హేమ కమిటీతో అల్లకల్లోలంగా మలయాళ సినిమా
అలాంటి కమిటీ కోసం తమిళ, కన్నడ చిత్రసీమలు డిమాండ్
మౌనంగా తెలుగు పరిశ్రమ ` రెండేళ్ల కిందటే కమిటీ!
(దుప్పల రవికుమార్)

హైడ్రా పేరుతో తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల నేలమట్టానికి పూనుకుంది. అది నెల తిరగకుండానే నడ్డివిరిగి మూలన కూర్చుంటుందని అందరికీ తెలిసిందే! ఎందుకంటే రాజగురువు రామోజీ కట్టిన ఫిలింసిటీలో పదుల కొద్దీ చెరువులు ఉన్నాయని కమ్యూనిస్టు పార్టీలు సైతం గగ్గోలుపెట్టాయి. అటువైపు చూసే సాహసం కూడా ఎవరూ చేయలేరు. వంద నాగళ్లతో ఫిలింసిటీని దున్నిస్తా అన్న కెసిఆర్ పదవీకాలంలో అటువైపు తొంగి చూడలేదు. అటువంటిది, రేవంత్‌రెడ్డికి అలాంటి ధైర్యసాహసాలు ఉంటాయనుకోవడం మన భ్రమ. అయితే మొదటి వారంలోనే నాగార్జున నిర్మించుకున్న ఎన్ కన్వెన్షన్ మాత్రం నేలపాలయింది. స్వయంగా రేవంత్ కుమార్తె పెళ్లి ఆ అక్రమ నిర్మాణంలోనే జరగడం విశేషం. సుమారుగా అంతే పొడవు వెడల్పులతో అలాంటిదే మన కరకట్టపై కూడా ఒక అక్రమ నిర్మాణముంది. అందులో మన ముఖ్యమంత్రిగారు నివాసముంటున్నారు. ఇంతకూ నాగార్జునకు ఏం చెప్పాలని ఆయన కన్వెన్షన్ కూల్చేసారు. తెలంగాణ నుంచి చిత్ర పరిశ్రమ ఆంధ్రకు తరలించడానికేనా!? మళ్లీ ఆంధ్రలో సినీతారలకు భూపందేరాలు జరగనున్నాయా? ఈ విషయంపై నాగార్జున గాని, మరే ఇతర నటుడుగాని, నిర్మాతగాని ఇంతవరకూ నోరెత్తలేదు.
పక్కసీట్లో కీచకుడు
మన తెలుగు సినిమా పెద్దలు ఎప్పుడూ ఇంతే. కీలక సమయాల్లో గమ్ముగనుంటారు. వారి అభిప్రాయాలు ఎప్పటికీ చెప్పరు. రాజకీయ అభిప్రాయాలైతే అసలు నోరు విప్పనే విప్పరు. మన నటులకు వారి బిజినెస్ తప్ప మరేమీ పట్టదు. వారి ఆదాయాలే వారికి స్వర్గసీమ. తమిళ, మలయాళ, కన్నడ సినీ పెద్దలు అలా కాదు. నేరుగా రాజకీయాలు మాట్లాడుతారు. ఎవరి అభిప్రాయాలు వారు నిస్సంకోచంగా చెప్పుకుంటారు. హేమ కమిటీ నివేదికలో నాలుగోవంతు నివేదిక లీకయిన తర్వాత రేగిన సంచలనం అంతా ఇంతా కాదు. సినీ నిర్మాతలు ఎవరి పీకకు ఈ ఉచ్చు చుట్టుకుంటుందో తెలియక గంగవెర్రులెత్తి పోతున్నారు. మోహన్‌లాల్ తన అసోసియేషన్ పదవికి రాజీనామా చేసాడు. కాని మనం తెలుసుకోవలసిన విషయం ఏమంటే తెలంగాణ ప్రభుత్వం సినీ రంగంలో జరుగుతున్న లైంగిక వివక్ష గురించి అధ్యయనం చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ 2022లోనే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇంతవరకూ దానిని ప్రభుత్వం బహిర్గతం చేయలేదు.
సెక్స్ ఆన్ డిమాండ్
ఆగష్టు 9న కలకత్తాలో ఆర్‌జి కార్ ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటనలో అసువులు బాసిన నర్స్ ఉదంతం ఇంకా కడుపులో దేవేస్తుండగానే, అదే నెలలో జస్టిస్ హేమ కమిటీ ఎప్పుడో ఇచ్చిన నివేదికలో నిగ్గు తేలిన నిజాలు మన మనసులను వికలం చేసాయి. ఈ దేశంలో అన్నిచోట్లా పని ప్రదేశంలో మహిళలు సురక్షితంగా లేరని, పక్క సీట్లో కీచకులు ఉన్నారని, వారు స్త్రీలను వేధించుకు చంపుతున్నారని ఈ దుర్ఘటనలు బట్టబయలు చేసాయి. అందులో హేమ కమిటీ నివేదిక వర్ణించిన విషయాలు ఒళ్లు గగుర్పొడేలా చేసాయి. నటీమణులను ఈ పురుష పుంగవులు అవకాశాలకు బదులుగా వారందించే సేవలను బట్టి కేటగిరీలుగా విభజించడం మనిషిలోని పైశాచికత్వాన్ని తెలుపుతోంది. వారి వికృత పెర్వర్టెడ్ మనస్తత్వాలకు అడ్డూ అదుపూ లేకుండా పోవడానికి సినీసీమలో పేరుకుపోతున్న డబ్బు ప్రధాన కారణమని ఈ సందర్భంగా చాలామంది తమ మనసులో మాటగా చెప్పారు. అయితే ఇది మన దేశంలో ఇప్పుడు బయటపడిన బాంబు కాదు. హ్యాష్‌టాగ్ మీటూ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా నడిచినప్పుడు మన బాలీవుడ్ నటీమణులు బాహాటంగా ముందుకొచ్చి హిందీ సినీ పరిశ్రమలో తాము పడుతున్న అగచాట్లను ఈ ప్రపంచానికి వెల్లడిరచారు.
దేశమంతటా అదే డిమాండ్
కొన్నేళ్ల కిందట తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ స్థాయిల మహిళలు తమకు కనీస సౌకర్యాలు అమర్చవలసిందని అభ్యర్థిస్తూ ఒక మెమొరాండం సమర్పించారు. షూటింగులు ఆలస్యమయ్యే సమయంలో స్పాట్‌నుండి తమ నివాస ప్రదేశాలకు చేర్చడానికి వాహన సౌకర్యం ఏర్పాటుచేయమని, లైంగిక దాడులు జరగకుండా కనీస రక్షణ, భద్రత వసతులు సమకూర్చమని కోరారు. దీనికి ప్రతిస్పందనగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి 2022లో సమర్పించింది. అయితే ఆ నివేదక ఇంతవరకూ వెలుగు చూడలేదు. ఇప్పుడు నెమ్మదిగా కొంతమంది సినిమా పరిశ్రమ మహిళా బృందాలు ఆ నివేదికను బహిర్గతపరచమని ప్రభుత్వంపై వత్తిడి పెంచుతున్నాయి. తమిళనాట మరొక అడుగు ముందుకు వేసి ఖుష్బూ, రోహిణి లాంటి కొంతమంది నటీమణులు తప్పులు చేసిన నటులపై ఐదేళ్ల బహిష్కరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు ప్రభుత్వంపై వత్తిడి పెంచి పని ప్రదేశంలో లైంగిక అత్యాచార నిరోధక చట్టాలను వెంటనే అమలు చేయాలని, దీనికి సంబంధించి ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేయాలని చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం వెంటనే అంగీకరించింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సినీ పరిశ్రమలో వచ్చిన గొప్ప మార్పు ఏమంటే వారంతా తమను తాము కళాకారులుగా కాకుండా మహిళా సినీ కార్మికులుగా సంభోదించుకుంటున్నారు. తమకు పని ప్రదేశంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడమని ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నారు. స్త్రీలలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మగ దురహంకారం తలకెక్కిన పురుష పుంగవులలో స్త్రీలను ఇంకా రెండవ శ్రేణి పౌరులుగా చూసే అభిజాత్యం ఎప్పుడు పోతుందో వేచి చూడాలి!
Comments