
రాజకీయాల్లో వారసుల పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజకీయ వారసత్వంతోనే చాలామంది పదవుల సోపానాన్ని అవలీలగా ఎక్కేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకుంటుంటారు. కొంతమంది తొలుత వారస త్వాన్ని తమ ఎదుగుదలకు వినియోగించుకున్నా తర్వాత సొంత ప్రతిభతో రాణిస్తూ తమదైన ముద్ర వేస్తుం టారు. కానీ రాజకీయ పార్టీల్లో తమది భిన్నమైనదని భారతీయ జనతా పార్టీ తరచూ చెప్పుకొంటుంటుంది. తమ పార్టీకి కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలు, క్రమశిక్షణ ఉన్నాయని, వాటిని పెద్దాచిన్నా తేడా లేకుండా అందరికీ సమానస్థాయిలో వర్తింపజేస్తుంటామని మిగతా పార్టీల్లో ఇటువంటి కట్టుబాట్లు లేవని ఎద్దేవా చేస్తుంటుంది. రాజకీయాల్లో 75 ఏళ్లు దాటిన వారికి కచ్చితంగా విశ్రాంతి ఇవ్వడం, వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించక పోవడం, ఒక నేతకు మూడుసార్లకు మించి పదవులు ఇవ్వరాదన్న నిబంధనలను తమ పార్టీలో కచ్చితంగా అమలు చేస్తుంటామని కమలనాధులు ఘనంగా చెప్పుకొంటుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఆ పార్టీలో ఈ కట్టుబాట్లను తీసి పక్కన పెడుతున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వారసత్వ రాజకీయాల విష యంలో బీజేపీ తన సిద్ధాంతాన్ని తానే ఉల్లంఘిస్తోంది. రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో చాలామంది బీజేపీ నేతల వారసులు పదవులు అనుభవిస్తున్నారు. అంతెందుకు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం నడిపిన యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిలో ఉండానే ఆయన కుమారులు ఇద్దరూ కర్ణాటక బీజేపీలో కీలక పాత్ర పోషి స్తున్నారు. వారిలో ఒకరైన విజయేంద్ర ఆ పార్టీ ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. మరో కుమారుడు రాఘవేంద్ర కూడా పార్టీలో కీలకంగా ఉన్నారు. ఇక తాజాగా ప్రస్తుతం జాతీయస్థాయిలో కమల దళాన్ని, ఎన్డీయే సర్కారును తమ కనుసన్నల్లో నడిపిస్తున్న ద్వయంలోని ఒకరైన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పుత్రరత్నం కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఇంతవరకు క్రికెట్ భారతాన్ని శాసిస్తున్న ఆయన ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏలేందుకు సిద్ధమయ్యారు. అయితే క్రికెట్‌కు, రాజకీయాలకు సంబంధం ఏమిటన్న సందేహం కలగవచ్చు. ఈ రోజుల్లో క్రీడలు, రాజకీయాలు కలగలిసిపోయాయి. దేశంలోని దాదాపు ప్రతి క్రీడా సంఘాన్ని రాజకీయ నాయకులు లేదా వారి వారసులే నడిపిస్తున్నారు. తమ తండ్రుల రాజకీయ పరపతితో ఆయా క్రీడాసంఘాల కార్యవర్గ ఎన్నికల్లో విజయం సాధిస్తూ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికవుతూ వాటిని తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నారు. తమ భవిష్యత్తు రాజకీయానికి వాటిని పావులుగా వాడుకుంటున్నారు. అందులోనూ మిగిలిన క్రీడాసంఘాల కంటే మన దేశంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చాలా పవర్‌ఫుల్. ఆర్థికంగా అత్యంత సంపన్న సంఘం కూడా. వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్న భార తీయ క్రికెట్ సంఘాన్ని కాంగ్రెస్ హయాంలో చాలా ఏళ్లు సురేష్ కల్మాడీ అనే మహారాష్ట్ర ఎంపీ పెత్తనం చెలా యించి రాజకీయాల్లో ఎదిగితే.. తర్వాత కాలంలో శరద్‌పవార్, ఎన్‌కేపీ సాల్వే, జగ్‌మోహన్ దాల్మియా, అరుణ్ జైట్లీ వంటి నేతలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఎన్నికై కీలకపాత్ర పోషించారు. వాటి ఆధారంగానే రాజ కీయాల్లోనూ రాణించారు. అందువల్ల రాజకీయాలు, క్రికెట్ రెండిరటినీ విడదీసి చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు అమిత్‌షా వారసుడైన జైషా బీసీసీఐ కార్యదర్శి స్థాయికి ఎదగడం.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నిక అయిన క్రమాన్ని పరిశీలిస్తే అంతర్లీనంగా రాజకీయ ప్రభావం కచ్చితంగా కనిపి స్తుంది. తండ్రి అమిత్‌షా రాజకీయ రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే.. అదే సమయంలో తనయుడు జైషా కూడా స్వరాష్ట్రమైన గుజరాత్ నుంచి క్రికెట్ రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు. 35 ఏళ్ల చిన్న వయసులోనే ఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికైన ఆయన చిన్నతనం నుంచి క్రికెటర్ అవ్వాలనుకుని.. చివరికి క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదిగారు. చదువు పూర్తి అయిన తర్వాత కుటుంబ వ్యాపారమైన పైపుల బిజినెస్ చేపట్టారు. స్టాక్ బ్రోకర్‌గా కూడా కొన్నాళ్లు పని చేశారు. తండ్రి అమిత్‌షా అడుగుజాడల్లో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత వ్యాపారంపై దృష్టి సారించారు. ఒకవైపు వ్యాపార రంగంలో కొనసాగుతూనే మరోవైపు క్రికెట్ పాలకవర్గ వ్యవహారాల్లోకి ప్రవేశించారు. 2009లో గుజరాత్ క్రికెట్ సంఘం పాలకవర్గంలో ఎగ్జిక్యూ టివ్ మెంబర్‌గా తొలిసారి ఎన్నికయ్యారు. అదే సమయంలో తండ్రి అమిత్‌షా గుజరాత్‌లోని నరేంద్రమోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం ఆయనకు కలిసివచ్చింది. 2013లో గుజరాత్ క్రికెట్ సంఘం జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించి తొలిసారి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టగా, ఆయనతో పాటే అమిత్‌షా కూడా ఆయన కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టి నెంబర్ టూ స్థానంలో కొనసాగుతున్నారు. దాదాపు అదే సమయంలో అంటే 2015లో జైషా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లోని సభ్యుడిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. 2019 సెప్టెంబర్‌లో బీసీసీఐ కార్యదర్శి పదవికి ఎన్నికయ్యారు. 2021లో అసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవికి కూడా ఎన్నికైన ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్ గంగూలీ పదవీ కాలం ముగిసి రోజర్‌బిన్నీ ఆ పదవి చేపట్టినా బీసీసీఐ వ్యవహారాల్లో జైషా హవాయే సాగుతోంది. అసలు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడమే రాని జైషా తండ్రి రాజకీయ పరపతితోనే అత్యంత వేగంగా క్రికెట్ పాలకమండలిని శాసించే స్థాయికి ఎదిగారన్న విమర్శలు చాలాకాలం నుంచే ఉన్నాయి. ఆ విమర్శల మాటెలా ఉన్నా భారత క్రికెట్ సంఘాన్ని అత్యంత సంపన్న సంఘంగా, అదిపెద్ద ఆదాయ వనరుగా మార్చడంలో లలిత్‌మోదీ తర్వాత జైషాదే కీలకపాత్ర అనడంలో సందేహం లేదు.
Comentarios