తొలి గెలుపు తలుపు తట్టేనా?
- DV RAMANA
- May 7, 2024
- 4 min read
`టీడీపీకి ఇంతవరకు చిక్కని నాలుగు నియోజకవర్గాలు
`వైకాపా బోణీ కొట్టని సెగ్మెంట్లు చాలానే
`ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని యత్నాలు
`కీలకమైన చోట్ల ప్రత్యేక ఫోకస్ పెట్టిన రెండు పార్టీలు
(ఎన్నికల రచ్చబండ ` డి.వి.రమణ)
ఎన్నికల్లో జయాపజయాలు ఓటర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. తమకు నచ్చనివారిని పాతాళానికి తొక్కేయడం, నచ్చినవారిని అందలమెక్కించడం ఓటుహక్కుకు ఉన్న పవర్. ఐదేళ్లకోసారి పార్టీల పనితీరు, విధానాలను బేరీజు వేసుకుని ఓటర్లు తీర్పు ఇస్తుంటారు. ఆ క్రమంలో కొందరు అభ్యర్థులు తమ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను చురగొని ఆ నియోజకవర్గాలను తమ కంచుకోటలుగా మలచుకుంటుంటారు. అదే విధంగా అభ్యర్థులను మార్చినా సరే ఓటర్లు ఒకే పార్టీకి పట్టం కడుతున్న నియోజకవర్గాలు కూడా రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. వీటికి భిన్నంగా ఒక ఎన్నికలో ఒక పార్టీకి, తర్వాతి ఎన్నికలో మరో పార్టీకి ఓటువేసి గెలిపించే సంప్రదాయం కూడా పలు నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. అదేవిధంగా ఒకటిరెండు ఎన్నికలకే తెరమరుగైపోయిన నేతలు కూడా ఉన్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో ఏర్పాటైనప్పటి నుంచి నాలుగు దశాబ్దాలకుపైగా తెలుగుదేశం స్థిరమైన ఓటుబ్యాంకు ఏర్పాటు చేసుకుని తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం తొమ్మిది ఎన్నికలను ఎదుర్కొన్న ఆ పార్టీ ఐదుసార్లు అధికారంలోకి రాగా.. నాలుగుసార్లు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. మరోవైపు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయిన పరిస్థితుల్లో ఏర్పాటైన వైకాపా గత రెండు దశాబ్దాలకుపైగా రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగింది. ఒకసారి ప్రతిపక్షంగా, ప్రస్తుతం అధికారపక్షంగా వ్యవహరిస్తోంది. ఇంత చరిత్ర కలిగిన ఈ పార్టీలకూ కొరుకుడు పడని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయన్నది విస్మయం కలిగించే అంశం. మరి ఆ నియోజకవర్గాలు ఏమిటి? ఇంతవరకు ఒక్కసారి కూడా విజయం అందించని ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
పులివెందుల
కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం ఒక్కసారి కూడా గెలవలేదు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కుటుంబానికి పూర్తిగా పట్టున్న నియోజకవర్గం. ఇక్కడ తొలినాళ్లలో కాంగ్రెస్, ఆ తర్వాత వైకాపా మాత్రమే గెలుస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి ముందు 1955`1972 మధ్య జరిగిన నాలుగు ఎన్నికల్లో మూడుసార్లు కాంగ్రెస్ నుంచి పెంచికల బసిరెడ్డి, మధ్యలో 1962లో స్వతంత్ర అభ్యర్థి చవ్వా బాలిరెడ్డి గెలిచారు. 1978 నుంచి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఇక్కడ పాగా వేశారు. 1978, 1983, 1985లలో వరుసగా మూడుసార్లు ఆయన గెలవగా 1989లో వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి, 1991లో వైఎస్ చిన్నాన్న వైఎస్ పురుషోత్తమరెడ్డి, 1994 మళ్లీ వివేకానందరెడ్డి గెలిచారు. ఆ తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ గెలిచారు. వైఎస్ మరణానంతరం 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య విజయమ్మ రాజీనామాతో బరిలోకి దిగిన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఆ ఉప ఎన్నికతోపాటు 2014, 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి ఇండిపెండెంట్ గెలిచారే తప్ప టీడీపీ మాత్రం ఇంతవరకు బోణీ చేయలేకపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైకాపా నుంచి, బీటెక్ రవి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు.
యర్రగొండపాలెంలో..
ప్రకాశం జిల్లాలో ఎస్సీలకు కేటాయించిన ఈ నియోజకవర్గం 1955లో ఏర్పడినా 1972 తరువాత రద్దయింది. మళ్లీ మూడు దశాబ్దాల తరువాత 2009 ఎన్నికలతో ఎస్సీ నియోజకవర్గంగా ఉనికిలోకి వచ్చింది. 1978 నుంచి 2004 వరకు దాదాపు ఇదే సెగ్మెంట్ పరిధిగా ఉన్న కంభంలో రెండుసార్లు గెలిచిన టీడీపీ ఎర్రగొండపాలెంగా మారిన తర్వాత గెలుపు ఖాతా తెరవలేకపోయింది. ఒక ఉప ఎన్నిక సహా ఎనిమిదిసార్లు యర్రగొండపాలేనికి ఎన్నికలు జరగ్గా నాలుగుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు సీపీఐ, రెండుసార్లు వైకాపా గెలిచాయి. సిటింగ్ మంత్రి ఆదిమూలపు సురేష్ 2009, 2019 ఎన్నికల్లో గెలిచారు. అంతకుముందు 1962, 1967లో సీపీఐ నేత పూల సుబ్బయ్య గెలిచారు. వీరు మినహా ఈ నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచిన వారెవరూ లేరు. ప్రస్తుత ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను వేరే నియోజకవర్గానికి వైకాపా మార్చగా ఆయన స్థానంలో గూడూరి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గతసారి పోటీ చేసి ఓడిపోయిన ఎరిక్షన్ బాబు మరోసారి తలపడుతున్నారు.
కోడుమూరు
కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ ఒకే ఒక్కసారి గెలిచింది. 1985లో ఆ పార్టీ నుంచి శిఖామణి విజయం సాధించారు. 1994, 1999, 2004 ఎన్నికల్లోనూ ఆయన గెలిచినప్పటికీ ఆ మూడుసార్లూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి, వైకాపా నుంచి ఆదిమూలపు సతీష్ పోటీలో ఉన్నారు.
విజయవాడ వెస్ట్
రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడ నగర పరిధిలోని పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని విజయం ఊరిస్తోందే తప్ప వరించడంలేదు. టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన 1983లో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో(1983) ఆ పార్టీ ఇక్కడ గెలిచింది. ఆ తర్వాత ఇంతవరకు గెలుపు దక్కలేదు. 1983లో బీఎస్ జయరాజు టీడీపీ నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గానికి మొత్తం 12 సార్లు ఎన్నికలు జరగ్గా ఐదుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు వామపక్షాలు, వైకాపా రెండుసార్లు, టీడీపీ, ప్రజారాజ్యం ఒక్కోసారి గెలిచాయి. ప్రస్తుత ఇక్కడి నుంచి వైకాపా తరఫున షేక్ అసీఫ్ పోటీ చేస్తుండగా పొత్తులో భాగంగా బీజేపీ నుంచి సుజనాచౌదరి బరిలో నిలిచారు. దాంతో ఈ ఎన్నికల్లోనూ ఈ సీటు టీడీపీ ఖాతాలో పడే అవకాశం లేదు.
ఫ్యాన్ గాలి తగలట్లేదు
తెలుగుదేశం ఇంతవరకు గెలవని నియోజకవర్గాలున్నట్లే బోణీ కొట్టని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. 2012 ఉప ఎన్నికలతో వైకాపా ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించింది. నాటి ఉప ఎన్నికల్లో 17 సీట్లకు పోటీ చేసి అందులో 15 గెలుచుకుంది. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా పోటీ చేసి 67 సీట్లు గెలిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 151 చోట్ల గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా ఇప్పటివరకు ఆ పార్టీ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలు చూస్తే..
టెక్కలి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో 1983 నుంచి ఇప్పటివరకు ఒక ఉప ఎన్నికతో కలిపి మూడుసార్లు మాత్రమే టీడీపీ ఓటమి పాలైంది. మిగతా ఎన్నికలన్నింటిలోనూ గెలిచింది. వైకాపా ఆవిర్భావం తరువాత 2014లో దువ్వాడ శ్రీనివాస్, 2019లో పేరాడ తిలక్ ఇక్కడ పోటీ చేసినా అచ్చెన్నాయుడి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికలలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడే మరోసారి పోటీ చేస్తుండగా వైకాపా నుంచి దువ్వాడ శ్రీనివాస్ బరిలో ఉన్నారు.
ఇచ్ఛాపురం
రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇంతవరకు వైకాపాకు విజయం దక్కలేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి నర్తు రామారావు, 2019 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసిన పిరియా సాయిరాజ్ ఓడిపోయారు. రెండు ఎన్నికల్లోనూ వైకాపా అభ్యర్థులు మారినా వారిపై టీడీపీ నుంచి పోటీ చేసిన బెందాళం అశోక్ ఆ రెండుసార్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిని మార్చి పిరియా విజయను బరిలోకి దింపగా, టీడీపీ నుంచి మళ్లీ బెందాళం అశోక్ పోటీ పడుతున్నారు.
హిందూపురం
సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్టీరామారావు మూడుసార్లు పోటీ చేసి గెలవగా ఆయన కుమారుడు హరికృష్ణ 1996 ఉప ఎన్నికలో గెలిచారు. 2014 నుంచి ఇక్కడ ఎన్టీరామారావు మరో కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ గెలుస్తున్నారు. వైకాపా నుంచి 2014లో నవీన్ నిశ్చల్, 2019లో షేక్ మహ్మద్ ఇక్బాల్ పోటీ చేయగా ఆ రెండు ఎన్నికల్లోనూ బాలకృష్ణ వారిపై విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి బాలకృష్ణే పోటీ చేస్తుండగా వైకాపా తన అభ్యర్థిని మార్చి టీఎన్ దీపికను నిలబెట్టింది.
కుప్పం
వైకాపా ప్రస్తుతం టార్గెట్ పెట్టిన నియోజకవర్గాల్లో కుప్పం మొదటిస్థానంలో ఉంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇది పెట్టని కోట. గత ఏడు ఎన్నికల్లోనూ ఆయనే గెలిచారు. అంతకుముందు 1983, 1985 ఎన్నికల్లో ఎన్.రంగస్వామినాయుడు టీడీపీ నుంచి విజయం సాధించారు. ఈసారి ఎలాగైనా ఇక్కడ చంద్రబాబును ఓడిరచడానికి వైకాపా ముఖ్యనేతలు వ్యూహాలు పన్నుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా నుంచి కె.చంద్రమౌళి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ కె.ఎస్.భరత్‌ను వైకాపా నిలబెట్టింది.
చీరాల
ప్రకాశం జిల్లా చీరాల కూడా వైకాపా ఇంతవరకు చిక్కలేదు. సిటింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం ప్రస్తుతం వైకాపాలో ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో ఆమంచి కృష్ణమోహన్, 2014లో యడం బాలాజీ వైకాపా అభ్యర్థులుగా పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. 2014లో ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన వైకాపాలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్‌కు వైకాపా టికెట్ కేటాయించింది. టీడీపీ నుంచి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ పోటీ చేస్తున్నారు.
గన్నవరం
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ స్థానంలో వైకాపాకు ఇంతవరకు విజయం దక్కలేదు. గతంలో ఇక్కడి నుంచి కమ్యూనిస్ట్ నేత పుచ్చలపల్లి సుందరయ్య మూడుసార్లు గెలిచారు. ఆయన తర్వాత వల్లభనేని వంశీ వరుసగా రెండుసార్లు గెలిచారు. వైకాపా నుంచి 2014లో దుట్టా రామచంద్రరావు, 2019లో యార్లగడ్డ వెంకటరావు పోటీ చేసినా టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల తరువాత వంశీ టీడీపీని వీడి వైకాపాలోకి, యార్లగడ్డ వెంకట్రావు వైకాపాను వీడి టీడీపీలోకి మారి ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు.
ఇవి కాకుండా..
వైకాపాకు ఇంకా చిక్కని నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దాపురం, కొండెపి, పాలకొల్లు, ఉండి, రేపల్లె, విజయవాడ ఈస్ట్, వైజాగ్ ఈస్ట్, వైజాగ్ నార్త్, వైజాగ్ సౌత్, వైజాగ్ వెస్ట్, మండపేట, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ తొలి విజయాల కోసం ఎదురు చూస్తోంది.
Comentários