top of page

తాతల ముత్తాతల నుంచి వైద్యులే..!

Writer: DV RAMANADV RAMANA
  • 8 తరాలుగా ‘ఈశ్వర సూర్య’ వంశం సేవలు

  • 1885లో వైద్యం అందించేందుకు శ్రీకాకుళం రాక

  • డాక్టర్‌ సంపత్‌కు ముందు నాలుగు, తర్వాత మూడు తరాలు

  • చికిత్సలతో పాటు సొంతంగా ఆయుర్వేద మందుల తయారీ

  • పాతికేళ్లకు పైగా సమాజ సేవలో సంపత్‌కుమార్‌


అమ్మ జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు. చివరికి ఆ అమ్మకు సైతం కాన్పు సక్రమంగా జరిగేట్లు చూసి మరో జన్మనివ్వడమే కాకుండా.. రకరకాల వ్యాధుల బారిన పడి, ప్రమాదాలకు గురై మరణం అంచులో ఉన్నవారిని సైతం చికిత్సతో సురక్షితంగా మళ్లీ లోకంలోకి తేగలిగినవాడు ఒక్క వైద్యుడే. అందుకే వారిని వైద్యో నారాయణో హరిః.. అంటే కనిపించే దేవుడని అంటారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి సమాజంలో ప్రత్యేక స్థానం అప్పటికీ ఇప్పటికీ ఉంటుంది. ఒక ఇంట్లో ఏ ఒక్కరు వైద్యుడిగా ఉన్నా.. ఆ కుటుంబం మొత్తానికి అదే స్థాయిలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అటువంటిది తరతరాలుగా వైద్యవృత్తికి అంకితమై.. అదే సేవాభావంతో కొనసాగిస్తున్న కుటుంబానికి ఎంతటి విశిష్టత ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. వైద్యం వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లోనూ తరతరాలుగా వ్యాపారధోరణితో కాకుండా సేవాతత్పరతతో వైద్యసేవలు అందిస్తున్న ఒక కుటుంబం మనమధ్యే.. మన శ్రీకాకుళంలోనే ఉండటం విశేషం. అదే.. ఏడురోడ్ల జంక్షన్‌ సమీపంలో ధన్వంతరి క్లినిక్‌ పేరుతో వైద్య వృత్తి నిర్వహిస్తున్న డాక్టర్‌ ఈశ్వరసూర్య సంపత్‌కుమార్‌ కుటుంబం. ఎనిమిది తరాలుగా ఈ కుటుంబీకులు వైద్యానికి చిరునామాగా మారారు. డాక్టర్స్‌ డే సందర్భంగా ఆ కుటుంబం వంశవృక్షం.. వారు అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఆధునిక వైద్యం పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులు, ప్రైవేట్‌ క్లినిక్‌లు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్న ఈ రోజుల్లో ఈ తరం వారికి తెలియకపోవచ్చమోగానీ.. కొన్ని దశాబ్దాలుగా నగరంలోని ఏడురోడ్ల జంక్షన్‌ సమీపంలో ఉన్న ధన్వంతరి క్లినిక్‌ శ్రీకాకుళం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు పెద్దదిక్కుగా ఉండేది. డాక్టర్‌ ఈశ్వరసూర్య సంపత్‌కుమార్‌ దాదాపు అర్థశతాబ్ద కాలంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈయన కుటుంబమే వైద్యవృత్తికి మారుపేరుగా నిలుస్తోంది. ఈ వృత్తితో మమేకమైన ఈశ్వర సూర్య వంశంలో సంపత్‌కుమార్‌ ఐదో తరంవారు కాగా.. ఆయన అటు నాలుగు, ఇటు మూడు తరాలకు చెందిన పలువురు వైద్యవృత్తిలోనే కొనసాగారు.. ఇప్పటికీ కొనసాగుతున్నారు. దాదాపు ఒకటిన్నర శతాబ్దాల నుంచి.. అంటే 140 ఏళ్ల క్రితం నుంచి వైద్యవృత్తికే అంకితమవుతున్నారు. తొలినాళ్లలో ఆయుర్వేద వైద్యంలో ప్రసిద్ధిగాంచిన ఈ కుటుంబం ఇప్పుడు ఆయుర్వేదంతో పాటు అల్లోపతి(ఇంగ్లిష్‌) వైద్యంలోనూ సేవలు అందిస్తోంది. అంతేకాకుండా సొంతంగా ఆయుర్వేద మందుల తయారీలోనూ ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుత అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం ఒకప్పుడు శ్రీకాకుళానికి వచ్చి స్థిరపడిరది. తర్వాత ఇక్కడి నుంచే ఈ కుటుంబానికి చెందిన పలువురు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌ దేశాల్లోనూ ఉన్నత వైద్యసేవల్లో కొనసాగుతూ తమ వంశ ఖ్యాతిని, శ్రీకాకుళం విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

ఒకటిన్నర శతాబ్ది క్రితం..

శ్రీకాకుళం వైద్యరంగానికి వన్నె తెచ్చిన ‘ఈశ్వర సూర్య’ వంశ మూలాలు ఒకప్పటి విశాఖ జిల్లా.. ప్రస్తుత అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలో కనిపిస్తాయి. డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ముత్తాతకు తాత అయిన ఈశ్వర సీతారామశాస్త్రి ఈ వంశంలో తొలితరం వైద్యుడు. ఆయన శ్రీకాకుళం వచ్చి స్థిరపడటానికి దారితీసిన కారణాలు కూడా ఆసక్తికరమైనవే. అప్పట్లో చోడవరం ప్రాంతంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరున్న సీతారామశాస్త్రికి ఆరోజుల్లో మద్రాస్‌ రాష్ట్రంలో భాగంగా ఉన్న బరంపురాన్ని పాలించే రాజు బంగారు పతకం ప్రకటించారు. దాన్ని అందుకోవడానికి బరంపురం బయల్దేరి ఆయన మార్గమధ్యంలో విశ్రాంతి కోసం శ్రీకాకుళంలో దిగి చింతావారి సత్రంలో బస చేశారు. ఆ సమయంలో ఆ సత్రం యజమాని అయిన జమిందారు కంటి సమస్యతో బాధపడుతుండేవారు. తమ సత్రంలో బస చేసిన శాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడని తెలుసుకున్న జమిందారు ఆయన్ను పిలిపించి తన సమస్య చెప్పారు. అయితే తాను బరంపురం వెళ్తున్నానని, తిరిగి వచ్చాక పూర్తిస్థాయి వైద్యం చేస్తానంటూ అంతవరకు వాడటానికి ఒక మందు ఇచ్చారు. ఆయన తిరిగి వచ్చేలోగానే ఇచ్చిన మందు మంచి గుణం చూపించి, స్వస్థత చేకూర్చింది. దాంతో సీతారామశాస్త్రి వైద్యంపై గురి కుదిరిన జమిందారు ఆయన్ను శ్రీకాకుళంలోనే ఉండిపోమని కోరారు. ఈ ప్రాంతంలో సరైన వైద్యులు లేక ప్రతి చిన్న సమస్యకూ ప్రజలు విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని.. అందువల్ల ఇక్కడే ఉండి వైద్యసేవలు అందించగలిగితే అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జమిందారు విజ్ఞప్తికి అంగీకరించిన సీతారామశాస్త్రి శ్రీకాకుళంలో స్థిరపడిపోయారు.

ఇదీ వంశవృక్షం..

అలా సీతారామశాస్త్రితో శ్రీకాకుళంలో తొలితరం ఈశ్వర వంశీకుల వైద్య ప్రస్థానం మొదలైంది.

  • సీతారామశాస్త్రి తదనంతరం ఆయన కుమారుడు ఈశ్వర సత్యనారాయణ శర్మ(సంపత్‌కుమార్‌ ముత్తాత) వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయుర్వేద వైద్యుడిగా చాలా ఏళ్లు వ్యవహరించారు. వైద్యుడిగానే కాకుండా శ్రీవిద్య ఉపాసకుడిగా ఈయన పేరుప్రఖ్యాతులు సాధించారు. ఎంతోమంది ప్రముఖులు ఈయన శిష్యరికంలోనే తర్వాత కాలంలో ఉపాసకులుగా ఎదిగారు. అదే సమయంలో ఆయన ప్రస్తుత ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్లో సంస్తృత భాష ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. 1904లో శ్రీశర్మద వైద్యశాల పేరుతో సొంతంగా ఆయుర్వేద మందుల తయారీని కూడా ప్రారంభించి తక్కువ ధరకే రోగులకు మందులు అందజేసేవారు.

  • సత్యనారాయణ శర్మ అనంతరం ఆయన కుమారుడు ఈశ్వర సూర్యనారాయణ శర్మ(సంపత్‌కుమార్‌ తాత) ఆయుర్వేద వైద్యం కొనసాగిస్తూ.. మందుల తయారీని విస్తరించి 1950 వరకు శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒడిశా రాష్ట్రానికి కూడా సరఫరా చేసేవారు.

  • తర్వాత ఆయన కుమారుడు ఈశ్వర సీతారామ ధన్వంతరి(సంపత్‌కుమార్‌ తండ్రి) మద్రాస్‌లో ఎల్‌ఐఎం(లైసెన్సియేట్‌ ఇన్‌ ఇండియన్‌ మెడిసిన్‌) కోర్సు చేసి వైద్య వృత్తిలో ప్రవేశించారు. ఈయన హయాంలోనే ఈ వంశంలో ఆయుర్వేదంతో పాటు అల్లోపతి వైద్యసేవలు ప్రారంభమయ్యాయి.

  • కుటుంబపరంగా వస్తున్న వైద్యవృత్తికి కొనసాగింపుగా సీతారామ ధన్వంతరి కుమారుడు ఈశ్వర సూర్య సంపత్‌కుమార్‌ కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ కోర్సు చేసిన అనంతరం 1978లో ఈ వృత్తిలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పిల్లలు, కుటుంబ వైద్యుడి(జనరల్‌ మెడిసిన్‌)గా కొనసాగుతున్నారు.

  • సంపత్‌కుమార్‌ చిన్నాన్న ఈశ్వర దినమణి కామేశ్వరరావు కుమారుడైన రఘురామచంద్ర శర్మ శర్మద వైద్యశాలను నడుపుతూ ఆయుర్వేదం వైద్యం అందిస్తున్నారు.

  • సంపత్‌కుమార్‌ మరో చిన్నాన్న వేణుగోపాలరావు కూడా కొన్నాళ్లు అమెరికాలో ఉండి, తర్వాత శ్రీకాకుళంలో ఆయుర్వేద డాక్టర్‌గా కొనసాగుతున్నారు.

  • విదేశాల్లో పలువురు

  • సంపత్‌కుమార్‌ పెద్ద మేనత్త కుమారుడు సంపత్‌కుమార్‌ అమెరికాలో జనరల్‌ మెడిసిన్‌లో ఇంటెన్సివ్‌ కేర్‌ స్పెషలిస్ట్‌గా ఉన్నారు.

  • మరో మేనత్త కుమార్తె డాక్టర్‌ మైథిలి లండన్‌లో సైకియాట్రిస్ట్‌గా కొనసాగుతున్నారు.

  • మరో చిన్నాన్న రమణమూర్తి మనవరాలు డాక్టర్‌ సునీత పిడియాట్రిస్ట్‌గా ఉన్నారు.

  • డాక్టర్‌ సంపత్‌కుమార్‌ కుమార్తె డాక్టర్‌ మనోజ బాలకామేశ్వరి టోరెంటోలోని కెనడా క్యాన్సర్‌ రీసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌లో రీసెర్చ్‌ చేస్తున్నారు.

  • సంపత్‌కుమారు సోదరుడైన మార్తాండ శాస్త్రి కుమారుడు ఈశ్వర కార్తీక్‌ ఎండీఎస్‌ చేసి తమిళనాడులోని సేలం మెడికల్‌ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

పేదలకు ఉచిత వైద్యసేవలు

వైద్యాన్నే వంశానుగత వృత్తిగా మార్చుకున్న డాక్టర్‌ సంపత్‌కుమార్‌ దాదాపు 25 ఏళ్లుగా పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ), లయన్స్‌ క్లబ్‌, సత్యసాయి సేవాసంస్థలు, రెడ్‌క్రాస్‌ వంటి సంస్థల్లో శాశ్వత సభ్యుడిగా ఉన్న ఆయన ఇప్పటివరకు సుమారు రెండువేల వైద్య శిబిరాలు నిర్వహించారు. వీటిలో పలు సంస్థలకు అధ్యక్ష, కార్యదర్శి పదవులు కూడా నిర్వహించారు. సంపత్‌కుమార్‌ సేవలను గుర్తించి గ్లోబల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ హెల్త్‌ అనే సంస్థ బెస్ట్‌ డాక్టర్‌ పురస్కారంతో పాటు చికిత్సరత్న బిరుదు కూడా ఇచ్చింది. ఇప్పటికీ నగరంలోని పెద్ద మందిరంలో ప్రతి ఆదివారం జరిగే ఉచిత వైద్యశిబిరంలో సంపత్‌కుమార్‌ పాల్గొని సేవలు అందిస్తున్నారు. అనాథాశ్రమాలు, స్త్రీసదన్‌ వంటి వాటిలో ఆశ్రయం పొందుతున్నవారికి తరచూ ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేస్తుంటారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page