తాకట్టు కేసులో దాడి కట్టుకథ!
- NVS PRASAD

- Sep 3, 2024
- 3 min read
స్వప్నప్రియను బలి చేసేందుకు పన్నిన వ్యూహం
ఎస్బీఐ ఉద్యోగి సురేష్‌పై ఆమె దాడి చేయించినట్లు ప్రచారం
అది తట్టుకోలేక ఆమె ఆత్మహత్య.. కుటుంబం జైలుపాలు
కానీ దాడి జరగలేదని తేల్చేసిన పోలీసులు
ఆ ఇద్దరి కుట్రకు బలైపోయిన మొత్తం కుటుంబం
ఈ కేసుకు కొత్త ఎస్పీ ఎలాంటి ముగింపునిస్తారో?

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసుకు.. జిల్లాలో కలకలం రేపిన గార ఎస్బీఐ తాకట్టు బంగారం నగల మాయం కేసులో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య కేసుకు పెద్దగా తేడా లేదు. కాకపోతే దీన్ని పోలీసులు, సమాజం చూసిన దృక్కోణంలోనే తేడా ఉంది. స్వప్నప్రియను ఆత్మహత్యకు పురిగొల్పిన పరిణామాలు, వాతావరణ ఏకంగా ఆ కుటుంబమంతటిపైనా దోషులుగా ముద్రవేసి జైలుపాలు చేసి కనీస సానుభూతి సైతం లభించకుండా చేశాయి. కానీ ఆర్‌జీ కర్ ఆస్పత్రికి చెందిన మహిళా డాక్టర్ కేసులో మాత్రం యావత్తు దేశం ఆ కుటుంబానికి అండగా నిలబడిరది. ఈ రెండు కేసుల్లోనూ బాధితులు మహిళలే. కాకపోతే సోషల్‌మీడియా, ప్రధాన మీడియా స్వప్నప్రియ కుటుంబం మీద దోషి అనే ముద్ర వేసి ప్రచారం చేయడంతో వారికి న్యాయం మాట దేవుడెరుగు కనీసం సానుభూతి అయినా దక్కలేదు. ఈ పాపం ఎవరిది? కచ్చితంగా పోలీసులు, బ్యాంకు అధికారులదే.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)జిల్లాలోని గార స్టేట్‌బ్యాంకులో తాకట్టు బంగారం కనిపించడంలేదనే విషయం బయటపడిన తర్వాత బ్యాంకు లాకర్‌కు కస్టోడియన్లుగా ఉన్న ఇద్దరిలో ఒకరిపై దాడి జరిగిందని, గాయాలతో అతను ఆస్పత్రిపాలయ్యాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఫొటోలు ప్రచురితమయ్యాయి. వీటిని ఈ కుంభకోణం సూత్రధారులే మీడియాకు పంపించారు. తాకట్టు నగలు మాయమైన ఉదంతం బయటపడటంతో తన తోటి కస్టోడియన్ సురేష్‌పై స్వప్నప్రియే దాడి చేయించిందని, తన ప్రమేయం బయటకు రాకుండా సురేష్‌ను అంతమొందించే ప్రయత్నం చేసిందంటూ పెద్ద ఎత్తున కథనాలు వండి వార్చడానికి బ్యాంకు, పోలీసు అధికారులు సోషల్ మీడియాను వాడుకున్నారు. సీన్ కట్ చేస్తే.. కొద్ది రోజుల క్రితం బంగారం మాయం కేసులో ఒక నిందితుడిగా ఉన్న సురేష్ మీద అసలు దాడే జరగలేదని, ఆయనకు గాయాలైనట్టు చెప్పడం, ఆస్పత్రిలో చేరినట్లు ఫొటోలు బయటపెట్టడం వంటివి కేసును పక్కదోవ పట్టించడానికి ఒక పథకం ప్రకారం ఆడిన నాటకంలో భాగమని పోలీసులు నిర్ధారించారు.
సురేష్‌పై దాడి ఫేక్ అని నిర్ధారణ
గార ఎస్‌బీఐ క్లర్క్ సురేష్‌పై గత ఏడాది నవంబరు 23 రాత్రి దాడి జరిగిందని, స్వప్నప్రియే ఈ దాడి చేయించిందన్న ప్రచారం జరగడంతో అదే రోజు రాత్రి, మరుసటి రోజు మధ్యలో స్వప్నప్రియ ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిరది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. స్వప్నప్రియ భౌతికంగా లేకపోవడంతో ఆ నేరాన్ని ఆమె కుటుంబం మీదకు నెట్టేసి మాయమైన బంగారాన్ని దిగమింగేద్దామని అప్పటి రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజు గ్యాంగ్ భావించింది. అయితే ఈ ఉదంతానికి సంబంధించి కీలక ఆధారాలు సంపాదించిన ‘సత్యం’ క్రమం తప్పకుండా ఆధారాలతో సహా కథనాలు ప్రచురించడంతో పోలీసులు అప్పటి డీఎస్పీ శృతి నేతృత్వంలో విచారణ ప్రారంభించారు. ఆ విచారణలోనే బంగారం ఉంచే చెస్ట్ తాళాలు ఉన్న సురేష్ మీద దాడి జరిగిందన్న ప్రచారం తప్పని తేలిపోయింది. ఈ విషయాన్ని గార, శ్రీకాకుళం పోలీసులు అప్పట్లో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు తెలిపారని భోగట్టా. అయితే స్వయంగా పోలీసుల చేత, పోలీసుల వల్ల బ్యాంకు అధికారుల కోసం స్వప్నప్రియ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టిన అప్పటి పోలీస్ బాస్.. ఆ విచారణ నివేదిక బయటకు వస్తే తన కొంప కొల్లేరైపోతుందని భావించి కేసును క్లోజ్ చేయకుండా అలాగే ఉంచారు.
తప్పుడు ప్రచారాలకు ఆ కుటుంబం బలి
కొత్త ఎస్పీగా మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. అసలు బ్యాంకు నగల కుంభకోణంలో కీలక అంశం క్లర్క్ సురేష్ మీద దాడి జరిగిందని చెబుతున్న ఘటనే. ఎందుకంటే స్వప్నప్రియ, సురేష్‌ల వద్ద రెండు తాళాలు ఉంటాయని, ఈ రెండూ ఉపయోగిస్తే గాని చెస్ట్‌ను తెరవడం కుదరదని, సురేష్ వద్ద తాళాలు తీసుకొని స్వప్నప్రియే చెస్ట్‌ను తెరిచి బంగారాన్ని మాయం చేసిందని అప్పట్లో ప్రచారం చేశారు. దీన్ని నిజమని నమ్మించడం కోసం సురేష్ మీద స్వప్నప్రియ దాడి చేయించిందని, ఎక్కడ నిజాలు చెప్పేస్తాడేమోనన్న భయంతో ఆయన్ను లేపేయాలని చూసిందంటూ మరో కొత్త ప్రచారం మొదలుపెట్టారు. 2023 డిసెంబరు 24 నుంచి ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు దాడి జరిగినట్టు గానీ, సురేష్‌కు దెబ్బలు తగిలినట్టు గానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆ మాటకొస్తే సురేష్ పోలీసులకు వివిధ సందర్భాల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్లలోనే పొంతన లేకుండాపోయింది. ఆయన ఆస్పత్రిలో చేయించుకున్నారని ఎమ్మెల్సీ(మెడికో లీగల్ కేసు) కూడా ఒక ఫేక్. అయితే ఈ దాడి ప్రచారం కారణంగానే చనిపోయిన స్వప్నప్రియను వెనక్కు తెచ్చేది ఎవరు? జైలుపాలై సమాజ బహిష్కరణకు గురైన ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేసేదెవరు? పోలీసులు, మీడియా ఇచ్చిన తప్పుడు తీర్పులకు ఒక కుటుంబం బలైపోయింది. బంగారం మాయం ఘటనలో స్వప్నప్రియ, ఆమె సోదరుడిపై కేసు పెట్టిన పోలీసులు ఎక్కడా ఆ కేసులో మొదట సురేష్ పేరు చేర్చలేదు. ‘సత్యం’లో కథనాలు వచ్చిన తర్వాత సురేష్‌తో పాటు మరికొందరి పేర్లు చేర్చి పరారీలో ఉన్నారని చెప్పుకొచ్చారు.
కొత్త ఎస్పీ సత్తాకు సవాల్
వాస్తవానికి ఈ కథ మొత్తం అప్పటి రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజు కనుసన్నల్లో అప్పటి ఎస్పీ అమలు చేసిన కుట్ర. ఎందుకంటే.. టీఆర్‌ఎం రాజుది అమలాపురం. ఆయన సోదురుడికి ప్రభుత్వం మారిన తర్వాత పోస్టింగ్ దక్కక, గత ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడ్డారని కేసు నమోదైన ఒక డీజీ స్థాయి అధికారితో స్నేహం ఉంది. వైకాపా ప్రభుత్వంలో కొన్నాళ్ల పాటు ఈ డీజీ హవా నడిచింది. ఆయన ప్రాపకంతోనే ఇక్కడ ఎస్పీగా అప్పుడు ఒకరు పోస్ట్ దక్కించుకున్నారు. అదే డీజీ స్థాయి అధికారి సూచనల మేరకే స్వప్నప్రియ కుటుంబంపై కేసు కట్టి జైలుకు పంపారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారిందన్న ఆరోపణలున్నాయి. టీఆర్‌ఎం రాజుతో సిండికేట్‌గా ఏర్పడి ఎక్కడికక్కడ బంగారం మాయం చేయడం, నకిలీ రుణాలిచ్చే కుంభకోణాల్లో సూత్రధారులుగా ఉన్నవారు మైనార్టీ కులానికి చెందిన స్వప్నప్రియ పైకి ఆ నేరాన్ని నెట్టేస్తే పరువుగా బతికే ఆ కుటుంబం భయపడి మొత్తం బంగారాన్ని విడిపించి ఇచ్చేస్తారన్న ఆలోచనతో ముందుగా రచించుకున్న పథకమిది. టీఆర్‌ఎం రాజు హయాంలో ఎస్‌బీఐ లాకర్‌లో ఉండాల్సిన బంగారం ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టుకు వెళ్లడం సహజమేనని చెబుతున్నారు. ఇందులో స్వప్నప్రియ, సురేష్, చింతాడ శ్రీను లాంటి అనేకమంది భాగస్వాములే. బంగారాన్ని బయట తాకట్టు పెట్టడం, ఆ డబ్బులతో ఆస్తులు కొనుక్కోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కాకపోతే బయట కుదువ పెట్టిన బంగారం నిల్వలు పెరిగిపోవడం, దాన్ని మళ్లీ విడిపించేందుకు సొమ్ము లేకపోవడంతో మొత్తం నేరాన్ని స్వప్నప్రియ మీదకు నెట్టేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజే. మిగిలినవారందరిదీ తిలా పాపం, తలా పిడికెడు. ఇప్పుడు సురేష్ మీద దాడి ఘటన ఫేక్ అని తేలిపోవడంతో ఈ వ్యవహారానికి కొత్త ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఎలాంటి ముగింపు ఇస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే.. టీఆర్‌ఎం రాజు ఇక్కడ ఉన్నప్పుడే ఆధారాలన్నీ చెరిపేసి వెళ్లిపోయారు. దాంతో కొత్త ఎస్పీ సమర్ధతకు ఇది పరీక్షగా నిలవనుంది.










Comments