`పెరుగుతున్న ఎన్డీయే కూటమి కష్టాలు
`ఫలించని బుజ్జగింపులు.. టీడీపీ నుంచి ఆరుగురి సస్పెన్షన్
`16 నియోజకవర్గాల్లో సవాల్ చేస్తున్న రెబల్స్
`50 సెగ్మెంట్లలో స్వతంత్రులకు జనసేన గుర్తు
`కూటమిలో గుబులు రేపుతున్న తాజా పరిణామాలు
`హోరాహోరీ పోరులో ఓట్లు చీలితే నష్టపోతామని ఆందోళన
ఎన్నికల రచ్చబండ - డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన వైకాపాను ఎలాగైనా గద్దె దించాలి.. మళ్లీ అధికారంలోకి రావాలి.. అన్న ఏకైక లక్ష్యంతో కూటమి కట్టిన ఎన్డీయే పక్షాలకు ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు వెంటాడుతున్నాయి. ఉమ్మడిగా ఎదుర్కొంటేనే జగన్‌ను ఓడిరచగలమన్న భావంతో చాలాకాలం తర్జనభర్జనలు పడిన అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఏకతాటిపైకి వచ్చాయి. దాంతో ఆ పార్టీల్లో ఒక్కసారి జోష్ పెరిగింది. ఎన్నికల పోరు హోరాహోరీగా మారింది. అయితే సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూటమి పక్షాల్లో గందరగోళానికి దారి తీసింది. టీడీపీ బలంగా ఉన్న స్థానాలను జనసేన, బీజేపీలకు కేటాయించారని.. జనసేనకు కేవలం 21 సీట్లే ఇచ్చారని, పేరుకు పొత్తులు పెట్టుకున్నా టీడీపీ నేతలనే జనసేన, బీజేపీల్లోకి పంపి టికెట్లు ఇప్పించుకున్నారని విమర్శలు చెలరేగాయి. ఆయా పార్టీల్లోని నాయకులు దీనికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టారు. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అసమ్మతి మంటలు రాజేసింది. టికెట్లు దక్కనివారు తిరుగుబాటు బావుటా ఎగురవేసి కూటమి అభ్యర్థులకు పోటీగా నామినేషన్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30, 40 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపించింది. మూడు పార్టీలకు చెందిన ఆశావహులు పోటీ అభ్యర్థులుగా నిలవడం తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు జనసేన ఎన్నికల గుర్తు వ్యవహారం కూటమిని సంకట స్థితిలోకి నెట్టింది. జనసేన గుర్తు అయిన గాజుగ్లాసును ఎన్నికల అధికారులు ఫ్రీ సింబల్‌గా పరిగణించి, ఆ పార్టీ పోటీలో లేని అనేక నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో కూటమి గుండెల్లో రాయి పడిరది. సుమారు 50 నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉత్పన్నం కావడంతో దీనిపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది.
ఫలించని బుజ్జగింపులు.. బరిలోనే రెబల్స్
ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పోటీకి నిర్ణయించుకుని ఎన్డీయే గొడుగు కింద చేరాయి. ఆ మేరకు సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి. జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లు, బీజేపీ పది అసెంబ్లీ, ఆరు లోక్‌సభ సీట్లకు, మిగిలిన 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ సీట్లలో టీడీపీ పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే నియోజకవర్గాల కేటాయింపు వద్దకు వచ్చేసరికి పరిస్థితి తిరగబడిరది. మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో అవకాశం కోల్పోయిన, తమ పార్టీయే పోటీ చేస్తున్నప్పటికీ టికెట్లు దక్కని మూడు పార్టీల ఆశావహులు అసంతృప్తి రగిలిపోయారు. ఎలాగైనా పోటీ చేసి తమ సత్తా చాటుతామని ప్రకటించి పలువురు నేతలు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. రాష్ట్రంలో 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కూటమి పార్టీలు తిరుగుబాటు బెడదను ఎదుర్కొనాల్సి వచ్చింది. వారిని బుజ్జగించేందుకు ఆయా పార్టీల నాయకత్వాలు చేసిన ప్రయత్నాలు పాక్షికంగా ఫలించాయి. కొందరు మాత్రమే మెత్తబడి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరికొంతమంది మాత్రం పార్టీ అధిష్టానాల మాటలకు ఏమాత్రం లొంగలేదు. నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దాంతో రాష్ట్రంలో ని 16 నియోజకవర్గాల్లో కూటమి పార్టీలకు తిరుగుబాట్ల బెడద తప్పడంలేదు. నూజివీడు, మాడుగల తదితర కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ రెబల్ అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తిరుగుబాటు బెడద ఉన్న 16 నియోజకవర్గాల్లో అత్యధికంగా టీడీపీకి తొమ్మిది చోట్ల, మిగిలిన ఏడు చోట్ల జనసేన, బీజేపీల అధికారిక అభ్యర్థులకు రెబల్స్ పోటు తప్పేలా లేదు. వీరి వల్ల కూటమి ఓట్లు చీలిపోయే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎక్కడెక్కడ అంటే..
మాజీమంత్రి పరిటాల సునీత పోటీ చేస్తున్న రాప్తాడులో సాకే రాజేష్, నెల్లూరు జిల్లా కావలిలో పసుపులేటి సుధాకర్, చిత్తూరు జిల్లా సత్యవేడులో జేడీ రాజశేఖర్, యాతాటి రమేష్‌బాబు, చిత్తూరు జిల్లా పలమనేరులో దామోదరనాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, విజయనగరంలో అశోక్‌గజపతి రాజు కుమార్తె అదితిపై మీసాల గీత, అల్లూరి జిల్లా అరకులో సివేరి అబ్రహం, రెబల్స్‌గా ఎన్నికల బరిలో కొనసాగుతున్నారు. కాగా హిందూపురంలో సినీనటుడు బాలకృష్ణపై బీజేపీ రెబల్‌గా స్వామి పరిపూర్ణానంద బరిలో నిలిచారు. ఎచ్చెర్ల, టెక్కలి, గన్నవరం, మాచర్ల, పోలవరం నియోజకవర్గాల్లో అక్కడి కూటమి అభ్యర్థులను బీజేపీ తిరుగుబాటుదారులు సవాల్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం సీటును జనసేనకు కేటాయించినందుకు నిరసనగా టీడీపీ నేత ముడియం శ్రీనివాస్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ నేత పరమట శ్యామ్‌కుమార్ పోటీలో కొనసాగుతున్నారు. పెడన, జగ్గంపేట నియోజకవర్గాల్లో కూడా టికెట్ దక్కని జనసేన నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. వీరిని బుజ్జగించి, పోటీ నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో పలువురు తిరుగుబాటు నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. సస్పెండ్ అయిన వారిలో సివేరి అబ్రహం, మీసాల గీత, పరమట శ్యావమ్‌కుమార్, ముడియం సూర్యచంద్రరావు, వేటుకూరి శివరామరాజు, జేడీ రాజశేఖర్ ఉన్నారు.
గ్లాస్ గుర్తుతో మరో సమస్య
ఇప్పటికే తిరుగుబాటు బెడద ఎదుర్కొంటున్న కూటమికి తాజాగా జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజుగ్లాసు భయపెడుతోంది. నిబంధనల మేరకు చివరిసారి పోటీ చేసిన ఎన్నికల్లో కనీసం ఆరు శాతం ఓట్లతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచిన పార్టీలనే గుర్తింపు పార్టీలుగా పరిగణించి ఎన్నికల సంఘం శాశ్వత గుర్తు కేటాయిస్తుంది. ఆ గుర్తును ఇతరులెవరికీ కేటాయించరు. కానీ జనసేన గత ఎన్నికల్లో ఆరు శాతం వరకు ఓట్లు సంపాదించినా, ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే గెలిచింది. దాంతో గుర్తింపు పొందిన పార్టీ అన్న అర్హత సాధించలేకపోయింది. ఆ మేరకు జనసేనకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది. అంటే ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తారన్నమాట. అయితే జనసేన చేసుకున్న ప్రత్యేక విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్న చోట వారికే గ్లాసు గుర్తు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది. ఇక్కడే సమస్య ప్రారంభమైంది. టీడీపీ, బీజేపీలతో పొత్తులో ఉన్న జనసేన ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లకు మాత్రమే పోటీ చేస్తుండగా.. ఆయా స్థానాల్లో జనసేన అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయించారు. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థుల కోరిక మేరకు పలు చోట్ల వారికి కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాల్లో ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న జనసేన మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గుండెల్లో రాయి పడిరది. జనసేన అభిమానులు గందరగోళానికి గురై గ్లాసు గుర్తుపై ఓట్లు వేసేస్తే తాము నష్టపోతామని ఆ రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈవీఎంలో పేరు చూసి కాకుండా గుర్తును చూసి ఓటేసే వారే ఎక్కువ కావడంతో.. ఇప్పుడు వాళ్లు చీల్చే ప్రతి ఓటు కూటమికి చేటు చేస్తుందంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస, టెక్కలి, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు కేటాయించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రామచంద్రాపురం, కొత్తపేట, ముమ్మడివరం, మండపేట నియోజకవర్గాల్లో, తూర్పు గోదావరి జిల్లాలో పది చోట్ల, కర్నూలు జిల్లా నాలుగు చోట్ల, విజయనగరంలో టీడీపీ రెబల్ మీసాల గీత, అనకాపల్లి పార్లమెంట్ దళిత బహుజన పార్టీ అభ్యర్థికి వడ్లమూరి కృష్ణ స్వరూప్, రాజమండ్రి పార్లమెంట్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థి మేడా శ్రీనివాసరావు, జగ్గంపేటలో స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రలకు గాజు గ్లాస్ కేటాయించారు. కృష్ణా జిల్లా మైౖలవరం అసెంబ్లీ సెగ్మెంట్‌లో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్, విజయవాడ సెంట్రల్‌లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్, విజయవాడ పార్లమెంట్ నవతరం పార్టీ అభ్యర్ధి కృష్ణకిషోర్, పెదకూరపాడులో స్వతంత్ర అభ్యర్ధి నంబూరు కల్యాణ్ బాబు, గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణ, మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్ధి రావు సుబ్రహ్మణ్యం, మదనపల్లెలో ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్, టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్‌లకు అక్కడి రిటర్నింగ్ అధికారులు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పొత్తు ధర్మం ప్రకారం పోటీలో ఉన్న టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు పడాల్సిన జనసేన ఓట్లు గ్లాసు గుర్తుతో పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు పడే అవకాశం ఉంది. ఈ పరిణామం విజయావకాశాలను కూడా దెబ్బతీస్తుందన్న ఆందోళన కూటమిలో వ్యక్తమవుతోంది.
కోర్టును ఆశ్రయించిన జనసేన
తమ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం వాదనలు జరిగాయి. రాష్ట్రంలో తమ పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోందని, మిగిలిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నందున ఆ పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని జనసేన తరఫున వాదనలు వినిపించారు. ఆ నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే తమ మిత్రపక్షాలకు నష్టం వాటిల్లుతుందని వాదించింది. దీనిపై ఎన్నికల సంఘం న్యాయవాది మాట్లాడుతూ గుర్తుకు సంబంధించి నిబంధనలు, గాజుగ్లాసు గుర్తు వివాదంపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుని, పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. దాంతో విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.
Comentários