
`నదుల్లో యథేచ్చగా అక్రమార్కుల తవ్వకాలు
`స్టాక్ పాయింట్ల ముసుగులో తరలింపు
`ఇసుకాసురులందరూ వైకాపా హయాంలో దోచుకున్నవారే
`ఎమ్మెల్యే శంకర్ హెచ్చరికలతో నియోజకవర్గంలో తగ్గిన దందా
`కానీ ఆమదాలవలసలో విచ్చలవిడిగా సాగుతున్న దోపిడీ
జిల్లాలోని టెక్కలి, అంగూరు స్టాక్ పాయింట్లలో ఉన్న 37వేల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ఇసుక పాలసీ వెసులుబాటు కల్పించింది. ఆ మేరకు ఇసుక ఎప్పుడో అమ్ముడైపోయింది. మైన్స్ శాఖ అధికారులను అడిగినా ఇదే చెబుతున్నారు. కానీ జిల్లాలోని దాదాపు అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇసుక గుట్టలు గుట్టలుగా కనిపిస్తోంది. ప్రభుత్వం పూర్తిస్థాయి ఇసుక పాలసీ ప్రకటించనుందున నదుల్లో ఇసుక తవ్వకాలకు వీల్లేదు. దానికి విరుద్ధంగా నదీతీరాల్లో కనిపిస్తున్న ఇసుక కొండలు అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని చెప్పకనే చెబుతున్నాయి. అంతేకాదు ప్రభుత్వం అనుమతించిన స్టాక్ పాయింట్ల నుంచి కొనుగోలు చేశామన్న ముసుగు తొడిగి నదీతీరాల నుంచి ఇసుకను విచ్చలవిడిగా అక్రమార్కులు తరలించేస్తున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా అందిస్తామని మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ మరోసారి స్పష్టం చేసింది. అయితే నదుల్లో తవ్వకాలకు పర్యావరణ అనుమతులు లేకపోవడం. స్టాక ్‌పాయింట్లలో ఉన్న ఇసుకను మాత్రమే ప్రభుత్వం విక్రయిస్తుండటం వల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ఉచితమనే పదానికి అర్థం లేకుండాపోయింది. మరోవైపు నదుల్లో ఇసుక తవ్వకూడదని ప్రభుత్వం ఆదేశించినా జిల్లాలో ఎక్కడా అక్రమ తవ్వకాలు ఆగడంలేదు. నదుల్లో తవ్విన ఇసుకనే స్టాక్ పాయింట్ల నుంచి కొనుగోలు చేసినట్లు చూపిస్తూ పెద్ద ఎత్తున పక్క జిల్లాలకు తరలించేస్తున్నారు. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తే.. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ఎక్కడికక్కడ నదుల్లో ఇసుక తవ్వకాలకు తెగబడుతున్నారు. వాస్తవానికి ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించి విధివిధానాలు ఇంకా నిర్ణయించలేదు. వీటిని రూపొందిస్తేగానీ పర్యావరణ అనుమతులు రావు. సాధారణంగా ఈసీ(ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్) రావాలంటే తవ్వకాలకు ప్రభుత్వం ఏ సంస్థకు అనుమతి ఇచ్చిందో ముందుగా చెప్పాలి. అప్పుడు వారి పేరుతో ఈసీ వస్తుంది. గత ప్రభుత్వంలో ఈసీలన్నీ జేపీ సంస్థ పేరు మీదే ఇచ్చారు. ఈసారి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆ బాధ్యత అప్పగిస్తుందా? లేక రాష్ట్రవ్యాప్తంగా ఒకే సంస్థకు కట్టబెడుతుందా అనేది ఇంకా తేలలేదు. నిబంధనల ప్రకారం వర్షాకాలంలో మూడు నెలల పాటు నదుల్లో తవ్వకాలకు పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వదు. ఈ లెక్కన చూసుకుంటే కనీసం సెప్టెంబరు వరకు నదుల్లో ఇసుక తోడటానికి ఎవరికీ ఎటువంటి హక్కూ లేదు. అది ఉచిత ఇసుకైనా, టెండరులో దక్కించుకున్నా చెల్లదు. 45 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వడానికి అనుమతి ఇవ్వాలంటే స్థానికంగా ప్రజాభిప్రాయం సేకరించాలి. పబ్లిక్ సమ్మతితోనే సంబంధిత నదిలో తవ్వకాలు జరపాలి. అయితే గత ప్రభుత్వం ఈ తతంగాలన్నింటినీ గనులశాఖతో కాగితాల మీద చూపించి విచ్చలవిడిగా తవ్వకాలకు అనుమతులిచ్చేసింది.
ఉచితం.. అర్థం మారిపోతోంది
జిల్లాలో 22 రీచ్‌లను గుర్తించినట్టు సమాచారం. సీనరేజ్ ఛార్జి చెల్లించి, ట్రాన్స్‌పోర్ట్ భరించుకుంటే ఇసుకను తీసుకువెళ్లొచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఉచిత ఇసుక అనగానే ఎవరికివారు నదుల్లోకి వెళ్లిపోయి తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత తరలించుకుపోవడమే అన్న భావనతో ప్రజలు ఉన్నారు. సాధారణంగా ప్రకృతి వనరులను వాడుకునేటప్పుడు స్థానిక పంచాయతీకి సెస్ చెల్లించాలనేది ఒక నిబంధన. సెస్, ట్రాన్స్‌పోర్ట్, లోడిరగ్ ఛార్జీలు చెల్లించినప్పుడు అది ఉచితం కిందకు రాదనేది జనాల భావన. అందుకే ఎక్కడికక్కడ రీచుల్లో ఇసుకను తవ్వుకొని వెళ్లిపోతున్నారు. బూరవిల్లి వద్ద 0.56, అంబళ్లవలస వద్ద 2.91, బట్టేరులో 4.37, గోపాలపెంటలో 4.7, నివగాంలో 4.97, హయాతినగరంలో 3.26 హెక్టార్లలో ఇసుక తవ్వకాలకు గనుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఎవరి పేరుతో ఇవ్వాలన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో ఆపేశారు. ఇది కాకుండా పురుషోత్తపురం`1లో 4.82, పురుషోత్తపురం`2లో 4.62, ముద్దాడపేటలో 4.95, కిల్లిపాలెంలో 3, పర్లాంలో 1.41, ముద్దాడపేటలో`2లో 0.87 హెక్టార్లలో తవ్వకాలకు మైన్స్ శాఖ ప్రతిపాదిస్తోంది. మడపాంలో 4.260, ఉప్పరపేటలో 2.30, కొబగాంలో 14.70, దొంపాకలో 6.260, భైరిలో 3.680, పొన్నాంలో 11.00, నైరలో 5.00, అంధవరంలో 3.10 హెక్టార్లలో ఇసుక తవ్వకాలకు కూడా అనుమతులు కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ విధాన నిర్ణయం వెలువడితే తప్ప ఈ రీచుల్లో తవ్వకాలు చేపట్టకూడదు. ఇవన్నీ గతంలో ఉన్న ఇసుక రీచులే అయినందున లారీలు వెళ్లడానికి బాటలు ఉండటంతో నేరుగా పొక్లెయిన్లు పెట్టి అనుమతులు రాకముందే తవ్వేస్తున్నారు. తాత్కాలిక పాలసీ ద్వారా జిల్లాలో రెండు స్టాక్ పాయింట్లలో ఉన్న 37వేల మెట్రిక్ టన్నుల ఇసుకను రెండు రోజుల్లోనే ఊడ్చేశారు. ఆతర్వాత డిమాండ్ భారీగా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి నదీ పరీవాహక ప్రాంతాల్లో కొందరు అక్రమార్కులు నదీగర్భాల్లో ఇసుక తవ్వి ట్రాక్టర్లతో సమీప ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. రాత్రివేళల్లో జేసీబీలతో లారీలకు ఎక్కించి తరలిస్తున్నారు. వైకాపా హయాంలో అనుమతి పొందిన సంస్థలు ప్రభుత్వం గుర్తించిన రీచులతో పాటు అనుమతులు లేనిచోట కూడా తవ్వకాలు జరిపి అక్రమాలకు పాల్పడ్డాయి. చివరకు ఇసుక ఎవరు తవ్వుకున్నా తమకు మాత్రం కప్పం కట్టాలంటూ ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని మరీ వసూళ్లకు పాల్పడ్డారు. వీరికి సమాంతరంగా వైకాపా నాయకుల కనుసన్నల్లో నదుల్లో అనధికారికంగా తవ్వకాలు జరిపి జేబులు నింపుకున్నారు.
అప్పుడూ.. ఇప్పుడూ.. వారే అక్రమార్కులు
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఇసుక ధరలు పెరగడంపై ప్రజల్లో అసంతృప్తిని గుర్తించి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. అందులో టీడీపీ ప్రజాప్రతినిధుల జోక్యం పెరగడంతో సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండాపోయింది. ప్రస్తుతం మళ్లీ అదే విధానాన్ని ప్రవేశపెట్టారు. మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నూతన ఇసుక పాలసీపై విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించారు. 2014లో మాదిరిగా కాకుండా పక్కాగా రూపొందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ విధానం ఎప్పుడు పట్టాలెక్కుతుందో ప్రభుత్వం నుంచి స్పష్టత రావల్సి ఉంది. కానీ ఇసుకాసురులు మాత్రం ఇసుక తవ్వేసి లారీల్లో విశాఖకు రవాణా చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన తంతే కొనసాగుతోంది. పోలీసులు, ఎస్‌ఈబీ అధికారుల సహకారంతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయి. గతంలో వైకాపా పంచన చేరి తవ్వకాలు జరిపినవారే ప్రస్తుతం టీడీపీ పంచన చేరి అక్రమాలు కొనసాగిస్తున్నారు. ఉచిత ఇసుక అమల్లోకి రాకముందు పది టైర్ల లారీ లోడ్‌కు రూ.12వేలు, 14 టైర్ల లారీకి రూ.23వేలు.. ఇలా లారీ సామర్ధ్యాన్ని బట్టి రూ.28వేల వరకు వసూలు చేసేవారు. దీన్ని విశాఖ, విజయనగరం ప్రాంతాలకు తరలించి రూ.40వేల నుంచి రూ.70వేలకు విక్రయించేవారు. ఉచిత విధానం తెరపైకి వచ్చిన తర్వాత ఇసుక లభ్యత తగ్గడం, నదుల్లో వరదలు రావడం తదితర కారణాల వల్ల ఇసుకకు డిమాండ్ పెరిగింది. నదుల్లో వరద వస్తుందని ముందుగానే గుర్తించిన అక్రమార్కులు వంశధార నదిలో ఇసుక తవ్వి సమీప ప్రాంతాల్లో డంప్ చేశారు. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
శ్రీకాకుళంలో తగ్గినా.. ఆమదాలవలసలో జోరుగా
శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నవారిని ఎమ్మెల్యే గొండు శంకర్ ఎన్నిసార్లు బహిరంగంగా హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం స్వయంగా ఆయనే ర్యాంపుల వద్దకు వెళ్లి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుకాసురులపై తానే పోరాటం చేస్తే ఇప్పుడు మళ్లీ అదే పంథాను కొందరు అనుసరిస్తుండటాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఫలితంగా కొద్ది రోజులుగా నియోజకవర్గంలో తవ్వకాలు ఆగాయి. కానీ ఆమదాలవలసలో భారీ లారీలు ఇసుకను లోడ్ చేసుకొని నిత్యం హైవే ఎక్కుతున్నాయి. మునగవలస వద్ద రాత్రి 10 దాటిన తర్వాత పెద్ద ఎత్తున లారీల్లో ఇసుక లోడిరగ్ జరుగుతోంది. అలాగే తొగరాం, కొత్తవలస, గోపీనగరం, తోటాడ, కలివరం ప్రాంతాల నుంచి కూడా ఇసుక యథేచ్చగా తరలిపోతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నిర్మాణాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. కాబట్టి జిల్లా నుంచి తరలిపోతున్న ఇసుకను ఏదో ఓ చోట కచ్చితంగా డంప్ చేసి బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ఇసుకకు ఏర్పడిన కృత్రిమ డిమాండ్‌ను అరికట్టవచ్చు.
నాటుబళ్లకు ఫైన్, లారీ సీజ్
సోమవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో శ్రీకాకుళం ఆర్డీవో రంగయ్య ఆధ్వర్యంలో మైనింగ్, పోలీస్, ఎస్‌ఈబీ సిబ్బంది ఖాజీపేట జంక్షన్ వద్ద 17 ఎడ్లబళ్లను నిలిపి ఒక్కొక్కరి నుంచి రూ.2వేలు చొప్పున ఫైన్ వసూలు చేశారు. బళ్ల యజమానులు ఎమ్మెల్యే గొండు శంకర్‌ను ఆశ్రయించగా ఆయన అధికారులతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి ఆదేశాలతోనే అపరాధరుసుము వసూలు చేశామని అధికారులు చెప్పినట్లు తెలిసింది. అదేరోజు ఉదయం ఏడు గంటల సమయంలో రూరల్ మండలం భైరిలో ఇసుకను అక్రమంగా లారీల్లో లోడ్ చేస్తున్నారని స్థానికులు డయల్ 100కు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఈబీ, రూరల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరు వెళ్లే సమయానికి ఇసుక లోడ్‌తో అన్ని లారీలు తరలిపోగా, రోడ్డులో ఇరుక్కుపోయిన ఒక్క లారీ మాత్రం చిక్కింది. దాన్ని అక్కడి నుంచి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వంశధారకు వరద వస్తుండడంతో బుచ్చిపేట వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు నిలిచిపోయినా అప్పటికే ఒడ్డుకు డంపింగ్ చేసిన ఇసుకకు డిమాండ్ పెరగడంతో లారీలకు ఇవ్వకుండా ట్రాక్టర్లకు విక్రయించి డబ్బులు చేసుకుంటున్నారు.
Comments