ప్రజా దర్బార్‌లో సమస్యల ఏకరువు
ఎమ్మెల్యే శంకర్ వినూత్న ప్రయత్నంపై సర్వత్రా హర్షం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కూడు, గూడు, గుడ్డ నినాదంతో అధికారంలోకి వచ్చిన అనేక పార్టీలు తర్వాత కాలంలో వాటిని విస్మరించాయి. గడిచిన పదేళ్లలో 20కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోడీ అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఇవన్నీ పేదరిక నిర్మాలనలో కొలమానాలను అనుసరించి రూపొందించిన అంకెలుగానే చూడాలి. స్వాతంత్య్రం సాధించుకొని 75 ఏళ్లు పూర్తిచేసుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని ఏడాది పాటు దేశమంతా నిర్వహించుకున్నాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడు, గూడు, గడ్డకు నోచుకోనివారు ఇంకా ఉన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఘనంగా నిర్వహించినా ఆ ఫలాలు ఇంకా క్షేత్రస్థాయికి చేరలేదని బాధితులంతా సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరగడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే గొండు శంకర్ నగరంలోని 22 నుంచి 42 డివిజన్ల పరిధిలో 21 వార్డుల నుంచి సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి కోరుతూ అర్జీదారులు ప్రజాదర్బార్ వద్ద బారులుతీరి సమస్యలను ఏకరువుపెట్టారు. కార్యక్రమానికి కమిషనర్ ప్రసాద్, తహసీల్దార్ గణపతితో పాటు 21 డివిజన్లు టీడీపీ ఇన్‌చార్జీలు హాజరయ్యారు. ప్రజాదర్బార్ కార్యక్రమానికి 21 డివిజన్ల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సుమారు 200 అర్జీలు అందినట్టు అధికారులు పేర్కొన్నారు.
విశేష స్పందన
ప్రజాదర్బార్‌కు వచ్చినవారిలో ఎక్కువ మంది ఇళ్లు, ఇంటి స్థలం, తెల్లకార్డు, పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇన్‌ఛార్జీలు ఆయా వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అర్జీలు పెట్టారు. స్వీకరించిన దరఖాస్తులను ఆయా విభాగాలకు పంపించి వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శంకర్ అర్జీదారులకు స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నగరం పరిధిలో ప్రజాదర్బార్ నిర్వహించడంపై నగర పౌరుల నుంచి విశేష స్పందన కనిపించింది. వ్యక్తిగత సమస్యలపై అర్జీదారులంతా ఎమ్మెల్యేను కలిసి విన్నవించి సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు. అర్జీదారుల్లో ఎక్కువ మంది టిడ్కో గృహాల కోసం 2017లో ప్రభుత్వానికి నగదు జమచేసినా ఇళ్లు మంజూరు చేయలేదని విన్నవించారు. మరికొందరు బాధితులు ఇళ్లు మంజూరు చేసినట్టు పేర్కొన్నా, ఇప్పటివరకు స్వాధీనపరచలేదని విన్నవించారు. ఇంకొందరు ఇంటి బిల్లుల బకాయి చెల్లింపులు పునరుద్ధరించాలని కోరారు. కొందరు ఇళ్లు మంజూరు చేయాలని కోరగా, మరికొందరు ఇంటి స్థలం కేటాయించాలని అర్జీ పెట్టుకున్నారు. వీటితో పాటు వితంతు, వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని, నిలిచిపోయిన పింఛన్ పునరుద్ధరించాలని కొందరు ఆభ్యర్ధించారు. తెల్లకార్డు మంజూరు చేయాలని, రద్దు చేసిన కార్డును పునరుద్ధరించాలని కొందరు అర్జీలు సమర్పించారు. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాలని పలువురు అర్జీలు ఇచ్చారు. ఇంటి పన్ను తగ్గించాలని పలువురు విన్నవించారు. వీటితో పాటు ఆయా డివిజన్లలో గత ఐదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, దీనివల్ల రోడ్లు, మురుగు కాలువలు శిథిలావస్థకు చేరినట్టు టీడీపీ డివిజన్ ఇన్‌ఛార్జిలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెల్లారు. నగరంలోని శివారు కాలనీల్లో సమస్యలు పరిష్కారానికి చొరవ చూపించాలని ఎమ్మెల్యేను స్థానిక టీడీపీ నాయకులు కోరారు.
సమస్యకు పరిష్కారం చూపిస్తాం
గతానికి భిన్నంగా ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొనే వినూత్న ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే శంకర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవడంపై ఎమ్మెల్యే గొండు శంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని, రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయాలని, కూరుకుపోయిన డ్రెయిన్లను పునరుద్ధరించాలని వినతులు అందినట్టు తెలిపారు. మున్సిపల్ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరాలో ఆంతరాయం ఏర్పడుతుందని, మరికొన్ని చోట్ల సరఫరా కావడం లేదని అర్జీలు వచ్చినట్టు తెలిపారు. శివారు కాలనీలకు సైతం కుళాయిల ద్వారా తాగునీరు అందించాలని వినతులు అందాయి. ప్రజాదర్బార్‌లో వచ్చిన వినతులను శాఖల వారీగా సమీక్షించి ఆయా విభాగాల ద్వారా త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, డివిజన్ ఇన్‌ఛార్జిలు అంధవరపు సంతోష్, పాండ్రంకి శంకర్, కొర్ను ప్రతాప్, దాస్యం రాంబాబు, రోణంకి కళ్యాణ్, జామి భీమశంకర్, కవ్వాడి సుశీల, పాలిశెట్టి మల్లిబాబు, కేశవ రాంబాబు, కోరాడ రాంబాబు, మైలిపల్లి నర్శింహమూర్తి, సచివాలయం, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments