top of page

తాగకుండా వీరు.. అమ్మకుండా వారు ఉండలేరు!

Writer: ADMINADMIN
  • మంగళవారం మద్యం షాపులు బంద్‌

  • ఉదయాన్నే క్యూలో మందుబాబులు

  • బార్‌బాయ్‌లతో ఎక్సైజ్‌ అధికారులే విక్రయించారు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అసలే ఒకటో తారీఖు.. అందులోనూ తెల్లవారిసరికే సామాజిక భద్రతా పింఛన్లు కనీసం రూ.4వేలు అందినరోజు. సక్కగా ఓ సుక్కేసుకుందామంటే మధ్యలో మందుషాపులు బంద్‌ అంటే ఊరుకుంటామా..? అస్సలు కుదరదు. మంచినీళ్లు దొరక్కపోయినా ఫర్వాలేదు కానీ, మందు దొరక్కపోతే అల్లాడిపోతాం. నరాల్లో రక్తప్రవాహం ఆగిపోతుంది. కాళ్లు, చేతులు వణికేస్తాయి. అందులోనూ రాత్రి బాగా తాగేసుంటామేమో.. హ్యాంగోవర్‌ పెగ్గు కోసం షాప్‌ కీపర్‌ కంటే ముందే ఆ మెట్లు మీద దేబరిస్తుంటాం. అటువంటిది షాపులు బంద్‌ చేస్తాం, మందు అమ్మేది లేదంటే ఊరుకుంటామా?

రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుండటంతో ఇప్పటి వరకు ప్రభుత్వ మద్యం షాపుల్లో పని చేస్తున్న సేల్స్‌మెన్లు, సూపర్‌వైజర్లకు పని లేకుండాపోయింది. దీంతో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వీరంతా మంగళవారం విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం మద్యం షాపులు తెరుచుకోలేదు. ఈ విషయం తెలియని మనోళ్లు ఎప్పటిలాగే ఉదయాన్నే ఓ క్వార్టర్‌ కోసం షాపుల వద్ద బారులు తీరారు. ఉదయం 10 దాటింది, 11 దాటింది, 12 దాటింది.. అయినా షాపులు తెరుచుకోపోవడంతో మందుబాబుల ప్రవాహం షాపుల వద్ద పెరిగింది. మందు లేకుండా మద్యం ప్రియుడు ఎలా ఉండలేడో, అది అమ్మకుండా ప్రభుత్వం కూడా ఒక్కరోజు ఉండలేదని నిరూపించారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతానికి ఎక్సైజ్‌ అధికారులు పోలీసుల సహకారంతో రంగంలోకి దిగిపోయారు. నగరంలో గవర్నమెంట్‌ షాపులను తెరిచారు. స్వయంగా ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లే షాపుల్లో కూర్చుని మంగళవారం మద్యాన్ని విక్రయించారు. దీంతో మద్యం షాపుల్లో నిన్నటి వరకు పని చేసి సేల్స్‌మెన్లు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎలాగూ తమ ఉద్యోగాలు పోయాయి కాబట్టి కొత్తగా పీకేదేమీ లేదని ఎక్సైజ్‌ అధికారుల మీద తిరగబడ్డారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయడంతో కస్టమర్‌ శాటిస్‌ఫేక్షనే తమ అంతిమ లక్ష్యమని ఎక్సైజ్‌ అధికారులు మద్యాన్ని విక్రయించి ఆర్చుకుపోయిన నాలుకను తడి చేశారు. అయితే ఎక్సైజ్‌ అధికారులకు అమ్మడం రాదు కదా.. ఎలా విక్రయించారన్న డౌట్‌ వస్తే, అందుకు మన బార్‌ యజమానులు సహకరించారు. ప్రైవేటు బార్లలో పని చేస్తున్న సేల్స్‌మెన్‌లను, బాయ్‌లను రంగంలోకి దించి ఒక్కో షాపులో ఒక్కో ఎక్సైజ్‌ అధికారిని కూర్చోబెట్టి ఎంచక్కా మందును సరఫరా చేశారు. బాబ్బాబూ.. ఉల్లిపాయలు బాగా రేటు పెరిగిపోయాయి, మార్కెట్‌లో కొందామన్నా దొరకడంలేదని ఆమధ్య ఆంధ్రజ్యోతిలో ఓ కథనం వస్తే నాలుగు రోజుల వరకు దీని మీద సంబంధిత అధికారులు ఎవరూ వివరణ ఇవ్వలేదు. కానీ అదే ఆంధ్రజ్యోతిలో ప్రభుత్వ షాపుల్లో మద్యం సరిపడినంత దొరకడంలేదని వార్త ప్రచురిస్తే ఆ సాయంత్రానికే కావలసినంత మందుంది, తాగినంత తాగండి, తూగినోళ్లు తూగండి అని ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన విడుదలైంది. మద్యం తాగకుండా మందుబాబు ఒక రోజు ఉండగలడేమో గానీ, అమ్మకుండా ప్రభుత్వం మనుగడ సాగించలేదు.



Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page