
`ఆమదాలవలసలో తొమ్మిదిసార్లు ఆ కుటుంబానిదే గెలుపు
`ఏడు దశాబ్దాలుగా అండగా నిలిచిన నియోజకవర్గ ఓటర్లు
`ప్రస్తుతం తిరగబడిన పరిస్థితి.. వ్యతిరేక పవనాలు
`కుటుంబ పెత్తనం పెరిగిందంటూ ప్రజల్లో అసంతృప్తి
`సొంత పార్టీలోనూ సీతారాం పొడ గిట్టని పరిస్థితి
ఎన్నికల రచ్చబండ ` డి.వి.రమణ
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కుటుంబాలు కొన్నే ఉంటాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ కుటుంబాలే పోటీ చేయడమో, నిర్ణయాత్మక పాత్ర పోషించడమో జరుగుతుంటుంది. ఆయా నియోజకవర్గాల్లో ఆ కుటుంబాలు లేకుండా ఎన్నికలను ఊహించలేని పరిస్థితి ఉంటుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. శ్రీకాకుళం జిల్లా వరకు చూస్తే అటువంటి తమ్మినేని కుటుంబం ఆ కోవలోకే వస్తుంది. ఆమదాలవలస కేంద్రంగా ఈ కుటుంబం పలు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయాలు చేస్తూ వస్తోంది. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ తమ్మినేని కుటుంబీకులు పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆమదాలవలసకు ఉప ఎన్నికతో కలిపి మొత్తం 15సార్లు ఎన్నికలు జరగ్గా 14సార్లు ఈ కుటుంబ సభ్యులే ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలవడమో రెండో స్థానంలో నిలవడం ద్వారానో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూవచ్చారు. మొదట తమ్మినేని పాపారావు మొత్తం నాలుగుసార్లు పోటీ చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఆయన సోదరుడి కుమారుడు తమ్మినేని సీతారాం రాజకీయ రంగవ్రవేశం చేసి మొత్తం పది ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరో నాలుగుసార్లు ఓటమిపాలై రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు పదకొండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ సీతారాం, ఆయన కుటుంబ గత రాజకీయ వైభవం మసకబారింది. ఈ ఎన్నికల్లో ఆయన ఎదురీదుతున్నట్లు నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి.

తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పాపారావు
తమ్మినేని కుటుంబ రాజకీయ ప్రస్థానానికి బీజం వేసిన వ్యక్తి తమ్మినేని పాపారావు. ప్రస్తుత ఆమదాలవలస నియోజకవర్గం 1955లో నగరికటకం నియోజకవర్గం పేరుతో ఏర్పడిరది. 1978 ఎన్నికల తర్వాత ఆమదాలవలస నియోజకవర్గంగా మారింది. పేరు ఏదైనా ఈ నియోజకవర్గానికి అప్పటి నుంచి 15సార్లు ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు కాంగ్రెస్, మరో ఆరుసార్లు తెలుగుదేశం విజయం సాధించి ఆధిక్యత చాటుకున్నాయి. 1955లో నగరికటకం నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లోనే తమ్మినేని పాపారావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సత్తా చాటారు. కృషీకార్ లోక్ పార్టీ(కేఎల్‌పీ) అభ్యర్థి కేఏ నాయుడుపై 4475 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పాపారావు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఆయన 1962 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి జనసంఫ్‌ు అభ్యర్థి డి.జగన్నాథరావుపై 3,067 ఓట్ల ఆధిక్యతతో రెండోసారి గెలుపొందారు. 1967లో మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోసారి గెలవడం ద్వారా హ్యాట్రిక్ సాధించారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి డి.జగన్నాథరావుపై 3,365 ఓట్లతో గెలిచారు. అయితే 1972 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పైడి శ్రీరామ్మూర్తి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తమ్మినేని పాపారావు 4,546 ఓట్ల తేడాతో తొలిసారి ఓటమి ఎదుర్కొన్నారు. 1978 ఎన్నికల్లో తమ్మినేని కుటుంబం పోటీ చేయలేదు.
సీతారాం రంగప్రవేశం
ఆ తర్వాత నగరికటకం నియోజకవర్గం ఆమదాలవలసగా పేరు మార్చుకోగా.. పాపారావు తదనంతరం ఆయన రాజకీయ వారసుడిగా సోదరుడు శ్రీరామమూర్తి కుమారుడు తమ్మినేని సీతారాం రంగప్రవేశం చేశారు. అప్పటినుంచి వరుసగా ప్రతి ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటివరకు పది ఎన్నికల్లో పోటీ చేసిన సీతారాం 1983, 1985, 1991(ఉప ఎన్నిక), 1994, 1999, 2019 ఎన్నికల్లో.. మొత్తం ఆరుసార్లు విజయం సాధించారు. 1989, 2004, 2009, 2014 ఎన్నికల్లో(నాలుగుసార్లు) ఓటమి చవిచూశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తొలిసారి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి పైడి శ్రీరామమూర్తిపై 4273 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లోనూ మళ్లీ పైడి శ్రీరామమూర్తిపైనే 2129 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే 1989లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పైడి శ్రీరామ్మూరి టీడీపీ అభ్యర్థిగా ఉన్న సీతారాంపై 3496 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ 1991లో ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తమ్మినేని కాంగ్రెస్ అభ్యర్థి బి.రాజగోపాలరావుపై 2767 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 1994, 1999 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు బొడ్డేపల్లి చిట్టిబాబు, బొడ్డేపల్లి సత్యవతిలపై వరుసగా గెలిచిన సీతారాం టీడీపీ జెండా ఎగురవేశారు. 2004లోనూ కాంగ్రెస్ అభ్యర్థి సత్యవతి పై మరోసారి 3686 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 నాటికి సీతారాం టీడీపీ నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి మారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి చేతిలో 16,209 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రజారాజ్యం తెరమరుగు కావడం, రాష్ట్ర విభజన అనంతరం మారిన పరిస్థితుల్లో వైకాపాలో చేరిన సీతారాం 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి తన మేనల్లుడే అయిన తెలుగుదేశం అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో 5449 ఓట్ల మెజారిటీతో రవికుమార్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ వీరిద్దరే అదే పార్టీ తరఫున తలపడ్డారు. ఆ ఎన్నికల్లో కూన రవిపై 13991 ఓట్ల మెజారిటీతో తమ్మినేని విజయం సాధించారు.
తమ్మినేని కుటుంబానికి అండగా
నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి తమ్మినేని కుటుంబానికి ఇక్కడి ఓటర్లు ఆదరిస్తూ అండగా నిలిచి అసెంబ్లీకి పంపిస్తున్నారు. మొదటి ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన 15 ఎన్నికల్లో తమ్మినేని కుటుంబానికి చెందిన పాపారావును మూడుసార్లు, అనంతరం సీతారాంను ఆరుసార్లు ఎన్నుకుని అండగా నిలిచారు. అంటే కుటుంబానికి చెందినవారే తొమ్మదిసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్లు. ఒకే కుటుంబానికి చెందినవారు అన్నిసార్లు ఎన్నిక కావడం రాష్ట్ర చరిత్రలోనే చాలా తక్కువసార్లు జరిగి ఉంటుంది. కాగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతారాం నాటి తెలుగుదేశం ప్రభుత్వాల్లో మంత్రిగా పలు కీలక శాఖలు నిర్వహించారు. అలాగే వైకాపా హయాంలో ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా రాజ్యాంగ పదవిని నిర్వర్తిస్తున్నారు. ఈ కుటుంబం తర్వాత అధికంగా పైడి శ్రీరామమూర్తి మూడుసార్లు, బొడ్డేపల్లి సత్యవతి రెండుసార్లు, కూన రవికుమార్ ఒకసారి ఎమ్మెల్యేలుగా పని చేశారు.
ఈసారి కష్టమేనా?
తొలి ఎన్నికల నుంచి సత్తా చాటుతూ వస్తున్న తమ్మినేని కుటుంబం నుంచి సీతారాం ప్రస్తుత ఎన్నికల్లోనూ వైకాపా అభ్యర్థిగా బరిలో నిలవగా.. పాత ప్రత్యర్థి, తన మేనల్లుడు కూన రవికుమారే టీడీపీ అభ్యర్థిగా ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు. పదకొండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సీతారాం మరోసారి గెలిచి సత్తా చాటగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా నిలుస్తాయని, అవే తనను ఏడోసారి అసెంబ్లీకి పంపిస్తాయని తమ్మినేని ఆశాభావంతో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం మరోవిధంగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ దాన్ని మించిన వ్యతిరేకత ఆయన అభ్యర్థిత్వంపై ఉన్నట్లు కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు తప్ప నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఈ ఐదేళ్లలో సీతారాం చేసింది ఏమీ లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీనికితోడు నియోజకవర్గంలోనూ, పాలనా వ్యవహారాల్లోనూ కుటుంబ పెత్తనం పెరిగిపోవడం తీవ్ర వ్యతిరేకతను సృష్టించింది. సొంత పార్టీలోనూ పలువురు ముఖ్యనేతలు తమ్మినేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ కుటుంబం తీరుపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈసారి సీతారామ్‌కు కాకుండా తమకు టికెట్ ఇవ్వాలని పలువురు నాయకులు అధిష్టానాన్ని కోరారు. ఆయనకు టికెట్ దక్కకపోవచ్చని కూడా ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ జగన్ ఆలోచన ఏమిటో గానీ.. ఆయనకే మళ్లీ అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా నియోజకవర్గ కీలక నాయకుడైన సువ్వారి గాంధీ కుటుంబం పార్టీకి, పదవులకు రాజీనామా చేసింది. సువ్వారి గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమై ప్రచారం కూడా చేసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజల్లోనూ తమ్మినేని కుటుంబ పెత్తనాలు, వసూళ్లపై తీవ్ర అసంతృప్తి ఉంది. మరోవైపు తెలుగుదేశం అభ్యర్థి కూన రవికుమార్ గతం కంటే బాగా బలపడ్డారు. క్యాడర్‌ను పూర్తిగా సమీకరించుకుని తమ్మినేనిని సవాల్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ్మినేని నియోజకవర్గంలో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని స్పష్టమవుతోంది.
Kommentare