
మత విద్వేషపూరిత సోకాల్డ్ దేశభక్తులు తప్ప దేశం పట్ల అభిమానం, గౌరవం వున్నవారెవరైనా అమెరికా 104 మంది భారతీయుల్ని యుద్ధఖైదీల్లా బంధించి చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లు వేసి, తమ యుద్ధ విమా నాల్లో తరలించి, అమృత్‌సర్‌లో డిపోర్ట్ చేసి తిరిగి వెళ్లిపోవటాన్ని అంగీకరించలేరు. ఆ 104 మంది నిజానికి అమెరికాలో బతికిందీ లేదు. అక్కడ నేరాలు చేసినవారసలే కారు. గ్వాతిమాలా, మెక్సికో, పనామ వంటి దేశాల గుండా అత్యంత ప్రమాదకరమైన దారుల వెంట అమెరికాని చేరగానే, అరెస్ట్ చేసి తమ యుద్ధ విమానాల్లో కుక్కి భారత్‌లో డంప్ చేయించాడు ట్రంప్. ఈ మధ్య జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే అతని పేరు ‘డోనాల్డ్ డంప్’ అని మార్చొచ్చనిపిస్తుంది. ఈ డోనాల్డ్ తెంపరి చవక ధరలకే తమ శారీరక శ్రమని అందించి ఆ దేశ ఆర్ధిక వ్యవస్థకి తోడ్పాటు అందించిన విదేశీ వలసదారుల్ని ‘ఏలియన్స్’, ‘క్రిమినల్స్’ అని సంబోధిస్తు న్నాడు. ఒక దేశానికి కచ్చితంగా తన దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిని తిరిగి వారి స్వదేశానికి పంపే హక్కు వుంటుంది. కానీ దానికో దౌత్యప్రక్రియ వుంటుంది. అలా తిరిగి పంపటాన్ని యుద్ధ ప్రక్రియగా మారిస్తే కచ్చితంగా అది అభ్యంతరకరమే. ఈ 104 మందినీ సంకెళ్లతో బంధీలు చేసి, యుద్ధ విమానాల్లో భారత్ గడ్డ మీద వదిలేయడం కచ్చితంగా యుద్ధ చర్యే. అంటే అమెరికాకి చెందిన ఒక మిలటరీ విమానం మన గడ్డ మీద దిగటం మన దేశ సార్వభౌమాధికారానికి భంగమే. ట్రంప్ ప్రభుత్వం ఇలా చేయబోతున్నట్లు మన ప్రభుత్వానికి ముందే తెలియచేసినా అలా చేయాల్సిన అవసరం లేదని, మనమే మన విమానాల్లో వారిని తెచ్చుకుంటామనీ మన ప్రభుత్వం అనలేదు. చిన్న చిన్న దేశాలు చూపించిన తెగువలో, ఆత్మగౌరవ ప్రకటనలో వందో వంతు ప్రతిఘటనైనా మన నుంచి లేదు. ఈ వలసదారులందరూ భారత్‌ని సక్రమంగానే వదిలారు కదా? వారు దేశాన్ని వదిలే ప్రక్రియలో అక్రమాలకు పాల్పడలేదు కదా? మరి వారిని మర్యాదగానే ఈ గడ్డ మీద దింపుకొనే బాధ్యత ప్రభుత్వానికి లేదా అనే ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి. ఒక వ్యక్తికే కాదు ఒక దేశానికైనా ఆత్మగౌరవ రాహిత్యాన్ని మించిన దుర్గతి, దుస్థితీ మరొకటి లేదు. భారత్‌కి సంబంధించినంత వరకు ఈ దుర్గతి, దుస్థితి విదేశాంగ శాఖా మనత్రి జైశంకర్ పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటనలో కనిపించింది. అంతర్జాతీయ వ్యవహా రాల్లో ఇది చాలా మామూలు విషయమని, అమెరికా 2009 నుంచి ఇలా సంకెళ్లు వేసే పద్ధతిని అమల్లోకి తెచ్చిందనీ సెలవిచ్చాడాయన. అమెరికా అలా తన అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తే దానికి ఆమోద ముద్ర వేయటం తప్ప మరో గత్యంతరం లేదా? జైశంకర్ మాటల్లో కనీస విచారం లేదు. ఒక యజమాని చర్యని బానిస కళ్లప్పగించి చూసినట్లే వుంది. ఈయనకి ‘మామూలు అంతర్జాతీయ వ్యవహారం’గా కనబడినది మరి కొలంబియా వంటి చిన్న ప్రాణ దేశాలకు ఎందుకు మామూలుగా కనబడలేదంటే వారి ఆత్మాభిమానం ధనో న్మాద, వర్ణోన్మాద ట్రంప్ కన్నా పెద్దది కనుక! పైగా భారతీయుల్ని సంకెళ్లు వేసి తీసుకురాలేదని, మీడియాలో చూపించినది గ్వాతిమాలా వలసదారులని మన ప్రభుత్వం బుకాయిస్తే, అదేం కాదు.. వారు భారత వలసదారు లేనని అమెరిక ఆధారసహితంగా అధికారిక వీడియోని విడుదల చేసి గాలితీసింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు మన ప్రధాని స్వయంగా అమెరికా వెళ్లి ట్రంప్ తరఫున దాదాపుగా ఎన్నికల ప్రచారం చేసి నంత పనిచేశారు. ట్రంప్ తన ఆత్మీయ మిత్రుడు అని ప్రకటించారు. అంతకు ముందు కరోనా ఊపందుకుం టున్న సమయంలోనే ‘నమస్తే ట్రంప్’ పేరుతో ఇండియాలో అహ్మదాబాద్‌లో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. అప్పుడు కూడా ట్రంప్‌ని మోడీ తన ‘మిత్రుడు’గా పరిచయం చేశారు. కానీ అదే ‘మిత్రుడు’ కోవిడ్ సమయం లో ఔషధం భారత్ తమ దేశానికి పంపకపోతే ప్రతీకార చర్యలుంటాయని బెదిరించాడు. మన దేశం వెంటనే ఆ ఔషధం పంపింది. అసలు ట్రంప్‌తో మోడీకి కానీ, అమెరికాతో భారత్‌కి కానీ వున్న అనుబంధం ఏమిటి? మిత్రుల మధ్య స్నేహసంబంధమా? లేక యజమాని, బానిసల మధ్య సంబంధమా? వ్యక్తిగతపరంగా కానీ దేశ పరంగా కానీ స్నేహమనేదే వుంటే సంప్రదింపులకి ఆస్కారం వుంటుంది కదా! ఎందుకు ఇంత వెన్నెముక లేకుండా వ్యవహరించాలి? అసలు వేరే దేశాలవారిని అక్రమ వలసదారులని అమెరికా అనడమే హాస్యాస్పదం. స్థానికి తెగల్ని మట్టుపెట్టి క్రమంగా ప్రస్తుత అమెరికాని పరిపాలిస్తున్న తెల్ల జాతే అతి పెద్ద వలసదారు. ఎన్ని దేశాల్లో అమెరికాకి మిలటరీ బేస్‌ల పేరుతో వలస క్యాంపులున్నాయి! ఎన్ని దేశాల్ని ఆక్రమించింది! ఎన్ని ప్రభు త్వాల్ని కూలదోసింది! మరొకరిని అక్రమ వలసదారులుగా పేర్కొనే నైతిక హక్కు ఆ దేశానికి లేదు. ప్రపంచం మొత్తానికి మారక ద్రవ్యంగా తన దేశ కరెన్సీ డాలర్‌ని కలిగివున్న అమెరికా అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని ప్రభా వితం చేస్తున్నప్పుడు ఆ దేశ కరెన్సీ మీద అన్ని దేశాల ప్రజలకూ ఆశ పుట్టడం, చీప్ లేబర్‌కి ఊతమిచ్చే పరి స్థితులు అమెరికాలో వుండటం.. ఇవన్నీ సక్రమమో, అక్రమమో వలసలకి దోహదం చేస్తుంది. వలసలు దేశాల మధ్య సమస్యగా భావించి దౌత్యపరంగా పరిష్కారాలకు ప్రయత్నించాలే తప్ప ట్రంప్ తన తెంపరితనంతో ఇలాగే ఓరల్ డయేరియాతో రంకెలేస్తూ, వీరంగంతో గంతులేస్తే ప్రయోజనం లేదు. ఎందుకంటే అమెరికా వంటి దేశాలకు వలసలు పోవడం వెళ్లేవారికి ఎంత అవసరమో, ఆ వలసదారుల అవసరమూ ఆ దేశాలకూ అంతే అవసర ముంటుంది. ఎందుకంటే ఆర్ధికంగా బలిసిన దేశాల ప్రజలు తమ ‘సీట్ల’ను తక్కువ వేతనాలకి కదల్చరు మరి!
תגובות