తరలుతున్న ఇసుక రాశులు.. నేతలకు కాసులు!
- BAGADI NARAYANARAO
- Jun 7
- 3 min read
అనుమతులు ముగిసినా ఆగని తవ్వకాలు
విశ్వసముద్ర పేరుతో అనేక చోట్ల దందా
పక్క జిల్లాల నుంచి వచ్చిన బడాబాబులదే హవా
నాయకుల పేరు చెప్పి వ్యాపారం చేసుకుంటున్న తమ్ముళ్లు
చేతులు ముడుచుకున్న అధికార గణం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో ఇసుక తవ్వకాల కోసం అధికారికంగా టెండరు దక్కించుకున్న ర్యాంపులన్నింటిలోనూ పరిమితి మేరకు తవ్వకాలు పూర్తయిపోయాయి. దీంతో గతంలో ఇచ్చిన ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్‌లు, మైనింగ్ అనుమతులు ఆటోమేటిగ్ రద్దయిపోయినట్టే. మళ్లీ కొత్త టెండర్లు పిలవాలంటే ప్రతీ ర్యాంపులోను అన్ని అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పటికీ ఇసుక తవ్వకాలు ఆగడంలేదు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖలేవీ కళ్ల ముందే ఇసుక లారీలు తరలిపోతున్నా నీ బిల్ ఎక్కడ? ఇసుక ఎక్కడికి పట్టుకెళ్తున్నావ్? అని అడగలేకపోతున్నారంటే కారణం.. ప్రతీ రీచ్ వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉంది. అయితే ఇది ఎంతవరకు అన్నదే ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పుడు అమలవుతున్న ఉచిత ఇసుక విధానమైనా, గత ప్రభుత్వం చేపట్టిన జేపీ వెంచర్స్ తవ్వకాలైనా ఏమేరకు అనుమతులు ఇచ్చారు, ఏమేరకు తవ్వుకుపోయారన్నదానిపైనే చర్చ. ఎందుకంటే.. ప్రతీ నెల 12వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఒక ర్యాంపు నుంచి తరలించుకుపోతున్నారు. ఆ ర్యాంపునకు ఎన్ని హెక్టార్ల తవ్వకాలకు అనుమతులిచ్చారు, అందులో ఇసుక లభ్యత ఎంత? అన్న విషయాలు పక్కన పెట్టి 10 నుంచి 12వేల మెట్రిక్ టన్నుల మేరకు ఇసుకను తవ్వుకుపోతున్నారు. కానీ ప్రభుత్వ ఖజానాకు జమైన లెక్కలు చూస్తే 500 మెట్రిక్ టన్నులు మాత్రమే డబ్బులు సంబంధిత ర్యాంప్‌కు జమవుతుంది. అంటే ఈమేరకు మాత్రమే ఆన్‌లైన్‌లో బిల్లులు తీస్తున్నారు. మిగిలినదంతా అనధికారికంగా తవ్వుకుపోతున్నదే. గోదావరి జిల్లాల కంటే శ్రీకాకుళంలోనే ఇసుక లభ్యత ఎక్కువ. దీనికి తోడు విజయనగరం, విశాఖపట్నం నదుల్లో ఉన్న ఇసుక నిర్మాణాలకు పనికిరాదు. దీనివల్ల ఎక్కడి నుంచో దిగుమతి అయిన పెట్టుబడిదారులు స్థానిక నాయకులకు ఒక ర్యాంపునకు రూ.50 లక్షల వరకు ముట్టజెప్పి, అంతకు పదింతలు తవ్వుకుపోతున్నారు. ఇసుక అక్రమంగా తరలిపోతుందని పైడిభీమవరం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తే కొన్నాళ్లు ఈ దందా ఆగింది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఒక నకిలీ యాప్‌ను తయారుచేసి గవర్నమెంట్ బిల్లుకు బాబులాంటిదొకటి తయారుచేసి నకిలీ బిల్లును చూపిస్తూ జిల్లా బోర్డర్ దాటేస్తున్నారు. ప్రస్తుతం రెండు నెలల పాటు జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార నదుల్లో తవ్వకాలు ఆపాలని కలెక్టర్ ఆదేశించారు. అయినా ఎక్కడా ఆగిన దాఖలాలు కనిపించడంలేదు. 13050 మెట్రిక్ టన్నులు అత్యల్పం నుంచి 1,00,485 మెట్రిక్ టన్నుల అత్యధికం వరకు ఇసుకను తవ్వుకోడానికి 18 ర్యాంపులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో అంగూరు, గార, ఖాకండ్యాంలలో డీసిల్ట్రేషన్‌లో ఉన్న ఇసుకను మాత్రమే పట్టుకెళ్లాలని సూచించింది. మిగిలినవన్నీ మనుషుల ద్వారా ఇసుకను తవ్వించి ఒడ్డున వేయించే మాన్యువల్ రీచ్‌లు, మరో మూడు సెమీ మెకనైజ్డ్ అంటే కొంత మిషను, కొంత మనుషులు కలిసి చేసే తవ్వకాలన్నమాట. అయితే ఎక్కడా ఈ నిబంధనలు ఫాలో అవ్వరు. అది వేరే విషయం. ప్రొక్లయినర్లు పెట్టి వందలాది లారీలకు డంపింగ్ చేయడమే వీరి పని. ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం అవలంభిస్తున్నందున ర్యాంపు ఒడ్డున ఉన్న తెలుగు తమ్ముళ్లు ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకొని ఓ చోట డంప్ చేసుకొని లారీలకు ఎత్తి అమ్ముకుంటున్నారు. నదిలో ప్రస్తుతం తవ్వకాలకు అనుమతులు లేవు కదా.. అని ఎవరైనా ప్రశ్నిస్తే ఉచిత ఇసుక కాబట్టి స్థానిక అవసరాల కోసం తమ పార్టీ కార్యకర్తలే తవ్వుకుంటున్నారని, అభ్యంతరాలు చెప్పొద్దంటూ స్వయంగా ఎమ్మెల్యేలే అధికారులకు చెబుతున్నారు. కానీ తమ్ముళ్లు తవ్వింది గోరంతయితే, వారి ముసుగులో పెద్దలు తవ్వుకుపోతున్నది కొండంత.
ఇసుక వివాదాలు
ఉమ్మడి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు, జిల్లాలో పెద్దలకు మధ్య ఇసుక విషయంలోనే వివాదాలు కూడా రేగుతున్నాయి. మూలపేట పోర్టు కోసం ఆమధ్య ఒక రీచ్‌ను సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ విశ్వసముద్ర దక్కించుకుంది. అయితే ఆ ముసుగులో లెక్కలేనన్ని లారీలను పక్క జిల్లాకు తరలించుకుపోతుందని, తమ నియోజకవర్గంలో ఉన్నవారి నోట్లో మట్టి కొడుతుందంటూ ఒక ఎమ్మెల్యే స్వయంగా ఈ తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో సొంత పార్టీలోనే ఆమధ్య ఇసుక తవ్వకాల మీద పెద్ద దుమారమే రేగింది. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం భైరిలో ఇసుక తవ్వుకుపోతున్న కాంట్రాక్టరు ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యేను ఒక్కసారి కూడా కలవలేదని భోగట్టా. ఫోన్ చేసినా తాను మంత్రి వద్దో, మరో పెద్ద నాయకుడి దగ్గరో ఉన్నానని చెబుతున్నారని తెలుస్తుంది. ఈ తవ్వకాల వద్ద తేడాలొస్తుండటం వల్లే మడపాం, గోపాలపెంటలలో ఇంతకు ముందే ఆపరేషన్స్ ఆగిపోయాయి. అలాగే పాలకొండ నియోజకవర్గంలో చినమంగళాపురం, నేరడిలో కూడా నిలిచిపోయాయి. విశ్వసముద్ర పేరు చెప్పి ఉమ్మడి జిల్లాలో దొంపాక, అంధవరం, రోణంకి, భైరితో పాటు అనేక చోట్ల తవ్వకాలు జరిపేస్తున్నారు. ఇంతకీ మూలపేటలో జరుగుతున్న ఇసుక పనులు ఏవీ అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతానికి నదిలో నీరు రావడం వల్ల దొంపాకలో ఆగినా, మిగిలిన చోట్ల యథేచ్చగా తవ్వుకుపోతున్నారు. ప్రస్తుతం సగటు ర్యాంపును ఉదాహరణగా తీసుకుంటే టన్నుకు రూ.200 ప్రభుత్వానికి చెల్లించాలి. అలా సగటు లారీకి 24 మెట్రిక్ టన్నుల ఇసుకను తరలించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు నెల రోజులకే పూర్తవుతాయి. కానీ ఇన్నాళ్లుగా ఇసుకను తవ్వుతున్నారంటే ఏమేరకు తప్పుడు బిల్లులు సృష్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో వైకాపావారే ఇసుక దందాలు నిర్వహించగా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు.
మేమేం తక్కువ?!
జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పేర్లు చెప్పుకొని స్థానిక తెలుగుదేశం నాయకులు రేయింబవళ్లూ ఇసుక దందాల్లో మునిగి తేలుతూ భారీగా అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. కరజాడ, భైరి రీచుల్లో ట్రాక్టర్ల యజమానులను జట్టుకట్టించిన తెలుగు తమ్ముళ్లు ఇసుక అక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచే టీడీపీ నాయకులు ఇసుక అనధికార తవ్వకాలు, అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల గురించి తెలిసి స్థానిక ఎమ్మెల్యే సదరు టీడీపీ నేతలను మందలించినా ఫలితం లేకుండా పోయిందని టీడీపీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. నదిలో ఉన్న ఇసుక కంటే.. అక్రమంగా తవ్వి ఒడ్డుకు తరలించి పోగేసిన ఇసుకే భారీ స్థాయిలో ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయంటే.. అక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. స్థానిక ఎమ్మెల్యే కూడా మొదట్లో వీరి దందాలను చూసీచూడనట్టు వదిలేసినా.. ఆ తర్వాత స్థానిక టీడీపీ కార్యకర్తల ద్వారా దీన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఆ పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ రొడ్డెక్కారు. మరోవైపు భైరి, కరజాడ ర్యాంపుల్లో ఇసుక తవ్వి తీసి, ఆ నిల్వలతో సమీపంలో ఇసుక స్టాక్ పాయింట్ నిర్వహించే బాధ్యతను జిల్లా అధికారులు టెండరు ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. అయినా టీడీపీ నేతలు మాత్రం స్థానిక అవసరాల ముసుగులో ఇసుక తరలింపునకు గ్రామంలో ఉన్న ట్రాక్టర్లకు అవకాశం ఇవ్వాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు. ఆ పేరుతోనే ప్రైవేట్ ఏజెన్సీలకు సమాంతరంగా తవ్వకాలు జరిపిస్తూ సమీపంలోని తోటలు, పొలాలు, రహదారులు, నదీతీరాలు.. ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి ట్రాక్టర్లతో ఇసుక డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి విశాఖకు లారీల్లో తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. దీనికోసం ఒక వ్యక్తితో జేసీబీని కొనిపించారు.
ప్రభుత్వ ఆదాయం నేతల జేబుల్లోకి
గత ఏడాది వరకు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఇసుకను ఆదాయవనరుగా మార్చుకొని ఖజానాను నింపుకుంది. మరోవైపు ఆ పార్టీ నాయకులు ఆదే స్థాయిలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ జేబులు నింపుకున్నారు. అప్పట్లో ఇసుక ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావడంతో ఇసుక ధరలు తగ్గాయి. అయితే వైకాపా ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఇసుక ఆదాయం పది శాతం కూడా లేదు. కానీ టీడీపీ నాయకులు మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని జేబులు నింపుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన కొద్దిపాటి ఆదాయం కూడా రాకుండా పోతోంది.
Opmerkingen