‘సత్యం’ కథనంపై కదిలిన యంత్రాంగం
ఎమ్మెల్యే ఆదేశాలతో పార్టీ అధ్యక్షుడి పర్యవేక్షణ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి సూర్యమహల్ జంక్షన్ నుంచి పసగాడ నారాయణ మిల్ జంక్షన్ వరకు చేస్తున్న రోడ్డు ప్యాచ్ వర్క్‌ల్లో కనీసం తారు వాడకుండా చిప్స్ వేసేశారంటూ ‘సత్యం’ గురువారం ప్రచురించిన కథనంపై ఎమ్మెల్యే గొండు శంకర్ స్పందించారు. విశాఖపట్నంలో ఉన్న ఆయన కార్పొరేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి రాత్రికి రాత్రి రోడ్డును పకడ్బంధీగా వేయాలని సూచించారు. అంతేకాకుండా నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ను రోడ్డెక్కించి దగ్గరుండి అధికారులతో ఈ పనులు సక్రమంగా చేయించేటట్లు సూచించారు. అందులో భాగంగా గురువారం రాత్రి వర్షం పడుతున్నా రోడ్డు పనులను చకచకా పూర్తిచేశారు. ఎక్కడైతే తారు వాడకుండా రోడ్డును పూర్తిచేశామని చెప్పుకొచ్చారో, ఆ ప్రాంతాల్లో శనివారం ఉదయం నాటికి నల్లగా మెరిసిపోయే రోడ్డును పూర్తిచేయించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ఎస్‌ఎల్‌జీ కన్‌స్ట్రక్షన్స్ (రావులపాలెం) కాంట్రాక్టరు నాదెళ్ల ఉదయ్ భాస్కర్‌తో ఫోన్‌లో మాట్లాడి రోడ్డు నాణ్యత అంశంపై రాజీ పడొద్దని సూచించారు. దీంతో కాంట్రాక్టర్, ఎంఈ దక్షిణామూర్తి, జేఈ నివాస్‌లు దగ్గరుండి నాణ్యమైన రోడ్డును వేయించినట్లు మాదారపు వెంకటేష్ ‘సత్యం’కు తెలిపారు.

ความคิดเห็น