తొందరపాటు, లేటు.. రెండూ అనర్థదాయకమే!
- DV RAMANA

- Jul 13
- 2 min read

భారతీయ సమాజం ఆధునిక భావాలను, పోకడలను ఎంత ప్రోత్సహిస్తుందో.. సనాతన సంప్రదాయాలను అంతేస్థాయిలో గౌరవిస్తుంది. రెండింటి సమ్మేళనమే భారతదేశం అని చెప్పవచ్చు. అయితే ప్రపంచంపై జనాభా హెచ్చుతగ్గులు చూపే ప్రభావాలపై విస్తృత చర్చ జరుగుతున్న ఈ సమయంలో భారతీయ సమాజం పరస్పర విరుద్ధమైన రెండు ప్రభావాల మధ్య నలిగిపోతున్నది. వాటిలో మొదటిది బాల్యవివాహ సంప్రదాయం కాగా.. రెండోది ఆధునిక యువత వివాహాలను వాయిదా వేసుకుంటుండటం. ఈ రెండూ కూడా సమాజానికి చెడు చేసేవే కావడం విచారకరం. తెలిసీ తెలియని వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేసి కుటుంబ వ్యవస్థ అనే చట్రంలో బంధించేయడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అనర్థాలను తప్పించేందుకు ఎందరో సంఘ సంస్కర్తలు బాల్యవివాహ వ్యవస్థపై పోరాటాలు చేశారు. చివరికి ప్రభుత్వం ఈ దురాచారాన్ని చట్టపరంగా నిషేధించి.. స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయసును నిర్ణయించి చట్టంలో పొందుపర్చింది. దీనికి తోడు సమాజం ఎంత ఆధునికతను సంతరించుకుంటున్నా, విద్యా ప్రమాణాలు పెరుగుతున్నా, ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, కొన్ని పట్టణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో ఆధునిక యువత వివాహ వయసు వచ్చినా కూడా పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తున్నారు. చదువులు పూర్తి అయిన తర్వాత కెరీర్ నిర్మాణం, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత లక్ష్యాల సాధన వంటి వాటికే ప్రాధాన్యత ఇస్తూ.. వాటి తర్వాతే పెళ్లి అంటున్నారు. ఈ రెండూ భిన్నధోరణులు వ్యక్తిగత జీవితాలనే కాకుండా భవిష్యత్తు తరాల ఆరోగ్యం, కుటుంబ బంధాలు, జనాభా సమతూకం, సామాజిక స్థిరత్వం తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు చేసిన చట్టాలు అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు కనీస వివాహ వయసుగా నిర్దేశించినా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2019`21 సర్వే నివేదిక ప్రకారం దేశంలో 23.3 శాతం బాలికలు మైనారిటీ తీరకముందే అంటే.. 18 ఏళ్లు నిండకముందే వివాహ బంధంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ 41.60 శాతం బాల్య వివాహాలతో అగ్రస్థానంలో ఉండగా.. దాని వెనుకే 40.8 శాతం బాల్యవివాహాలతో బీహార్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మన తెలుగు రాష్ట్రాలు కూడా టాప్ టెన్‌లోనే ఉండి ఆందోళన కలిగిస్తున్నాయి. 29.30 శాతం బాల్యవివాహాలతో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉండగా, 23.5 శాతంతో తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది. నిత్యం కల్లోలంగా ఉండే జమÖ్మకశ్మీర్ ఈ విషయంలో మాత్రం చాలా మెరుగ్గా ఉంది. ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు అత్యల్పమని గణాంకాలు చెబుతున్నాయి. అబ్బాయిల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. దేశవ్యాప్తంగా 17.70 శాతం అబ్బాయిలు 21 ఏళ్లు నిండకముందే వివాహాలు చేసుకుంటున్నట్లు తేలింది. ఈ విషయంలో బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉండగా, తెలంగాణలో 16.30 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 14.50 శాతం యువకులు కనీస వివాహ వయసు దాటకముందే ఓ ఇంటివారైపోతున్నారు. దీనివల్ల జనాభా వృద్ధి, సమతుల్యత దెబ్బతిని సామాజికాభివృద్ధి దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. సామాజిక, ఆర్థికపరమైన కారణాలు బాల్యవివాహాలకు దారితీస్తున్నయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అమ్మాయిల విషయంలో ఇవి మరింత ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. పేదరికం కారణంగా ఆడపిల్లలను మధ్యలోనే చదువు మాన్పించేయడం, అప్పోసప్పో చేసి సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసేసి అమ్మాయిలను కాపురానికి పంపేసి భారం దించేసుకోవాలన్న తల్లిదండ్రుల ఆలోచనలు ఇందుకు దోహదం చేస్తుంటే.. అమ్మాయి వయసు, చదువు పెరుగుతున్న కొద్దీ మగపిల్లలు దొరకడం కష్టమవుతుందని, దొరికినా కట్నాలు అధికంగా సమర్పించుకోవాల్సి వస్తుందన్న భయాలు, ప్రేమ వ్యవహారాల ఆందోళనలు వారిని తరుముతున్నాయి. బాల్యవివాహాల పరిస్థితి ఇలా ఉంటే.. నేటి యువతల ఓ సరికొత్త ధోరణి శరవేగంగా పెరుగుతోంది. వివాహం కంటే వారు జీవితంలో ఎదుగుదలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉన్నత చదువుల, విదేశీ ఉద్యోగాలు, కెరీర్ నిర్మాణం, ఆర్థిక స్థిరత్వం, స్వేచ్ఛాయుత జీవనం వంటి కారణాలతో వివాహ నిర్ణయాలను ఏళ్ల తరబడి వాయిదా వేస్తున్నారు. లేటు వయసులో వివాహం చేసుకున్నాక కూడా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటూ పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఇటువంటి నిర్ణయాలు అనేక సందర్భాల్లో జీవితాంతం బాధపడేలా చేస్తున్నాయి. ఇదే సమయంలో వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు, బిజీ జీవనశైలి సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటికితోడు లేటు వివాహాలు, లేటు గర్భాధారణలు వైద్యపరమైన సమస్యలు సృష్టిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా సంతానలేమి చికిత్సా కేంద్రాలు, ఐవీఎఫ్ కేంద్రాలు వంటి కృత్రిమ విధానాల వైపు అనివార్యంగా మరలాల్సి వస్తున్నది. మహిళల్లో 35 ఏళ్ల తర్వాత గర్భాధారణ అవకాశాలు తగ్గడంతో పాటు గర్భస్రావాల సమస్య పెరుగుదల, ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని శాస్త్రీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇక పురుషుల్లో వయసు, టెన్షన్లు, జీవన విధానాలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి. కెరీర్, ఆర్థిక సమతుల్యత అవసరమే అయినప్పటికీ జీవితంలో ప్రతిదశకు ఒక ప్రాధాన్యముంటుంది. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. లేకపోతే జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. బాల్య వివాహాల వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం ప్రమాదంలో పడితే.. లేటు వివాహాలు, లేటు జననాల వల్ల వృద్ధ జనాభా పెరిగిపోయి సామాజిక విధ్వంసానికి దారితీస్తుంది.






Comments