏర్పరుచుకుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు సంవత్సరాల తరబడి ఒకే ప్రాంతంలో నీరు నిల్వ ఉండటం వల్ల ఆ ప్రాంతం పాములకు కూడా ఆవాసంగా మారింది. అవి బాత్రూమ్‌ ఔట్‌లెట్‌ల ద్వారా ఇళ్లలోకి చొరబడుతుండటంతో పాములను పట్టుకునేవారి వ్యాపారం నగరంలో ఊపందుకుంది. ఉన్నఫళంగా రోడ్డును ఎత్తు చేయడం, లేదంటే.. కల్వర్టులను రోడ్డు లెవల్‌ వరకు కొట్టేసి ప్రస్తుతం ఉన్న కాలువల్లో పూడిక తీయడమొక్కటే దీనికి పరిష్కారమార్గం. చెత్తలెత్తే వాహనాలు సైతం ఈ ప్రాంతంలోకి రాలేకపోతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తారుకంటే నల్లగా మారిపోయిన మురికినీటిలో కనీసం ద్విచక్ర వాహనంతో కూడా వెళ్లలేని దుస్థితిలో స్థానికులు ఉన్నారు. దీంతో రైతుబజారు రోడ్డు వైపు ఉన్న వీధి ఎంట్రన్స్‌ నుంచి కాకుండా విజయగణపతి ఆలయం వైపు నుంచి కిలోమీటరున్నర చుట్టూ ప్రయాణించి రాకపోకలు సాగిస్తున్నారు. మున్సిపాలిటీ పుట్టిన తొలినాళ్లలో నిర్మించిన కాలువలకు గట్లు లేకపోవడంతో ఇవి రోడ్డుకు సమాంతరంగా ప్రవహిస్తున్నాయి. ఈ మురుగునీరు చిన్నబజారు మెయిన్‌రోడ్డు కాలువకు కనెక్ట్‌ కాకుండా కల్వర్టులు దాన్ని అడ్డుకుంటున్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఉద్యోగమంటే హనీమూనే. చాలామంది అధికారులు, ఉద్యోగులు వైజాగ్‌లో ఉంటారు. చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సివచ్చినప్పుడు మాత్రమే శ్రీకాకుళం వస్తారు. ఇవ్వాల్సింది ఇచ్చి, పుచ్చుకోవాల్సింది పుచ్చుకొని వెళ్లిపోతారు. జగన్మోహన్‌రెడ్డి మానసపుత్రిక అంటూ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు కూడా ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఇక రోడ్డేయమంటారనే భయంతో కమిషనర్‌ ఓబులేషు అటువైపు చూడటం మానేశారు. చెత్తలెత్తడానికి రోడ్డే సరిగ్గా లేకపోవడం, పూడిక తీయడానికి కాలువెక్కడుందో కనపడకపోవడంతో శానిటేషన్‌ వర్కర్లు పుణ్యపువీధి ఉందనే మర్చిపోయారు. ఒక్కసారి ఆ రోడ్డు మీద కారు మీద కాకుండా కాళ్లతో అడుగుపెట్టగలిగితే సంతోషమే. 45 కుటుంబాలు జ్వరాలతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు సొమ్ము సమర్పించుకోవడం ఒక ఎత్తయితే, ఆస్పత్రులకు కూడా ఈ మురుగునీటిలోంచే వెళ్లడం మరో ఎత్తు.

పదేళ్లుగా పట్టించుకోని నేతలు

రైతుబజారు రోడ్డు ఎత్తు చేసి, దానికి ఆనుకొని ఉన్న వీధుల్లో రోడ్లు, కాలువలను విడిచిపెట్టేయడం వల్ల ‘నీరు పల్లమెరుగు’ అనే సూత్రాన్ని అనుసరించి మురుగునీరు పుణ్యపు వీధిని ముంచేస్తోంది. రైతుబజారు దగ్గర్నుంచి ప్రధాన కాలువల్లో ప్రవహిస్తున్న మురుగునీరు పుణ్యపువీధికి వచ్చేసరికి పల్లంలోకి చేరుపోతుంది. గత ఐదేళ్లలో ధర్మాన ప్రసాదరావు గానీ, అంతకుముందు ఐదేళ్లలో లక్ష్మీదేవి గానీ ఈ సమస్యను పట్టించుకోలేదు. మరోవైపు రైతుబజారు రోడ్డు విస్తరించగా మిగిలిన నిధులను టౌన్‌హాల్‌ రోడ్డు విస్తరణ పనులకు ఖర్చు చేయాలని ధర్మాన, ఆ తర్వాత వచ్చిన లక్ష్మీదేవి దీన్ని అడ్డుకోవాలని చూశారే తప్ప ఆ నిధులతో పుణ్యపువీధి ఎంట్రన్స్‌ను బాగుచేయొచ్చని మాత్రం ఆలోచించలేకపోయారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page