
ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ముస్లిం సంప్రదాయం ప్రకారం తండ్రి కొడుకు చెవి లో ‘కల్మా’ చదివి, పేరు పలికి లోపలికి తీసుకెళ్లాలి. ‘నేను స్కూల్‌కు వెళ్లే దారిలో చర్చిలో సంగీతం వినేవాణ్ణి. గుడిలో వినిపించే భక్తి గీతాలు ఆలపించేవాణ్ణి. ప్రపంచంలో ఏ మతమూ ఇంకో మతంపైన జబర్దస్తీ చేయదు. ఏ మతమైనా చెప్పేది నీ పొరుగు వారిని ప్రేమించు’ అనే చెబుతుందని భావించే ఉస్తాద్ అల్లా రఖా తన కొడుకు చెవిలో తబలా జతులు వినిపించాడట. ఇదేమిటని భార్య ప్రశ్నిస్తే.. ‘నా ప్రార్థనలు ఇవే.. నేను ప్రార్థన చేసే విధానం ఇదే’ అన్నాడట. తనకు గురువుల నుంచి సంక్రమిం చిన జ్ఞానాన్ని కొడుకుకు పంచాలన్న ఆయన తపన.. తండ్రికి మాట రాకూడదన్న పట్టుదల జాకీర్‌ను జగద్విఖ్యాతం చేశాయి. మూడేళ్లకే తబలాను మీటిన ఆ పసివేళ్లు.. ఏడేళ్లకే అకుంఠిత దీక్షతో సాధన చేశాయి. పన్నెండేండ్లకే ప్రదర్శనలిచ్చాయి. అన్ని మతాలు, అన్ని ధోరణుల విద్వాంసులతో అతి సులువుగా కలిసిపోయి తన తబలాను వారి సంగీతానికి జత చేయగలగడం జాకీర్ ప్రతిభకు, సర్వ మత సారం ఒక్కటేనన్న ఆధ్యాత్మిక భావనకు తార్కాణం. తన మహోన్నత ప్రతిభా పాటవాలతో దేశ విదేశాల్లో కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్న సంగీత భానుడు అస్తమించాడు. భారత శాస్త్రీయ వాయిద్య కళను ప్రపంచానికి చేరువ చేసిన మ్యూజిక్ మాస్ట్రో, తబలా వాయిద్య మాంత్రికుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ నిష్క్రమణతో తబలా మూగబోయింది. తోడు వాయిద్యంగా ఉన్న తబలాకు ప్రత్యేక గుర్తింపుతెచ్చిన అద్వితీయ ప్రతిభావంతుడు ఇకలేరన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియు లను శోకసంద్రంలో ముంచింది. ఆల్‌టైం గ్రేట్ తబలా విద్వాంసుడిగా పేరొందిన ఉస్తాద్ అల్లారఖా ఖాన్ కుమారుడైన జాకిర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషికి పసిబిడ్డగా ఉన్నప్పుడే తబలాతో ఏర్పడిన అనుబంధం, అంతకు మించిన అకుంఠిత దీక్ష, అద్వితీయ ప్రతిభ.. ఆయన్ను సంగీత ప్రపంచంలో శిఖరాగ్రాన నిలిపాయి. శాస్త్రీయ వాయిద్య కళాకారులకిచ్చే బిరుదైన ‘ఉస్తాద్’ అని కాకుండా.. జాకీర్ బారు అని పిలవాలని కోరుకోవడం ఆయన వినమత్రకు, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనం. 1989లో ఢల్లీిలో ప్రముఖ నాటక రచయిత సఫ్ధర్ హష్మీని కాంగ్రెస్ గూండాలు హత్య చేసినప్పుడు ఆయన సృజనాత్మకంగా నిరసన తెలిపారు. కుల, మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించారు. తన స్నేహితుడైన ప్రముఖ సంతూర్ విద్వాంసుడు శివకుమార్ 2022లో మరణించినప్పుడు భౌతికకాయాన్ని భుజాలపై మోసి ప్రేమ చాటుకున్నారు. అందరూ వెళ్లిపోయినా చితిపక్కన విచారంగా నిలబడి కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ‘ఇదీ నిజమైన ఇండియా.. స్నేహానికి కుల, మత భేదాలు లేవు’ అన్న నెటిజన్ల వ్యాఖ్యలు అక్షర సత్యం కదా! అందుకేనేమో క్రిస్టియన్ అయిన కథక్ నృత్యకారిణి ఆంటో నియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. తండ్రి అల్లారఖాకు అనారోగ్యం కారణంగా 19 ఏళ్ల వయసులో తొలిసారి అమెరికా వెళ్లి పండిట్ రవి శంకర్‌కు సహవాయిద్యం అందించే అవకాశం దక్కింది. ఆయనతో పాటు అలీ అక్బర్ ఖాన్, భీమ్‌సేన్ జోషి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శివ కుమార్ శర్మ వంటి భారతీయ సంగీత ప్రముఖులతోనే కాక అంతర్జాతీయ దిగ్గజాలందరితోనూ చేసిన జుగల్ బందీలు అజరామరంగా నిలిచాయి. పలు సినిమాలకు సౌండ్ ట్రాక్స్ అందించడం, నటించ డమే కాకుండా.. మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ‘వాప్‌ా తాజ్’ వంటి ప్రకటనలతో దేశంలో ప్రతి ఇంటికీ చేరువయ్యారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత నాటక అకాడమీ, గ్రామీ వంటి లెక్కలేనన్ని పురస్కారాలను అందుకున్నారు. హిందూ, ముస్లిం శాస్త్రీయ సంగీత భాగస్వామ్యాన్ని స్థిరంగా ప్రచారం చేయడంతో పాటు కొనసాగాలని కోరు కున్న కళాస్రష్ట. గాత్రసంగీతమైనా, వాయిద్య సంగీతమైనా, జుగల్ బందీ అయినా, వ్యక్తిగత ప్రద ర్శన ఇచ్చినా, ఫూజన్ అయినా.. తనదైన శైలిలో రక్తికట్టించే ఆయన తబలా వాయిద్యం.. గాలిలో ఊగే గుబురు జుత్తు.. జనం కళ్లలో ఎప్పుడూ కదలాడుతూనే ఉంటాయి. వచ్చే ఏడాది ముంబైలో వరుసగా సంగీత కచేరిలిచ్చేందుకు సిద్ధమైన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంతలోనే అస్తమించడం సంగీత ప్రపంచానికి తీరని లోటు. సంగీతానికి భాష అంటూ ఉంటే అది ప్రేమ, ఐక్యత అని చాటిచెప్పిన జాకీర్ బారు ఎన్నటికీ సంగీత ప్రపంచంలో మకుటాయమానంగా వెలుగొందుతూనే ఉంటారు. కొత్త వెలుగులను అన్వేషించే భావి తరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారు. తాజ్‌మహల్ టీ గురువారం జాతీయ పత్రికలకు ఇచ్చిన ప్రకటన చూస్తే ఉస్తాద్ ఏంటో ఈ జనరేషన్‌కు అర్థ మవుతుంది. 100 కోట్ల భారతీయులను తాజ్‌మహల్ టీ కోసం విన్నప్పుడు మీకేం గుర్తొస్తుం దంటే.. తాజ్‌మహల్ కాదు.. ఉస్తాద్ జాకీర్ హుస్సేనే అని ప్రకటించడం అతిశయోక్తి కాదు.
Comentarios