బండారును కాదన్నా జిల్లా నేతల్లో తగ్గని ఆశలు
బలప్రదర్శనకు దిగిన కలమట
అప్పలనాయుడును మార్చేస్తారంటూ గేదెల ప్రచారం
బాబును కలవనున్న గుండ దంపతులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఉత్తరాంధ్రలో టిక్కెట్ దక్కని టీడీపీ సీనియర్ నేతల ఆశలకు ఇది ఆఖరి అవకాశం. మరో రకంగా చెప్పాలంటే ఇదే ఆఖరి పోరాటం. అధిష్టానం నిర్ణయంలో మార్పులు ఉండవని తెలిసినా ‘అయిననూ పోయి రావలె’ అనే రీతిలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిసి మరొక్కసారి మనసు మార్చుకోమని కోరే సన్నివేశానికి ఈ రోజు రాత్రి, లేదా మధ్యాహ్నం లోపు తెర పడబోతోంది. ఉత్తరాంధ్రలో మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ ఎర్రన్నాయుడు వియ్యంకుడు, మాజీ మంత్రి, శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్‌నాయుడు మామకు పెందుర్తి సీటు ఇవ్వకపోవడంతో చివరి ప్రయత్నంగా ఆయన ఆదివారం గాజువాక వచ్చిన చంద్రబాబును కలిసి మరోసారి విన్నవించుకున్నారు. అయినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు నేతలు ఇందుకోసం చివరి పోరాటానికి సిద్ధపడుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి విజయనగరం ఎంపీగా టిక్కెట్ దక్కించుకున్న కలిశెట్టి అప్పలనాయుడును మారుస్తారంటూ పల్సెస్ సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు ఈమధ్య తన సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈమేరకు అప్పలనాయుడును మార్చి తనకు టిక్కెట్ ఇస్తారని, చంద్రబాబును కూడా కలిశారంటూ ప్రచారం జరుగుతోంది. అప్పలనాయుడు మాత్రం అధిష్టానం తన పేరును ప్రకటించిన మరుక్షణం నుంచే ప్రచారంలో మునిగిపోయారు. వాస్తవానికి విజయనగరం ఎంపీ స్థానం కోసం పల్సెస్ అధినేత శ్రీనుబాబు ఎన్నికల ముందు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందుకోసం కాపులను కూడగట్టి విజయనగరం మంత్రి బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా శిబిరాలు కూడా నడిపారు. కానీ ప్రతీసారి ఎన్నికల ముందు కనిపించి, ఆ తర్వాత వ్యాపారాల్లోకి వెళ్లిపోతున్న శ్రీనుబాబును ఈసారి టీడీపీ గుర్తించలేదు. దీనికి తోడు ఎచ్చెర్లలో బలమైన నాయకుడిగా అప్పలనాయుడు ఎదగడంతో ఆయన్ను ఏదో ఒక స్థానంలో అకామిడేట్ చేయాల్సిన అవసరం పార్టీకి ఏర్పడిరది. అయితే సోమవారం చంద్రబాబునాయుడు రాజాం వస్తుండటంతో ఆయన్ను కలిసి శ్రీనుబాబు టిక్కెట్‌ను తెచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇక పాతపట్నం నియోజకవర్గంలో తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని అల్టిమేటం జారీ చేసిన మాజీ ఎమ్మెల్యే కలమట రమణ తాజాగా ఆదివారం తన అనుచరులతో బలప్రదర్శన చేపట్టారు. దీనికి పెద్ద ఎత్తున కలమట అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు హాజరయ్యాయి. తనకు టిక్కెట్ విషయంలో పునరాలోచించకపోతే తన బలం ఇదీ అని కలమట చెప్పే ప్రయత్నం చేశారు. తాను ఓడుతానో, గెలుస్తానో పక్కన పెడితే పాతపట్నం ఎమ్మెల్యే, ఎంపీ ఓటమికి పనికొస్తానన్న సంకేతాల్ని పంపారు. ఈయన కూడా పలాస వస్తున్న చంద్రబాబునాయుడ్ను మంగళవారం జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కలవనున్నారు. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ కుటుంబం పరిస్థితి. గొండు శంకర్‌కు ఇక్కడ టిక్కెట్ ప్రకటించిన తర్వాత కార్యకర్తల ఆగ్రహ జ్వాలలు చల్లార్చడానికి హైదరాబాద్‌లో చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. అక్కడ ఏం మాట్లాడారో తెలియదు గాని, రెండు రోజుల్లో చంద్రబాబు తన నిర్ణయం చెబుతారని అప్పలసూర్య నారాయణ బయటకొచ్చి చెప్పారు. ఆ సమయం కూడా దాటిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం ఎన్నికల వ్యూహకర్త టీమ్ నుంచి అప్పలసూర్యనారాయణకు పిలుపు వచ్చిందని, అయినా ఆయన వెళ్లడానికి ఇష్టపడలేదనే ప్రచారమైతే జరుగుతోంది. ఇది ఎంతవరకు వాస్తవమన్న విషయం పక్కన పెడితే, వీరు కూడా పలాస వస్తున్న చంద్రబాబును కలవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే గుండ కుటుంబం మీద కార్యకర్తల ఒత్తిడి ఉంది. టిక్కెట్ ప్రకటన దగ్గర్నుంచి ఏదో ఒక కారణంతో తమ నిర్ణయాన్ని అప్పలసూర్యనారాయణ కుటుంబం వాయిదా వేసుకుంటూ రావడం పార్టీకి మంచిది కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే బి`ఫారమ్ వచ్చేవరకు రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్న కొత్త కారణంతో ఇప్పుడు మరికొద్ది రోజులు వేచిచూసే ధోరణకి అప్పలసూర్యనారాయణ తెర లేపారు. జిల్లాకు వస్తున్న చంద్రబాబును కలవడం, రావడం పూర్తవుతుంది. ఆ తర్వాత ఏంటనేదే ప్రశ్న. ఈ నెల 19న జిల్లాకు సంబంధించి బి`ఫారాలు అభ్యర్థుల చేతికందనున్నాయి. అప్పటి వరకు వీరంతా వేచిచూస్తారా? లేదూ అంటే పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కోసం పని చేస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. రాష్ట్రంలో టిక్కెట్ దక్కని టీడీపీ నేతలంతా స్థానికంగా ఆ పార్టీ గెలుపు కోసం పని చేస్తున్నారు. జిల్లాలో మాత్రం వింత పరిస్థితి కనిపిస్తుంది. దీనికి శతశాతం కారణం ఆ పార్టీ అధిష్టానమే.
Comments