top of page

దమ్ముండాలి గానీ పనిమనిషి కూడా కథానాయికే!

  • Guest Writer
  • May 14
  • 2 min read

కుక్కపిల్లా సబ్బు బిళ్ళా అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. స్పందించే మనసు, వ్రాసే దమ్ము ఉండాలి. కవితకు, రచనకు, సినిమాకు ఏదయినా వస్తువే. అలాగే బాలచందర్‌, విశ్వనాధులకు తమ సినిమాలకు పెద్ద పెద్ద బంగళాలు, కార్లు, అతిలోకసుందరిలు ఉండక్కరలేదు. పది ఇళ్ళల్లో పాచి పని చేసుకునే చెవిటి మాలోకం అయిన కోకిలమ్మ, రిక్షా తొక్కుకుంటూ వాల్‌ పోస్టర్లు అంటించే సీతాలు, కొండయ్యలు కూడా సినిమా వస్తువులే. జనవరి ఒకటో తేదీ 1983లో విడుదలయిన ఈ కోకిలమ్మ సినిమా అలాంటిదే. కోకిలమ్మ సినిమా. సరిత సినిమా. ఆమే షీరో ఈ సినిమాలో.

సుందర నగరం విశాఖపట్టణం మర్రిపాలెంలో పది ఇళ్ళల్లో అన్ని పనులూ చేసిపెడుతూ అందరి చేత తిట్లు తింటూ అందరికీ తల్లో నాలికయి చాకిరి చేస్తూ బతుకుని సాగిస్తూ ఉంటుంది కోకిలమ్మ. అక్కడే శంకరాభరణం శంకరశాస్త్రి అంతటి వాడిని కావాలని పగటి కలలు కంటూ ఉంటాడు నిరుద్యోగి రాజా. పొట్ట పోసుకోవటానికి మొబైల్‌ లాండ్రీ నడుపుతుంటాడు. ఒకే గూటి పక్షుల్లాగా ఇద్దరు కలుస్తారు , ఒకరంటే ఒకరు ఇష్టపడతారు.

అతని లోని సంగీత కళను ప్రోత్సహించి ఉధ్ధరించాలని నడుం బిగించి అక్కడే ఉండే రేడియో అన్నయ్య దగ్గరకు చేరుస్తుంది. చక్కటి విద్వాంసుడు అవుతాడు. ఆ ఊళ్ళోనే ఉండే ఓ ధనికురాలు స్వప్న రాజా మీద మోజు పడుతుంది. పెళ్ళి చేసుకోవటానికి సిధ్ధపడతారు. ఇదంతా గమనించిన కోకిలమ్మ గుండె పగిలి రాజా జీవితం నుండి తప్పుకుంటుంది. మళ్ళా తన పాత బతుక్కి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ అప్పటికే కాలాతీతం అవుతుంది. ఒక చేయి లేని తల్లి తారసపడుతుంది. ఆ తల్లి, ఆ తల్లి చంకలో పిల్లకు చేదోడు అయి అంతులేని కథ సినిమా వాల్‌ పోస్టర్ని అంటించడంతో సినిమా ముగుస్తుంది.

ఈ వాల్‌ పోస్టర్‌ విషయంలో కూడా బాలచందర్ని అభినందించాలి. కోకిలమ్మది అంతులేని కథ అని ప్రేక్షకులకు చెపుతాడు దర్శకుడు. నిజమే. కొన్ని జీవితాలు అలాగే వ్రాసి పెట్టబడి ఉంటాయి. జీవితమంతా అందరికీ సాయపడటం, వారందరి చేతుల్లో మోసగించబడటం. దేవుడు వాళ్ళ నుదుటిన అదే వ్రాస్తాడు. వాళ్ళు అందుకే పుడతారు.

ఇలాంటి సాదాసీదా కథను, దానికి తగ్గట్లు స్క్రీన్‌ప్లేని తయారు చేసుకున్నారు బాలచందర్‌. ఆయన సినిమాల్లో నటీనటుల ఓవర్‌ క్రౌడిరగ్‌ ఉండదు. రెండో మూడో ప్రధాన పాత్రలు, మరో మూడో నాలుగో సపోర్టింగ్‌ పాత్రలు ఉంటాయి. వాటిని ధరించేందుకు సూటయ్యే నటీనటులనే ఎంపిక చేసుకుంటారు. కోకిలమ్మగా సరిత తినేసింది. చెవిటి మాలోకంగా, గుండె పగిలిన స్త్రీగా, తన మానాభిమానాలను తాకట్టు పెట్టని ధృఢ మనస్తత్వం కల మహిళగా గొప్పగా నటించింది.

ఆమె నటనకు నంది ప్రత్యేక జ్యూరీ అవార్డుని కూడా గెలుచుకుంది. రాజాగా రాజీవ్‌ అనే తమిళ నటుడు . తెలుగులో ఇదే మొదటి సినిమా అతనికి. ఇతర ప్రధాన పాత్రల్లో స్వప్న, మా గుంటూరు జీవా, రేడియో అన్నయ్య తదితరులు నటించారు.

యం.యస్‌.విశ్వనాధన్‌ సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి. ఎవ్వరో పాడారు భూపాలరాగం సుప్రభాతమై కనుగొంటిని ఆ దేవుని పాట సినిమాకు ఐకానిక్‌ సాంగ్‌ అని చెప్పవచ్చేమో ! పల్లవించవా నా గొంతులో పల్లవి కావా , కొమ్మ మీద కోకిలమ్మ కుహూ, నీలో వలపుల సుగంధం నాలో చిలికెను మకరందం, మధురం మధురం నాదం పాటలు చాలా బాగుంటాయి. ఆత్రేయ గారు కనిపిస్తారు పాటల్లో. పోనీ పోతే పోనీ మనసు మారిపోనీ పాట బాగుంటుంది.

గణేష్‌ పాత్రో డైలాగులు చాలా పదునుగా ఉంటాయి. పాట వినిపించలేదు కనిపించింది అంటుంది చెవిటి కోకిలమ్మ. ఇలాంటి మనసుకు హత్తుకుపోయే డైలాగులు సినిమా అంతా ఉంటాయి. బిర్రయిన స్క్రీన్‌ ప్లేని తయారుచేసుకున్నారు బాలచందర్‌. మెప్పుగా బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకు.

లక్ష్మీజ్యోతి ఫిలింస్‌ బేనరుపై ఆర్‌ యస్‌ రాజు ఈ సినిమాను నిర్మించారు. చిన్నబడ్జెటుతో విశాఖ అందాలను ఉపయోగించుకుంటూ తీయబడిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సరితకు మంచి పేరు వచ్చింది. ఆమెకు విశాఖ కలిసొచ్చింది. కమర్షియల్‌గా కూడా సక్సస్‌ అయింది. సినిమా యూట్యూబులో ఉంది. క్లాసికల్‌, ఆర్ట్‌ ఫిలింసుని ఇష్టపడే సినిమా ప్రియులకు బాగా నచ్చుతుంది.

- సుబ్రమణ్యం దోగిపర్తి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page