top of page

తరుముతున్న తలసేమియా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 23
  • 2 min read
  • ఉద్దానంపై పెరుగుతున్న వ్యాధుల దాడి

  • కిడ్నీ వ్యాధులకు తోడు తలసేమియా, సికిల్‌సెల్

  • జిల్లాలో పడకేసిన వ్యాధి నిర్థారణ పరికరం

  • పెన్షన్ల మంజూరులోనూ ప్రభుత్వం మీనమేషాలు

  • ప్రవీణ్‌లాంటి బాధితుల బాధలు వర్ణనాతీతం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ప్రాణవాయువును అన్ని శరీరభాగాలకు మోసుకెళ్లే వాహకంగా పనిచేసే హిమోగ్లోబిన్ తగ్గిపోతే రక్తహీనత ఏర్పడి తలసేమియా అనే ప్రమాదకరమైన వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల ఎర్ర రక్తకణాలు (ఆర్‌బీసీ) వేగంగా తగ్గిపోతుంటాయి. ఫలితంగా తలసేమియా రోగులకు పరిస్థితిని బట్టి రెండు నుంచి నాలుగు వారాలకోసారి కచ్చితంగా రక్తం ఎక్కిస్తుండాలి. దీనికి ప్రత్యామ్నాయం లేదు. అలా జరక్కపోతే ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుంది. తలసేమియాను అరుదైన వ్యాధుల్లో ఒకటిగా పేర్కొంటుంటారు. కానీ ఇటీవలి కాలంలో ఈ వ్యాధి పీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. చిన్నపిల్లలు సైతం తలసేమియా బారినపడి మంచానికి పరిమితమవుతున్నారు. కానీ వారికి ప్రభుత్వపరంగా ఆర్థికంగా, వైద్యపరంగా తగిన చేయూత అందించడంలో వ్యవస్థలు వైఫల్యం చెందుతున్నాయి. ఈ నిష్క్రియాపరత్వానికి పురియా ప్రవీణ్‌కుమార్ ఉదంతాన్ని ఒక కేస్ స్టడీగా పరిగణించవచ్చు. వైద్యరంగంలోనూ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో తలసేమియా వ్యాధి నిర్థారణ పరీక్షల నిర్వహణ నుంచి అన్నింటికీ దూరతీరాలకు వెళ్లాల్సిందే. పోనీ ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తుందా అంటే దీర్ఘకాలిక వ్యాధిపీడితులకు ఇచ్చే పెన్షన్ల మంజూరులోనూ తీవ్ర అలక్ష్యం ప్రదర్శిస్తూ బాధితులను మరింత వేదనకు గురిచేస్తున్నది. ఫలితంగా వారు ఇతరులు ఇచ్చే విరాళాలపై ఆధారపడి రోజులు వెళ్లదీయాల్సి వస్తున్నది.

అన్నింటికీ అవస్థలే

కవిటి మండలం వరక గ్రామానికి చెందిన పురియా శ్రీను, రాణి దంపతులది పేద కుటుంబం. హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలీలుగా జీవనం సాగిస్తుండేవారు. వీరి కుమారుడే ఎనిమిదేళ్ల ప్రవీణ్‌కుమార్ . బాలుడికి తలసేమియా వ్యాధి ఉన్నట్లు తేలడంతో ఈ కుటుంబం పుట్టెడు దు:ఖంలో మునిగిపోయింది. పాతిక రోజులకోసారి కొత్త రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో హతాశులయ్యారు. వైద్య పరీక్షలు, రక్తమార్పిడి ఖర్చులు భారంగా పరిణమించాయి. ఈ పరిస్థితుల్లో స్వగ్రామానికి తిరిగివస్తే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల పింఛన్లు లభించే అవకాశం ఉంటుందన్న ఆశతో హైదరాబాద్ నుంచి వరకకు తిరిగివచ్చేశారు. కానీ రెండేళ్లకుపైగా పింఛన్ కోసం పోరాడుతున్నా ప్రభుత్వం కరుణించడం లేదు.

  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ మంజూరు కావాలంటే చాలా హర్డిల్స్ దాటాల్సి ఉంటుంది. దానికి అవసరమైన వైద్యపరీక్షలు చేయించి, ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ కొన్ని నెలల క్రితం వరకు శ్రీకాకుళంలో తలసేమియా నిర్థారణ పరీక్షలు నిర్వహించే సౌకర్యం అందుబాటులో లేదు. దాంతో రోగులు విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి చేయించుకోవాల్సి వచ్చేది. అయితే రక్తం మార్చిన వెంటనే పరీక్ష చేస్తే వాల్యూస్ మారిపోయి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అలా అని రక్తం మార్చడానికి ముందు తీసుకెళ్దామంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయంలో అనేక వినతులు, ఫిర్యాదుల మేరకు ఎట్టకేలకు స్పందించిన జిల్లా అధికారులు గత ఏడాది ఆగస్టు నుంచి రిమ్స్‌లో తలసేమియా వ్యాధిని నిర్థారించే హెచ్‌బీ ఎలక్ట్రో ఫోరోసిస్ పరికరాన్ని అందుబాటులో ఉంచారు. కానీ అది కొన్ని నెలల ముచ్చటగా మారింది. కొన్నాళ్లుగా అది చెడిపోయి మూలనపడింది. ఫలితంగా తలసేమియా రోగుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి.

  • తలసేమియా దీర్ఘకాలిక వ్యాధి కనుక ప్రభుత్వం అమలు చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్ పథకం వర్తిస్తుంది. ఇది మంజూరైతే ప్రతినెలా లబ్ధిదారులకు రూ.10వేలు చొప్పున పెన్షన్ అందుతుంది. దాంతో కొంతైనా వైద్యఖర్చులు గట్టెక్కే అవకాశం ఉంది. 2024 ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే బెందాళం అశోక్ పెన్షన్ మంజూరు చేయిస్తానని ప్రవీణ్ కుటుంబానికి హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత దాన్ని విస్మరించారు. అప్పట్లో ప్రభుత్వం కొత్త పెన్షన్ మంజూరును నిలిపివేయడమే కారణమని అనుకున్నా.. ఇటీవల కొత్త పెన్షన్లు విడుదల చేసినప్పుడు కూడా ఈ బాలుడికి మంజూరు కాకపోవడం విచారకరం.

  • ఈ పరిస్థితుల్లో ప్రవీణ్ కుటుంబం విధి లేక సహాయం అందించే దాతలపైనే ఆధారపడుతున్నది. ఈ క్రమంలో ఇచ్ఛాపురం వైకాపా సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి వారికి అండగా నిలుస్తున్నారు. ఈ సమస్యను తన బాధ్యతగా తీసుకున్న ఆయన బాలుడి తరఫున పలుమార్లు జిల్లా కేంద్రానికి వెళ్లి గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వపరంగా ప్రవీణ్‌కు పెన్షన్ మంజూరయ్యేవరకు తానే ప్రతి నెలా రూ.2500 అందిస్తానని ప్రకటించి, కొన్ని నెలలుగా అందిస్తూ వస్తున్నారు.

జిల్లాలో పెరుగుతున్న కేసులు

ఈ వార్తాకథనం చదివి ఇదేదో ప్రవీణ్ అనే ఒక్క బాలుడి సమస్య అనుకుంటే పొరపాటే. ఎందుకంటే జిల్లాలో తలసేమియా బాధితులు వేగంగా పెరుగుతున్నారు. ఇంతకాలం ఉద్దానం కిడ్నీ వ్యాధుల నిలయంగా పేరుపడింది. కానీ ఇప్పుడు దానికితోడు తలసేమియా , సికిల్‌సెల్ ఎనీమియా కేసులు కూడా ఉద్దానాన్ని కమ్మేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్క ఉద్దానంలోనే ఈ కేసులు సుమారు 35 ఉన్నాయని అంచనా. జిల్లావ్యాప్తంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. రెండేళ్లుగా పోరాడుతున్న ప్రవీణ్‌కు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవడంతోపాటు ఉద్దానంతోపాటు జిల్లావ్యాప్తంగా సికిల్‌సెల్ ఎనీమియా, తలసేమియా వ్యాధి ప్రభావంపై సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page