నీతి ఆయోగ్ వీసీ కారు వరకు వెళ్లి సెండాఫ్ ఇచ్చిన సీఎం
కేంద్ర ప్రభుత్వం తన వల్లే నడుస్తున్నా చూపించని భేషజం
విజయన్ 2047లో అంశాల అమలుకు చేతులు జోడిరచిన బాబు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఫొటో చూడండి.. ఇప్పటి వరకు బతికున్న రాజకీయ నాయకుల్లో ముఖ్యమంత్రిగానో, ప్రతిపక్ష నాయకుడిగానో, ఎమ్మెల్యేగానో ఓవరాల్‌గా సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు స్వయంగా చేతులు జోడిరచి కారు వద్ద నిల్చుని మరీ సెండాఫ్ ఇస్తున్న ఫొటో ఇది. అలా అని ప్రతినమస్కారం చేస్తున్న వ్యక్తి ఈ దేశ ప్రధానో, లేదా మరో దేశ అధ్యక్షుడో కాదు. ఏ రాష్ట్రానికి ఏ నిధులివ్వాలి? అని నిర్ణయించే ప్లానింగ్ కమిషన్ (నీతి ఆయోగ్)కు ఆయన వైస్‌చైర్మన్. ప్రధానమంత్రి చైర్మన్‌గా ఉండే నీతి ఆయోగే దేశంలో అన్ని రాష్ట్రాలకూ నిధులు, విధులు, పనులు సమకూరుస్తుంది. స్వయంగా ప్రధానమంత్రే ఈ వ్యవస్థకు చైర్మన్ కాబట్టి కేంద్రంలో ప్రభుత్వం తమ ఎంపీల మద్దతుతో నడుస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టినా రెండు సభల్లోనూ తమ మద్దతు ఉండాలి కాబట్టి తాను స్వయంగా ప్రధానమంత్రికే చెప్పుకుంటానన్న భేషజం లేకుండా గత శుక్రవారం నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ సుమన్ బేరి అమరావతి వస్తే, ఆయనతో రాష్ట్ర అభివృద్ధిపై అన్ని విషయాలు మాట్లాడి ఆయన్ను సాదరంగా సాగనంపుతూ గేటు చివర వరకు దిగబెట్టారు చంద్రబాబు. తాను సీనియర్‌నని, ప్రధానమంత్రి కంటే తానే ముందు రాజకీయాల్లోకి వచ్చానని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడివుండొచ్చు. కానీ రాష్ట్ర అభివృద్ధికి నిధులు రప్పించుకోవాలంటే ఆయన ఏ స్థాయి వ్యక్తితోనైనా పని చేయించుకోగలరనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. జగన్మోహన్‌రెడ్డి హయాంలో ప్రధానమంత్రినో, అమిత్‌షానో, ఆర్థిక మంత్రినో కలిసి తిరుమల వేంకటేశ్వరుడి చిత్రపటం ఇవ్వడం మినహా ఇలా మెట్టు దిగి పనులు చేయించుకున్న సందర్భాలు గూగులమ్మను అడిగితే చెప్పడంలేదు.
స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు చేయూతనివ్వండి
నూతన సాంకేతికత, ఆవిష్కరణలలో సహకారం అందించండి
నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ సుమన్ బేరీని కోరిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో అవకాశాలు ` ఆకాంక్షలపై ప్రజంటేషన్ :
వన్ ఫ్యామిలీ.. వన్ ఏఐ ప్రొఫెషనల్ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర`2047 విజన్‌డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్ర సాయం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీతో అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయాలనికి వచ్చిన సుమన్ బేరీకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను, అభివృద్ధి ఆకాంక్షలను ముఖ్యమంత్రి వివరించారు. ఆవిష్కరణలు-సాంకేతికత అందించడం, నూతన విధానాల అమలుకు తోడ్పడటంలో నీతిఆయోగ్ సహకారాన్ని ఈ సందర్భంగా కోరారు. ఏపీ ప్రతీ ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధించి 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను నెలకొల్పేందుకు, తద్వారా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా ప్రయత్నిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్‌గా ఉంటుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేయగా, కేంద్రానికి ` రాష్ట్రానికి ఇది అనుకూల సమయమని, అభివృద్ధికి ఎంతో ఆస్కారముందని, ఇందులో నీతిఆయోగ్ భాగస్వామ్యం కూడా కచ్చితంగా ఉంటుందని సుమన్ బేరీ అన్నారు.
‘సర్ణాంధ్ర-2047’ పైనే ఫోకస్:
ఆర్ధిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, సుస్థిరత... ప్రధానాంశాలుగా స్వర్ణాంధ్ర-2047పై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. మానవాభివృద్ధి-ఉత్తమ పాలన అంశాల్లో గ్లోబల్ లీడర్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే రాష్ట్రం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని, అందులో ముఖ్యంగా రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఆర్ధిక వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం, రాష్ట్ర ఆదాయానికి గ్రోత్ ఇంజిన్ వంటి హైదరాబాద్‌ను కోల్పోవడం, ఏపీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం, గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు మూలధన వ్యయంపై నిర్లక్ష్యం చూపడం, మౌలిక వసతులను కల్పించకపోవడం వంటివి ఉన్నాయని చెప్పారు.
సవాళ్లు ఎదురైనా సాధిస్తాం
పాలనలో పలు అడ్డంకులు తలెత్తినా రాష్ట్రానికి ఉన్న అనుకూలతలతో అన్నివిధాలా బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీ దేశంలో 2వ అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉండటం, పోర్టులు-రైల్వే-హైవేలతో అతిపెద్ద కనెక్టవిటీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, తూర్పు-ఆగ్నేయాసియాకు గేట్ వే కావడం, రెన్యువబుల్ ఎనర్జీ, డేటా టెక్నాలజీలో పెట్టుబడులను ఆకర్షించడం ఏపీకి ప్రధాన సానుకూలాంశాలుగా తెలిపారు.
రాష్ట్రంలో 3 గ్రోత్ హబ్‌లు
దేశంలోని 3 గ్రోత్ హబ్‌లో ఒకటిగా ఉన్న విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్)తో పాటు తిరుపతి - అమరావతిని రీజినల్ గ్రోత్ హబ్‌లుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. బ్లూ ఎకానమీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ డెవలప్మెంట్.. గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామని అన్నారు. డేటా సేకరణ, బెస్ట్ ప్రాక్టీసెస్, స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్స్, ప్రైవేట్ పెట్టుబడులను ఆకట్టుకోవడం, ఎఫ్‌డీఐ, రిసోర్స్ మొబిలైజేషన్ తదితర విషయాల్లోనూ నీతి ఆయోగ్ కీలకపాత్ర పోషించాలనే ఆకాంక్షను ముఖ్యమంత్రి వెల్లడిరచారు. ఇందులో భాగంగా ప్రతి మూడు నెలకు సమీక్ష చేయాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లు, స్కిల్లింగ్ హబ్స్, స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం - నీతి ఆయోగ్ కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు. ఏపీ తీసుకున్న కీలక కార్యక్రమాలైన నదుల అనుసంధానం, పీ`4 విధానం ద్వారా పేదరిక నిర్మాలన, 2047 విజన్‌లోని పది ప్రధాన సూత్రాల అమలుకు నీతి ఆయోగ్ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 3సీ పోర్టులు, 3 ఎయిర్ పోర్టులు ఉన్న తిరుపతి-చెన్నయ్-నెల్లూరును ట్రై సిటీగా తీర్చిదిద్దితే ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకువెళ్తుందని అన్నారు.
కారు దగ్గరకు వెళ్లి మరీ వీడ్కోలు
హైదరాబాద్‌లో తాను అభివృద్ధి చేసిన జినోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో అత్యుత్తమ పాలసీలను ఏపీలో అమలు చేయాలనేది తమ విధానమని ముఖ్యమంత్రి చెప్పారు. 2029 కల్లా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో 11 వేలకు పైగా ఈవీ బస్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు, అలాగే రాష్ట్రంలోని అన్ని బస్‌స్టేషన్లపైనా రూఫ్ టాప్ సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. సచివాలయానికి తొలిసారి వచ్చిన సుమన్ బేరీకి ఘనంగా స్వాగతం పలకడమే కాకుండా సమావేశం అనంతరం ఆయన తిరిగి వెళ్లేటప్పుడు కారు దగ్గరకు వెళ్లి మరీ ముఖ్యమంత్రి వీడ్కోలు పలికారు.
Comments