తాగి తొక్కించేశాడు..!
- BAGADI NARAYANARAO

- Sep 25
- 1 min read
జలంత్రకోట వద్ద కంటైనర్‌తో ఇద్దరి హత్య
దాబాలో బిల్లు కట్టమన్నందుకు ఘాతుకం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఫూటుగా మద్యం సేవించాడు.. ఆపై పీకల వరకు తిన్నాడు.. తిన్నదానికి బిల్లు కట్టమంటే దాబా యజమాని పీకల మీద నుంచి లారీని పోనిచ్చాడు.. ఈ క్రైమ్ కథలో దాబా యజమానికి సహకరిద్దామని వచ్చిన మరో అమాయకుడు కూడా లారీ చక్రాల కింద నలిగిపోయాడు. ప్రస్తుతానికి పోలీసు విచారణలో ఉన్న ఈ కథాకమామీషు కోసం స్థానికంగా జరుగుతున్న ప్రచారం మేరకు అందిస్తున్న కథనమిది. దీనిపై పోలీసులను వివరణ కోరితే ఇంకా కూపీ లాగాల్సివుందంటున్నారు. అంతవరకు పాఠకుల కోసం ఈ క్రైమ్ కహానీ.
కంచిలి మండలం జలంత్రకోట హైవే పక్కనున్న దాబాలో ఒడిశా నుంచి విశాఖపట్నం వెళుతున్న ఓ కంటైనర్ వాహనం డ్రైవర్ ఏబ్రార్ ఖాన్ భోజనం కోసం బుధవారం రాత్రి 9 గంటల సమయంలో దాబా దగ్గర ఆగాడు. తనతో తెచ్చుకున్న మద్యం సేవించి తినడానికి కావాల్సిన ఆహారం ఆర్డర్ చేశాడు. తిన్న తర్వాత బిల్ చెల్లించాలని కోరిన దాబా ఓనర్ మహమ్మద్ అయూబ్‌తో గొడవ పడ్డాడు. ఇవ్వనంటూ వాగ్వాదానికి దిగాడు. బిల్లు ఇవ్వకుండా కంటైనర్ వాహనంతో వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. దాబా ఓనర్ అడ్డగించటంతో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కంటైనర్‌ను ఆయూబ్ పైకి ఎక్కించాడు. దీంతో దాబా ఓనర్ అక్కడక్కడే మృతి చెందాడు. అప్పటికే దాబాలో ఉన్న జలంత్రకోట పంచాయతీ మధుపురానికి చెందిన డొక్కర దండాసి దాబా ఓనర్‌తో ఉన్న స్నేహంతో కంటైనర్‌కు అడ్డుగా నిలబడ్డారు. ఆయనపైకి కూడా కంటైనర్ ఎక్కించేశాడు. అనంతరం డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాబాలో ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చి కంటైనర్‌ను వెంబడిరచి డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సోంపేట సీఐ మంగరాజుతో పాటు ఎస్సై పారినాయుడు ఘటన స్థలానికి చేరుకుని, రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు అదుపులో ఉన్న డ్రైవర్‌ను వైద్యపరీక్షల నిమిత్తం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ది జార్ఖండ్ రాష్ట్రమని తెలుస్తుంది.










Comments