దయగల ప్రభువులు...
- Prasad Satyam
- Oct 6
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్)
శ్రీకాకుళం రూరల్ మండలంలో టీడీపీ నాయకులు అగ్రికల్చర్ ఆఫీసర్‌గా కొత్త విధులు నిర్వహిస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి వాలంటీర్లను నియమించుకున్నట్టే ఇప్పుడు టీడీపీ నాయకులకు ప్రభుత్వం ఈ ఉద్యోగాలిచ్చిందని అపోహపడకండి. ఎలాగూ చేయడానికి పనులు లేవు కాబట్టి, కనీసం జనాలనైనా తమ చుట్టూ తిప్పించుకుందామనుకుంటున్నారో ఏమో గానీ శ్రీకాకుళం రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు మూకళ్ల శ్రీనివాసరావు నివాసాన్ని ఈ ఫొటోలో చూస్తున్నారు. ఆయన ఇంటిముందు బారులుతీరిన జనం యూరియా బస్తాల కోసం వచ్చారు. రైతుసేవా కేంద్రంలోనో, మండల వ్యవసాయ అధికార కేంద్రంలోనో యూరియాకు సంబంధించిన టోకెన్ తీసుకొని బస్తా కోసం వెళ్లాల్సిన రైతులు సోమవారం ఇలా మండల పార్టీ అధ్యక్షుడి ఇంటి ముందు క్యూలో కనిపించారు. టోకెన్ మీద ఏవో సంతకం మూకళ్ల శ్రీనే పెట్టేసి, యూరియా తెచ్చుకోమని పంపిస్తున్నారు. ఈ టోకెన్‌తో రైతుసేవా కేంద్రాల వద్ద ఉంచిన స్టాకును రైతులు తెచ్చుకుంటున్నారు. టీడీపీతోనో, లేదూ అంటే తటస్థంగానో ఉన్న రైతులు దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు గానీ, గడిచిన ఎన్నికల్లో వైకాపా తరఫున పని చేసినవారు, ఆ పార్టీ నాయకులో మండల టీడీపీ అధ్యక్షుడి ఇంటి వద్దకు వెళ్లి టోకెన్ తీసుకోడానికి నామోషీగా ఫీలవుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఎరువులు అందించడంలో విఫలమైందని జరుగుతున్న ప్రచారానికి తోడు ఇలా పార్టీ నాయకుల ఇళ్లలో టోకెన్లిస్తే పార్టీ మరింత పలుచబడిపోతుందేమో ఆ పార్టీ నాయకులే ఆలోచించాలి.
`










Comments