top of page

తిండి కోసమే తిప్పలు

Writer: DV RAMANADV RAMANA

హౌ ఇండియా లివ్స్‌ వెబ్‌సైట్‌ సేకరించిన గణాంకాల ప్రకారం సాధారణ భారతీయుల రోజువారీ జీవితం అప్పుల సుడిగుండంలోకి మునిగిపోతోంది. వేర్వేరు స్వతంత్ర సంస్థలు వేర్వేరు కోణాల్లో ప్రస్తా వించిన గణాంకాలను ఓ క్రమానుగతంగా అధ్యయనం చేస్తే భారత ఆర్థిక వ్యవస్థలోని సంక్షోభం లోతుపాతులు అర్థం చేసుకోవచ్చు. దేశంలో కంపెనీల ఉత్పత్తి, నిల్వలు, అమ్మకాలు, లాభాలు అన్నీ ప్రజల వినిమయ శక్తి, పొదుపు సామర్ధ్యంతో ముడిపడి ఉంటుంది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పన్ను రాయితీలు, ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీలు, భూమి కేటాయింపుల్లో రాయితీలు ఇస్తున్నా ఉత్పత్తి కంపెనీలు విదేశీ వాణిజ్యంతో పోటీ పడగల స్థాయిలో రాణించటం లేదు. దాంతో విదేశీ పోటీలో తట్టుకుని కంపెనీలు నిలవాలంటే దేశీయ సరుకు ఉత్పత్తి ధర మరింత తక్కువగా ఉండా లని, అది సాధ్యం కావాలంటే కార్మికులు వారానికి 90 గంటలు పని చేసేందుకు సిద్ధమవ్వాలనీ ఎల్‌ అండ్‌ టి కంపెనీ చైర్మన్‌ సుబ్రమణ్యం వంటివారు పిలుపునిస్తున్నారు. ఇన్ని రాయితీలు ఇస్తున్నా దేశీయ కంపెనీలు లాభాల బాట పట్టకపోవడానికి కారణం ఏమిటి? గత నాలుగేళ్లుగా వినిమయ దారుల నిజ ఆదాయాలు పడిపోవటంతో వినిమయ సరుకుల కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపటం లేదని హౌ ఇండియా లివ్స్‌ వెబ్‌సైట్‌ సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వినిమయ సరుకుల కంపెనీ లు తమ వార్షికాదాయాల్లో ఐదుశాతం కంటే ఎక్కువ వృద్ధిరేటును సాధించలేకపోతున్నాయి. సగటున దేశ ఆర్థిక వ్యవస్థ ఏడు నుంచి ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ప్రభుత్వం భరోసా కల్పిం చేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా రంగాలవారీ వృద్ధిరేటు చూసినప్పుడు ఈ భరోసా నీటిరాతగానే మిగులుతుందన్న సందేహం తలెత్తుతోంది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న కుటుంబ రుణ భారం. 2020 జూలై నాటికి కుటుంబ రుణభారం రూ.77 లక్షల కోట్లుగా ఉంటే 2024 మార్చి నాటికి రూ.121 లక్షల కోట్లకు పెరగటం ఓ ముఖ్యమైన కారణం. కుటుంబ రుణ భారం రెండు రకాలు. వినిమయ సరుకులు కొనుగోలు చేయటానికి తీసుకునే రుణాలు ఓ రకం అయితే రోజువారీ కుటుంబ నిర్వహణ కోసం రుణం తీసుకోవటం రెండో రకం. యుపిఎ 1, యుపిఎ 2 ప్రభుత్వాల హయాంలో పెరిగిన రుణభారం ఇటు వినిమయ సరుకుల కొనుగోలుకు మళ్లటంతో ఆయా కంపెనీల వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. పదేళ్లలో రెండో రకం రుణభారం పెరుగుతోంది. మెజారిటీ ప్రజల జీవనోపాధి అవకాశాలు చిన్నాభిన్నం అయ్యాయి. కోవిడ్‌ విపత్తు ఈ సమస్యను మరింత తీవ్ర తరం చేసింది. దాంతో ప్రజల కొనుగోలు శక్తి బాగా క్షీణించింది. బిజెపి ఏలుబడిలో సగటు కుటుంబ రుణ భారం 56 శాతం పెరిగింది. స్థూల జాతీయోత్పత్తిలో ఈ కుటుంబ రుణభారం 41 శాతంగా ఉందంటే ఆర్థిక వ్యవస్థలో డొల్లతనం ఎంత ఉందో అర్థమవుతుంది. మరోమాటగా చెప్పాలంటే ఆయా కుటుంబాలు సాధారణ స్థాయిలో వేతనాలు కూడా పొందలేని దుస్థితికి చేరాయి కాబట్టి కుటుంబ ఆర్థిక అవసరాల భారాన్ని లాగటానికి అప్పులపై ఆధారపడుతున్నాయని, అలాంటి కుటుంబాల మోతాదు గత పదేళ్ల కాలంలో 56 శాతం పెరిగిందని ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. రుణభారం పెరిగిం దంటే వడ్డీ భారం పెరగకుండా ఉండదు. ఈ పదేళ్ల కాలంలో సగటు భారతీయ కుటుంబాలు గతం కంటే అదనంగా వడ్డీలు కట్టడం కూడా కొనుగోలు శక్తి లేకపోవడానికి ఓ కారణంగా ఉంది. మొత్తంగా ఆయా కుటుంబాలకున్న అప్పుల్లో 30 శాతం కేవలం ఆయా కుటుంబాలు తమ పోషణ కోసం తీసు కున్న అప్పులేనని నిర్ధారణ అవుతోంది. కార్లు, ఇళ్లు, ఇతర వినిమయ వస్తువులు సమకూర్చుకోవడా నికి తీసుకున్న రుణాలు కేవలం పది శాతమే. అంటే స్థిరచరాస్థి సమకూర్చుకునే రుణాలు తగ్గిపోతు న్నాయి. కుటుంబ పోషణ కోసం తీసుకునే రుణాలు పెరుగుతున్నాయి. దీన్ని మరోలా అర్థం చేసుకో వాలంటే దేశంలో పేదల కుటుంబ ఆదాయం, లేదా ఉపాధి సౌలభ్యం కోసం తీసుకునే రుణాలు తగ్గిపోతూ ఉన్నాయి. కేవలం తిండి తిప్పలు సమకూర్చుకోవడానికి తీసుకుంటున్న రుణాలు పెరిగిపో తున్నాయి. ఈ వివరాలు పరిశీలించినప్పుడు దేశంలో పెరుగుతున్న కుటుంబ రుణభారం ఆర్థిక వ్యవస్థ లో వృద్ధి రేటును మరింత స్థబ్దతకు గురి చేస్తుందనీ, ఈ స్థబ్దతను అధిగమించటానికి కార్పొరేట్‌ వర్గానికి మరిన్ని రాయితీలు ఇవ్వటమే మార్గమని ప్రభుత్వాలు నిరంతరం ప్రతిపాదిస్తూ ఉంటాయనీ, దీని కోసం జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితే జాతి ఆర్థికంగా బలోపేతం అవుతుందనీ, జాతి ఆర్థికంగా బలోపేతం అయితే ప్రత్యర్ధులపై ఆర్థికంగా రాజకీయంగానూ పై చేయి సాధించటం వీలవు తుందనీ, తద్వారా దేశానికి అంతర్జాతీయ కీర్తిప్రతిష్టలు ఆర్జించవచ్చనీ ప్రభుత్వాలు, ప్రభుత్వ వాదన లకు పై వివరణ పరిశీలించినప్పుడు ఆర్థికంగా దేశానికి ప్రత్యేకించి రోజువారీ వేతనాలపై ఆధారపడే కుటుంబాలకు రానున్నది మరింత క్లిష్ట కాలం అన్నది స్పష్టమవుతుంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page