top of page

‘దత్తు’డిని తెచ్చాడు.. భూమి కొట్టేశాడు!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • `చనిపోయినవారి ఆస్తి కోసం పాపాలావ్రు నాటకం

  • `పదేళ్ల తర్వాత నకిలీ పత్రాలతో తెరపైకి దత్తపుత్రుడు

  • `ఆయన్నుంచి 72 సెంట్లు కొనుగోలు చేస్తూ రిజిస్ట్రేషన్‌

  • `రెవెన్యూ మాయతో గగ్గోలు పెడుతున్న అసలు కుటుంబ సభ్యులు

  • `పోలీస్‌స్టేషన్‌, కోర్టు మెట్లెక్కినా అడ్డుపడుతున్న రాజకీయ పరపతి


మనకున్న సెంటు స్థలం మనదేనని నిరూపించుకోవాలంటే సవాలక్ష ప్రశ్నలు, వందలకొద్దీ ప్రదక్షిణలు, పదులసార్లు సర్వేలు చేయించినా ముప్పుతిప్పలు పెట్టిగానీ రెవెన్యూ యంత్రాంగం ధ్రువీకరణ పత్రం ఇవ్వదు. అదే ‘వేరే వాడి భూమి కాజేస్తున్నాను.. అందులో మీకూ వాటా ఇస్తాను’ అని చెబితే చాలు.. చెలరేగిపోయి ఆగమేఘాల మీద రికార్డులు మార్చేసి కోట్లాది రూపాయల విలువైన భూములను ఆక్రమార్కులకు దారాధత్తం చేసేసి లక్షలాది రూపాయలు తీసుకొని ఎంచక్కా పాము చావకుండా, కర్ర విరగకుండా తీర్పులిస్తుంటారు. మొన్నటికి మొన్న నగరానికి చెందిన కస్పా రమాప్రభు వ్యవహారంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం అనుసరించిన సూత్రాన్నే ఇప్పుడు సింగుపురంలో కోట్లు విలువ చేసే మరో 72 సెంట్ల భూమి కథను కూడా అదే సూత్రంతో నడిపించారు. వారసుల్లేని దంపతులకు.. వారు చనిపోయిన పదేళ్లకు దత్తపుత్రుడిని సృష్టించి ఆయన పేరిట భూమిపత్రాలు పుట్టించి, ఆమ్మి వేయించిన చరిత్ర స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానిది. ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ఒకరికి, ఆస్తికి వారసత్వ హక్కును వేరొకరికి ఇచ్చి ఇద్దరి జుట్లకు ముడేసిన పాత తహసీల్దార్‌ వ్యవహారాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇందుకు ఉదాహరణ ఈ కథనం.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రూరల్‌ మండలం సింగుపురం రెవెన్యూ సర్వే నెంబర్‌ 284/4,5,6లో ఉన్న 72 సెంట్ల భూమి అదే గ్రామానికి చెందిన గొంటి కుష్టయ్య, కొండమ్మ దంపతులకు పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించింది. సంతానం లేని ఈ దంపతుల్లో కుష్టయ్య 2014లో, కొండమ్మ 2015లో చనిపోయారు. వారసులు లేకపోవడంతో చనిపోయే వరకు తమ సమీప బంధువుల ఇంట్లోనే కాలం వెళ్లదీశారు. అనంతరం ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కోసం బంధువులు దరఖాస్తు చేసుకుంటే విచారణ అనంతరం రెవెన్యూ యంత్రాంగం కుష్టయ్య వారసులుగా కొందర్ని గుర్తించి, వారి పేరిట ధ్రువపత్రం అందజేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం కుష్టయ్య, కొండమ్మలకు చెందిన 72 సెంట్ల భూమికి వారసులు వీరే అవుతారు. ఈ వారసత్వ కథను ఇక్కడే పాత తహసీల్దార్‌ మార్చేశారు. రోడ్డు ఫేసింగ్‌లో ఉన్న ందున కోట్ల విలువ చేసే ఈ 72 సెంట్ల భూమిపై కన్నేసిన ఓ కబ్జాదారుడు రెవెన్యూ యంత్రాంగాన్ని కలిసి డీల్‌ మాట్లాడుకున్నాడు. అంతే.. పిల్లలు లేని దంపతులకు.. అదీ వారు చనిపోయిన పదేళ్ల తర్వాత ఓ దత్తపుత్రుడు తెరపైకి వచ్చాడు. ఆయన పేరు మీద ఆధార్‌ కార్డు సృష్టించి, 72 సెంట్ల భూమిని ఆయన పేరిట రాసేశారు. ఈ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న వ్యక్తి భార్య ఆయన్నుంచి ఈ భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డులు పుట్టించారు. కాగా ఫ్యామిలీ సర్టిఫికెట్‌ పొందినవారు దాని ఆధారంగా ఆ భూమి రిజిస్ట్రేషన్‌ చేయించి మ్యూటేషన్‌ చేయాలంటూ రెవెన్యూ కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకుంటే.. ఇంకెక్కడి భూమి.. ఎప్పుడో ఆయన వారసుడు రాజారావు అమ్మేశాడని కార్యాలయ వర్గాలు చావు కబురు చల్లగా చెప్పాయి. దాంతో ఈ వ్యవహారం వివాదంలోకి వెళ్లిపోయింది.

దత్తత పేరుతో నాటకం

మృతిచెందిన కుష్టయ్య, కొండమ్మ తదనంతరం వారి కుటుంబ సభ్యులుగా ఫ్యామిలీ సర్టిఫికెట్‌ పొందినవారు వెల్లడిరచిన వివరాలు, చేసిన ఆరోపణల ప్రకారం.. నకిలీ దత్తపుత్రుడి సృష్టి వెనుక సింగుపురానికే చెందిన రైల్వే ఉద్యోగి పాపారావు హస్తం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే పాపారావు ఫోర్జరీ సంతకాలతో రెవెన్యూ పత్రాలు, పాస్‌పుస్తకాలు సృష్టిస్తుంటాడనే ఆరోపణలు ఉన్నాయి. కుష్టయ్య, కొండమ్మ దంపతులకు చెందిన 72 సెంట్ల భూమి ఉన్నట్లు గుర్తించిన అతగాడు వారు దాన్ని కాజేసేందుకు పథకం రచించాడు. మృతిచెందిన పదేళ్ల తర్వాత వారి వారసుడంటూ ఒక వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చాడు. కుష్టయ్య, కొండమ్మ దంపతులు జీవించి ఉన్నప్పుడు అతగాడిని దత్తత తీసుకున్నట్టు ఫోర్జరీ పత్రాలు సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటి పేరు, తండ్రి పేరు మార్చి ఆధార్‌ కార్డు కూడా పుట్టించి దాని ఆధారంగా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 72 సెంట్ల భూమి కొట్టేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సంతానం లేని కుష్టయ్య, కొండమ్మ చనిపోయేవరకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల పిల్లలపై ఆధారపడి జీవనం సాగించారు. వీరిద్దరికీి పిత్రార్జితంగా అందిన ఆస్తిలో కొంత విక్రయించగా మృతిచెందే నాటికి 72 సెంట్లు మిగిలింది. 2014లో కుష్టయ్య మృతిచెందిన తర్వాత కుష్టయ్య అన్నదమ్ములు, అక్కచెల్లెల పిల్లలకు ఆ 72 సెంట్ల భూమి దఖలుపరుస్తూ కొండమ్మ వీలునామా రాసిచ్చినట్టు గొంటి వారసులు చెబుతున్నారు. అయితే రైల్వే ఉద్యోగి పాపారావు దాన్ని కాజేసేందుకు పన్నాగం పన్నాడు. 2019లో పాపారావు తన తండ్రి పేరుతో సర్వే నెంబర్‌ 284/4, 5, 6లో ఉన్న 72 సెంట్లకు శిస్తు కట్టినట్టు నకిలీ రశీదులు సృష్టించాడని బాధిత కుటుంబీలు ఆరోపిస్తున్నారు.

ఫోర్జరీ సంతకాలు.. నకిలీ పత్రాలు

అక్కడితో ఆగకుండా కొండమ్మ 2014లో రాసినట్టు బాధితులు చూపిస్తున్న వీలునామాలో భాగస్వామి అయిన బోరుభద్ర గంగులు కుమారుడు రాజారావుకు డబ్బులు ఆశ చూపించి లొంగదీసుకున్న పాపారావు దత్తత కథకు తెరతీశాడు. కుష్టయ్య, కొండమ్మ దంపతులు రాజారావును దత్తత తీసుకున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించారు. దీన్ని ఆధారంగా చూపించి రాజారావు ఇంటి పేరు అయిన బోరుభద్రను గొంటిగా మార్చారు. అదేవిధంగా తండ్రి పేరు గంగులు కాగా దాన్ని మార్చి కుష్టయ్య పేరును చేరుస్తూ 2022 డిసెంబర్‌ ఆరో తేదీన ఆధార్‌ కార్డులో మార్పులు చేయించాడు. దాన్ని చూపించి రెవెన్యూ అధికారులను మేనేజ్‌ చేసి అడంగల్‌లో కొండమ్మ స్థానంలో రాజారావు పేరును చేర్పించాడు. ప్రభుత్వ జారీ చేసినట్టు చూపిస్తూ ఫోర్జరీ సంతకాలతో పాస్‌బుక్‌ కూడా తయారుచేయించాడు. రికార్డులన్నీ మార్చేసిన తర్వాత 2023 మే ఆరో తేదీన శ్రీకాకుళం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గొంటి కుష్టయ్య కుమారుడు రాజారావుగా చూపించి వారి 72 సెంట్ల భూమిని రైల్వే ఉద్యోగి పాపారావు భార్యకు అమ్మినట్లు 3809/23 నెంబర్‌తో క్రయ డాక్యుమెంట్‌ రిజిస్టర్‌ చేయించారు.

పోలీసులను, కోర్టును ఆశ్రయించినా..

గ్రామంలో ఎవరికీ తెలియకుండా పాపారావు గుట్టుగా తతంగం నడుపుతున్న సమయంలోనే కుష్టయ్య, కొండమ్మల వారసులుగా కుష్టయ్య అన్నదమ్మలు, అక్కచెల్లెళ్ల పిల్లల పేరుతో రెవెన్యూ అధికారులు 2022 డిసెంబర్‌ 22న ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ జారీచేశారు. గ్రామంలో విచారణ జరిపి, గ్రామ పెద్దల సాక్ష్యాల ఆధారంగానే ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. దాని ఆధారంగా కుష్టయ్య వారసులు 2023 జనవరి, సెప్టెంబర్‌ నెలల్లో సర్వే నెంబర్‌ 284/4, 5, 6లో ఉన్న 72 సెంట్ల భూమిని తమ పేరిట రిజిస్టర్‌ చేయించి, అడంగళ్లు కూడా మార్పించుకున్నారు. వీటి ఆధారంగా మ్యూటేషన్‌ చేయాలని తహసీల్దార్‌ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాపారావు కుష్టయ్య వారసుల నుంచి తాము ఆ భూమి కొనుగోలు చేశామంటూ మ్యూటేషన్‌కు అభ్యంతరం తెలుపుతూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాపారావు అడ్డగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎప్పుడో పదేళ్ల క్రితం మృతి చెందిన కుష్టయ్య, కొండమ్మలకు పదేళ్ల తర్వాత వారసుడు తెరపైకి రావడమేంటంటూ గత నెల ఆరో తేదీన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ పొందిన వారు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు పాపారావును పిలిపించి వివరణ కోరగా రాజకీయ పలుకుబడితో మేనేజ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటినుంచి బాధితులు న్యాయం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామంలో పెద్దలంతా కుష్టయ్య అన్నదమ్ముల కుమారులకు మద్దతుగా నిలిచినా పాపారావు వారిందరికీ ఎదురు తిరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించి వివాదాస్పద భూమిలో నోటీసు బోర్డులు పెట్టినా వాటిని దౌర్జన్యంగా తొలగించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పాపారావు బాధితులు అనేక మంది ఉన్నారని, వారు కూడా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page