top of page

దమ్ముంటే పట్టుకో ఏసీబీ.. డబ్బుకొట్టి వచ్చేస్తాం డ్యూటీకి

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 14
  • 4 min read
  • బీసీ వెల్ఫేర్‌, ఏసీబీ అధికారుల మధ్య బలమైన బంధం

  • రెండోసారీ తప్పించుకున్న సూపరింటెండెంట్‌

  • ఏసీబీ సిఫార్సులు పట్టించుకోని బీసీ సంక్షేమ శాఖ

  • చర్యలు తీసుకోవాల్సిన వారిపై ఉపేక్ష

  • డబ్బులు తీసుకొని ఫోకల్‌ పాయింట్‌లో ఉద్యోగాలు

‘‘2008 నుంచి అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన అనేక దాడుల్లో వార్డెన్లపై తీసుకున్న చర్యల వివరాలు బీసీ వెల్ఫేర్‌ కార్యాలయంలో గాని, ఏసీబీ అధికారుల వద్ద గానీ లేవు. రైడ్‌లో పట్టుబడ్డ వార్డెన్లు దర్జాగా ఎటువంటి శిక్షలు లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు.’’
‘‘ఏసీబీ అధికారులు హాస్టల్స్‌పై దాడులు నిర్వహించి, దర్యాప్తు చేసి సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదిక పంపిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఏసీబీ అధికారులు తయారుచేసిన ఆర్టికల్‌ ఆఫ్‌ ఛార్జెస్‌ ప్రాప్తికి ఉండాలి. కానీ బీసీ సంక్షేమ శాఖలో ఆ విధానం పాటించకుండా ఏసీబీ ఏ ఛార్జెస్‌ ఫ్రేమ్‌ చేసింది అని చూడకుండా వారి ఇష్టానికి ఛార్జెస్‌ ఫ్రేమ్‌ చేసి నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు. 2016 ఆగస్టులో పలాస బీసీ వెల్ఫేర్‌ కాలేజ్‌ బాయ్స్‌ హాస్టల్‌పైన దాడులు చేసిన ఏసీబీ అధికారులు ఛార్జెస్‌ ఫ్రేమ్‌ చేయకుండానే బీసీ వెల్ఫేర్‌ అధికారులు అప్పటి వార్డెన్‌ కొంచాడ గురువులుపైన ముందుగానే ఛార్జెస్‌ ఫ్రేమ్‌ చేసి ఏసీబీ అధికారులను రికార్డులు, సాక్ష్యాలు అడకుండానే రెండు ఇంక్రిమెంట్లు కోతపెట్టి చర్యలు తీసుకున్నాం పో.. అని విడిచిపెట్టేశారు. అలాగే ఏసీబీ దాడులు చేసిన తర్వాత సంబంధిత వార్డెన్లపైన ఎటువంటి చర్యలు తీసుకున్నామో తెలియపరిచే నివేదిక ఏసీబీ అధికారులకు ఇవ్వకుండా తొక్కిపెట్టి ఉంచేస్తున్నారు.’’
‘‘2017 జులైలో శ్రీకాకుళం ఏసీబీ అధికారులు ఆమదాలవలస, తోటవాడ బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించి పలు లోపాలు గుర్తించారు. అప్పటి ఏబీసీడబ్ల్యూవో శ్యామలకుమారిని ఆమదాలవలస హాస్టల్‌కు పిలిపించి ఆమె సమక్షంలో పంచనామా పూర్తిచేశారు. ఈ సందర్భంగా తాను ఈ హాస్టల్‌ను పలుమార్లు సందర్శించానని, వార్డెన్లపై చర్యలకు సిఫార్సు చేస్తూ జిల్లా కార్యాలయానికి నివేదిక ఇచ్చానని ఏసీబీ అధికారులకు తెలుపుతూ అందుకు సాక్ష్యంగా ఒక లేఖ జిరాక్స్‌ను స్వయంగా ఏసీబీ అధికారులకు అందించారు. దీని మీద అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు అసలు ఈ లేఖ వాస్తవికత ఎంతో తెలుసుకోవడం కోసం జిల్లా బీసీ వెల్ఫేర్‌ కార్యాలయానికి లిఖితపూర్వక సమాధానం కోరారు. అసలు అటువంటి లేఖే తమ కార్యాలయానికి శ్యామలాకుమారి నుంచి చేరలేదని స్పష్టం చేశారు. శ్యామలాకుమారిపై ఏసీబీ అధికారులను తప్పుదోవ పట్టించినందుకు, ఆమె పర్యవేక్షణ సంబంధిత హాస్టల్‌లో సరిగా లేనందుకు చర్యలు తీసుకోవాల్సిందిపోగా ఇంతవరకు ఎటువంటి యాక్షనూ లేదు. విచిత్రమేమిటంటే.. తమను తప్పుదోవ పట్టించిందంటూ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక పంపితే, దాని ఆచూకీ ఇప్పటికీ తేలలేదు.’’
‘‘జిల్లాలో సంచలనం సృష్టించిన స్కాలర్‌షిప్‌ల కుంభకోణంలో కూడా తక్కువ మొత్తంలో ఆర్థిక నష్టం జరిగిన కాలానికి సంబంధించిన అధికారులు, సిబ్బందిని అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో ఛార్జిషీటు వేసి ఏసీబీ అధికారులు ఈ వ్యవహారం వెలుగుచూడకముందే పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్మును తినేసిన అధికారులు, సిబ్బందిని అరెస్ట్‌ చేయకపోవడం, అరెస్ట్‌ చేసినవారి పేర్లు ఛార్జిషీటులో చేర్చకపోవడం జిల్లాలో ఏసీబీకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులకు ఉన్న లోపాయికారీ ఒప్పందాలకు నిదర్శనం.’’
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా బీసీ సంక్షేమ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాలరాజు ఇదే శాఖలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన ఎరియర్స్‌ మంజూరు కోసం సొమ్ములు తీసుకుంటూ రెండు రోజుల క్రితం ఏసీబీకి దొరికిపోయిన విషయం పాఠకులకు తెలుసు. అయితే ఆయన ఏసీబీకి పట్టుబడటం ఇది రెండోసారి. ఒకసారి ఏసీబీకి పట్టుబడి ఆ కేసు ఇంకా నడుస్తుండగా, మళ్లీ లంచం తీసుకోడానికి ఎంత ధైర్యం ఉండాలి?! అనే ప్రశ్న ఉద్యోగ వర్గాల్లో తలెత్తుతోంది. అది కూడా సొంత డిపార్ట్‌మెంట్‌ వ్యక్తుల నుంచే లంచం తీసుకోవడం మరీ ఘోరమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ తప్పు బాలరాజుదో, లేదూ అంటే మరో డీబీసీడబ్ల్యూవోదో, ఇంకో హాస్టల్‌ వార్డెన్‌దో కాదు. ఏసీబీకి దొరికి కేసు కొనసాగుతుండగానే ఫోకల్‌ పాయింట్‌లో ఉద్యోగానికి రావడం, ఏసీబీ అధికారులు సిఫార్సు చేసిన శిక్షలు కాకుండా డబ్బుమూటలు ఇచ్చి నామ్‌ కే వాస్తేగా వారి శిక్షలను వారే ఖరారు చేసుకోవడం వల్ల ఎన్నిసార్లు దొరికినా ఏం కాదులే అన్న బలుపు ఎక్కువైపోవడం వల్లే ఏసీబీకి గతంలో దొరికినవారే మళ్లీ దొరుకుతున్నారు. ఏసీబీ అధికారులకు దొరికినా శాఖలో ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో సొమ్ములిచ్చి శిక్షలు లేకుండా తప్పించుకుంటున్నారు. ఏసీబీ అధికారులు కూడా కుంభకోణంలో పాత్రధారులంటూ అరెస్ట్‌ చేసినా ఛార్జిషీటు దగ్గరకు వచ్చేసరికి కొందర్ని తప్పిస్తున్నారు. వీటన్నింటికీ కారణం డబ్బే. అందుకే పుష్ప`2లో అల్లు అర్జున్‌ అన్నట్టు దమ్ముంటే పట్టుకోరా షకావత్తు.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అన్నట్టు బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు కూడా దమ్ముంటే పట్టుకో ఏసీబీ.. డబ్బుమూటలు కొట్టి వచ్చేస్తాం డ్యూటీకి అంటున్నారు.

స్కాలర్‌షిప్‌ల కుంభకోణం వెలగుచూసినప్పుడు అప్పడు డీబీసీడబ్ల్యూవో కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేసిన బాలరాజు పేరుతోనే ఎక్కువ నిధులు దారిమళ్లింపునకు సంబంధించిన ప్రొసీడిరగ్స్‌ ఉన్నాయి. దీంతో నకిలీ స్కాలర్‌షిప్‌ల కుంభకోణంలో బాలరాజును ఏసీబీ సిఫార్సు మేరకు సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ కేసు నడుస్తుండగానే సొంత డిపార్ట్‌మెంట్‌లో ఇద్దరి నుంచి లంచం తీసుకుంటూ బాలరాజు ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. వాస్తవానికి ఈ దాడి ముఖ్య ఉద్దేశం బాలరాజును పట్టుకోవాలని కాదు. ఇదే ఆఫీసులో బాలరాజులాగే జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేసి, ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా ఉన్న డి.పార్వతిని పట్టించాలని ప్రయత్నించారు. ఆమేరకు సూపరింటెండెంట్‌ పార్వతికి సొమ్ములివ్వాలని బాలరాజు బాధితులకు ఫోన్‌లో చెప్పిన రికార్డింగ్‌ ఏసీబీ అధికారుల వద్ద ఉంది. కానీ లంచం తీసుకునే సమయానికి పార్వతి లేకపోవడంతో మళ్లీ బాలరాజే దొరికిపోయాడు. వాస్తవానికి సూపరింటెండెంట్‌ పార్వతి కూడా ఏసీబీ కేసులో నిందితురాలే. 2012లో నాగరాణి డీసీడబ్ల్యూవోగా ఉన్నప్పుడు పార్వతి జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేశారు. నకిలీ స్కాలర్‌షిప్‌ల కుంభకోణంలో పార్వతి జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న సమయంలో ఎక్కువ ప్రొసీడిరగ్స్‌ ఉన్నాయని, అప్పటి ఏసీబీ డీఎస్పీగా పని చేసిన కరణం రాజేంద్ర 2107 జూన్‌ 9న పార్వతితో పాటు మరికొంతమందిని అరెస్ట్‌ చేశారు. ఇదే కేసులో 2016 మే 25న ఎఫ్‌ఐఆర్‌ వేశారు. 2017లో స్కాలర్‌షిప్‌ కుంభకోణం మీద ‘ఈనాడు’ కథనం ప్రచురించింది. దీని మీద ఏసీబీ డీఎస్పీ రంగరాజు కథనంలో పేర్కొన్న కాలానికి సంబంధించి రికార్డులు పరిశీలించారు. తీగ లాగితే డొంక కదలినట్లు 2014`15 విద్యాసంవత్సరానికి నకిలీ స్కాలర్‌షిప్‌లు ఇచ్చేసి, ఆ సొమ్ములు సంక్షేమ శాఖ అధికారులు తినేశారని ‘ఈనాడు’ కథనం సారాంశం. కానీ ఎప్పట్నుంచో ఇది జరుగుతుందని రికార్డులు పరిశీలించిన తర్వాత అర్థమైంది. దీంతో ముగ్గురు గుమస్తాలు కె.పార్వతి, బి.బాలరాజు, బి.చంద్రశేఖర్‌తో పాటు డీబీసీడబ్ల్యూవో బి.రవిచంద్ర, ఏటీడబ్ల్యూవో బి.ఎర్రన్నాయుడు, శ్రీకాకుళం బాలికల ట్రైబల్‌ హాస్టల్‌ వార్డెన్లు ఎస్‌.రaాన్సీ, పాలకొండ ఎస్టీ హాస్టల్‌ వార్డెన్‌ జి.వెంకునాయుడుతో పాటు పాలకొండలో ఓంసాయి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.ఉమామహేశ్వరరావు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అజయ్‌కుమార్‌లను అరెస్ట్‌ చేశారు. విచిత్రమేమిటంటే.. అరెస్టయిన తర్వాత ఛార్జిషీట్‌ వంటి ప్రక్రియ దగ్గరకొచ్చేసరికి పార్వతి పేరు లేదు. ఆ సమయంలో ఏసీబీని ఆమె పెద్దఎత్తున మేనేజ్‌ చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. అప్పుడు తప్పించుకున్న పార్వతి మళ్లీ తాజాగా మరోసారి తప్పించుకున్నారు. బాలరాజు ఏసీబీ అధికారులకు దొరికిపోయిన తర్వాత డీఎస్పీకి ఇచ్చిన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లోనైనా పార్వతి పేరు చెబితే ఆమెను కూడా బుక్‌ చేసివుండేవారు. కానీ తన సర్వీసు ఎలాగూ నాశనమైపోయింది కాబట్టి పార్వతి పేరు కూడా చెప్పి ఎందుకు నష్టపర్చడమనే కోణంలో బాలరాజు ఆ పాపం తనొక్కడిదే అని ఏసీబీ అధికారుల ముందు ఒప్పుకున్నట్టు భోగట్టా. 2014`15లో నకిలీ స్కాలర్‌షిప్‌ల కుంభకోణం వెలుగుచూసినప్పుడు జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న బాలరాజు కేవలం 18 ప్రొసీడిరగ్స్‌లో మాత్రమే అక్రమాలకు పాల్పడినట్లు అప్పటి ఏసీబీ అధికారులు తేల్చారు. కానీ అంతకు ముందు 2012లో పార్వతి జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు 100 శాతం అక్రమమేనని తేలాయి. అటువంటి పార్వతిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు ఆ తర్వాత మాత్రం ఆమె పట్ల ఉదారంగా వ్యవహరించారు. వాస్తవానికి బాలరాజుసు, పార్వతికి పడదు. ఆధిపత్య పోరులో వార్డెన్లు చెరోవైపు విడిపోయి రవిచంద్ర డీబీసీడబ్ల్యూవోగా పని చేసిన రోజుల్లో సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ చేస్తున్నాడంటూ బాలరాజు మీద ఒక ఫిర్యాదు చేయించారు. అప్పటి కలెక్టర్‌ లక్ష్మీనృసింహం దీని మీద ఒక స్వచ్ఛంద సంస్థ యజమానురాలితో విచారణ చేయించారు. ఆమె ఏమేరకు విచారించారో తెలీదు గానీ వచ్చిన ఫిర్యాదు నిజమేనని నృసింహానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ రవిచంద్రను అప్పటి కలెక్టర్‌ కోరారు. తన కార్యాలయంలో ఏం జరుగుతుందో తనకు తెలుసు కాబట్టి, అసలు ఈ ఫిర్యాదు ఎందుకు పెట్టారో అవగాహన ఉండటంతో అక్కడ పని చేసేది ఆయనొక్కడేనని, ఆయన్ను సస్పెండ్‌ చేస్తే పనులు జరగవంటూ రవిచంద్ర లక్ష్మీనృసింహానికి చెప్పడంతో ఆగ్రహించిన కలెక్టర్‌ రవిచంద్రను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి సరెండర్‌ చేసేశారు. 48 గంటలు గడిచాయో లేదో రవిచంద్ర మళ్లీ శ్రీకాకుళంలోనే పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. దీనిపై కోపోద్రిక్తుడైన లక్ష్మీనృసింహం ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఫోన్‌ చేసి రవిచంద్రను తాను విధుల్లో చేర్చుకోవడంలేదని, ఒకవేళ చేర్చుకోవాలని పట్టుబడితే తనను బదిలీ చేయాలని భీష్మించుకు కూర్చోవడంతో రవింద్రను అప్పటికప్పుడు విజయనగరం బదిలీ చేశారు. అంటే బీసీ సంక్షేమ శాఖలో ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page