ఆపన్నులను అక్కున చేర్చుకునే ఆత్మీయుడు
సేవా కార్యక్రమాలకే ఎస్‌ఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటు
విద్య, వైద్య, క్రీడా, ఆధ్యాత్మిక రంగాలకు భూరి విరాళాలు
సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్య సేవలు

ఎదుర్కొన్న కష్టాలు ఆయనలోని కారుణ్య గుణాన్ని తట్టిలేపాయి. సామాన్యుడిగా పెరిగిన వాతావరణం ఆయనలో సేవాభావాన్ని పెంపొందించింది. తన కుటుంబంలా మరో కుటుంబం కష్టాలు కన్నీళ్లతో కుంగిపోరాదన్న భావన ఆయన్ను సేవాధనుడిగా రాటుదేల్చింది. వయసుతో పాటు వధాన్యత కూడా పెరుగుతూ వచ్చింది. ఫలతంగా దాతృత్వం అనే సుగుణం పేవా పరిమళాలు వెదజల్లడం ప్రారంభించింది. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే తక్షణమే వారి ముంగిట వాలిపోయి చేతనైనా సాయం ఇచ్చి చెయ్యి పట్టి నిలబెడతారు. ఆయన వద్దకు వెళ్లే వారెవరూ నిరాశ చెందరు. ఉత్త చేతులతో వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. అందుకే.. పేదలకు ఆయనే ఒక సంతోషం. అన్నార్తులకు ఆయనే అన్నదాత. మసకబారిన జీవితాలకు ఆయనే వెలుగు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆయనే ఆధారం.. పేద రోగులకు ఆయనే ఒక ఆలంబన. క్రీడాకారులకు ఆయనే మార్గదర్శి. అలా సమాజంలో దాదాపు అన్ని వర్గాలతోనూ సేవాబంధం పెనవేసుకున్నందునే సూర శ్రీనివాసరావు సామాజిక వైద్యుడయ్యారు. ప్రముఖ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకుని డాక్టర్ సూర శ్రీనివాసరావు అయ్యారు. పేదల ఇంట శుభకార్యం జరగాలన్నా.. ఒక దేవాలయం జీర్ణోద్ధరణ జరగాలన్నా.. ఒక పేద రోగికి స్వస్థత చేకూరాలన్నా శ్రీనివాసరావు ఒక చెయ్యి వేయాల్సిందే. తన స్వగ్రామమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు శ్రీకాకుళం నగరంలోనూ ఎందరో ఆపన్నులను అక్కున చేర్చుకుంటూ.. భూరి విరాళాలు ఇస్తూ.. సేవ కార్యక్రమాలతో వ్యాపారవేత్తగా కంటే సామాజికవేత్తగానే ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
కిందిస్థాయి నుంచి ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకున్నవారు చాలామందే కనిపిస్తారు. అలా ఎదిగినవారిలో చాలామంది తమ గతాన్ని, తమ గ్రామాన్ని, తమ స్నేహితులు, సన్నిహితులను సైతం మర్చిపోతుంటారు. హోదా, దర్పం ప్రదర్శించేవారే ఎక్కువ. కానీ ఎంత సంపాదించినా, ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా కన్నతల్లిని, ఉన్న ఊరిని, తను పెరిగిన సమాజాన్ని మర్చిపోకుండా ఏదో చేయాలని తపించేవారు కొద్దిమందే ఉంటారు. అటువంటి వారిలో సూర శ్రీనివాసరావు ముందుంటారు. పెద్ద కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగిన ఆయన ఆ కష్టాలనే తన ఎదుగుదలకు మెట్లుగా మలచుకున్నారు. భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. వ్యాపార రంగంలో కాలు మోపి కృషి, పట్టుదలతో విజయం సాధించి ఉన్నత స్థితికి చేరారు. సంపాదనలో కొంత దీనజనోద్ధరణకు కేటాయిస్తూ శ్రీమంతుడిలా పని చేస్తున్నారు. ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామంలో జన్మించిన శ్రీనివాసరావు తల్లిదండ్రులు గన్నయ్య, వైకుంఠమ్మలు. చాలా పెద్ద కుటుంబం. ఆ దంపతులది బహుసంతానం. మొత్తం ఏడుగురు పిల్లల్లో ఐదో సంతానమే సూర శ్రీనివాసరావు. ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్లు. ఇంత పెద్ద కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులతో సావాసం చేస్తూనే శ్రీనివాసరావు పెరిగారు. తల్లిదండ్రులు చదివించాలనుకున్నా పెద్దగా ఆసక్తి లేకపోవడంతో చదువుకు స్వస్తి చెప్పి వ్యాపారరంగం వైపు దృష్టి సారించారు. చిరు వ్యాపారిగా మొదటి అడుగు వేసిన శ్రీనివాసరావు క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేసి ఆ రంగంలో నిలదొక్కుకున్నారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ క్రమంగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కానీ తన నేపథ్యాన్ని ఎన్నడూ మర్చిపోలేదు. సమాజానికి, తన చుట్టూ ఉన్న పేదలకు ఏదో చేయాలన్న సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. వ్యాపారంలో తాను సంపాదించిన దాంతో కొంత సమాజానికి కేటాయించి సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ సేవలే ఆయన్ను సేవాసంపన్నుడిగా నిలబెట్టాయి. ఈయన సేవలకు గుర్తింపుగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక ప్రముఖ విద్యాసంస్థ డాక్టరేట్‌తో సత్కరించింది.
సేవలకే ఒక ట్రస్ట్

ఏ పని చేసినా దాన్ని ప్రణాళికాబద్ధంగా, నిబద్ధతతో చేపట్టాలి. అప్పుడే దాని విలువ పెరుగుతుంది. దాని లక్ష్యం నెరవేరుతుంది. ఈ ఉద్దేశంతోనే తాను చేపడుతున్న సేవా కార్యక్రమాలన్నీ ఒకే గొడుగు కింద సక్రమంగా జరగాలన్న లక్ష్యంతో శ్రీనివాసరావు తన పేరుతోనే నాలుగేళ్ల క్రితం తన పుట్టినరోజునే ఎస్‌ఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవాసంస్థను స్థాపించారు. అప్పటినుంచి ట్రస్ట్ పేరుతోనే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2020లో కరోనా మహమ్మారి , లాక్‌డౌన్ సమయంలో పనుల్లేక, ఆస్పత్రులపాలై నలిగిపోయిన పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చి నేనున్నాంటూ బహుముఖ సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవడంతోపాటు లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటించినవారికి, జిల్లాకు తిరిగి వచ్చిన వలస కూలీలకు రెండు పూటలా భోజనాలు పెడుతూ శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు అందజేస్తూ ఆపద్బాంధవుడిగా నిలిచారు. ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి, సినిమా హాల్ కార్మికులకు, విశ్వ బ్రాహ్మణులకు, జర్నలిస్టులకు, పేద కళాకారులకు నిత్యవసర కిట్లు పంపిణీ చేశారు. వందలాది మందికి విరాళాలు అందజేశారు. సమాజంలో అన్ని వర్గాలవారికి ఏదో విధంగా సహాయం, సేవ అందజేస్తూ అనతికాలంలోనే అందరి మన్ననలు అందుకున్నారు.
ప్రత్యేకంగా వంటశాల నిర్మాణం
వ్యాపారంలో ఎంత సంపాదించినా, ఉన్నదాంట్లో నలుగురికి సేవ చేయడంతోనే ఆత్మసంతృప్తి లభిస్తుందని నమ్మే శ్రీనివాసరావు నిరంతరాయంగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా వేళ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన ఆయన తోటపాలెంలో ఏకంగా ఒక వంటశాలనే నిర్మించి, సిబ్బందిని నియమించి భోజనాలు తయారు చేయించేవారు. వాటిని ప్యాక్ చేసి కరోనా ఆస్పత్రుల వద్దకు, ప్రధాన మార్గాల్లోకి పంపించి బాధితులకు అందజేసేవారు. ఆ విధంగా లక్షలాది ప్రజల కడుపు నింపి అన్నదాతగా నిలిచారు. కరోనా తర్వాత కూడా ఆర్తుల కోసం ఆ సేవలు కొనసాగిస్తున్నారు. వైద్యం, విద్య, ఆధ్యాత్మిక, క్రీడలు, తదితర రంగాలకు విరివిగా సహాయం అందజేశారు. పేద రోగుల వైద్యానికి ఆర్థికంగా చేయూతనందించడం, క్రీడా కార్యక్రమాలకు అండగా నిలవడం, పేద విద్యార్థులను ఆదుకోవడం, ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులకు భూరి విరాళాలు ఇవ్వడం ఇస్తూ దానకర్ణుడిగా పేరొందారు.
తోటపాలెం దాహార్తి తీర్చిన దాత
తోటపాలెం ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను గమనించిన సూర శ్రీనివాసరావు 2021లో సొంత నిధులతో మంచినీటి పథకం ఏర్పాటు చేయించారు. అలాగే గ్రామంలో రచ్చబండ కూడా ఏర్పాటు చేశారు. ఇదే గ్రామ సచివాలయానికి మంచినీటి ట్యాంకు, ఎంపీయూపీ స్కూల్లో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశారు.
ఎస్‌ఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా సమయంలో నెలల తరబడి లక్షలాది మంది కరోనా రోగులు, వారి సహాయకులకు భోజన సౌకర్యం కల్పించారు.
శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులకు అట్టలు, పరీక్ష సామగ్రి ఉచితంగా అందజేశారు.
తోటపాలెం, ఎచ్చెర్ల పాఠశాలల్లో సరస్వతీ దేవి, అబ్దుల్ కలాం, గాందీ,ó వివేకానంద, సర్వేపల్లి రాధాకష్ణ విగ్రహాలు ఏర్పాటు చేయించారు. పాలిటెక్నిక్ కళాశాలకు వాటర్ ప్లాంట్ అందజేశారు.
సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకు క్రీడాసామగ్రి, టీషర్టులు అందజేయడంతోపాటు పోటీలకు అయిన ఖర్చులు భరించారు.
వాలీబాల్ పోటీల నిర్వహణకు ఆర్థిక సాయం అందజేశారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పలువురు పేద రోగులకు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. `ఎచ్చెర్లలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూరి విరాళం అందజేశారు.
పేద విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా అనేక దేవాలయాల నిర్మాణానికి విరాళాలు అందజేశారు.
అత్యవసర వేళ ప్రజలను సకాలంలో ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పించారు.
శ్రీకాకుళం రూరల్ మండలం అంపోలు సబ్ జైలులో గాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటు ఖైదీల అవసరార్థం పిండిమిల్లు కూడా అందించారు.
మృతి చెందిన పలువురు జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.
ప్రతి ఏటా ఉగాది, సంక్రాంతి పండుగల సందర్భంగా నిరుపేదలకు వస్త్రదానం చేస్తున్నారు.
చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, పుస్తకాలు అందిస్తున్నారు.
నగరంతో పాటు పరిసర గ్రామాల్లోని క్యాన్సర్ బాధితులకు ఆర్థిక సహాయం చేయడంతోపాటు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు.
పలు క్రీడా టోర్నమెంట్ల నిర్వహణకు సహాయ సహకారాలు అందించారు.
జాతీయ విద్యావిధానానికి సహకారం
ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ విద్యా విధానం అమలుకు తనవంతు సహకారం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ది కోసం నిర్వహిస్తున్న శిక్షా సప్తాప్‌ా కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ గత జూలై 17న ఏకాదశి పురస్కరించుకొని ఆహర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీసుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో అరసవల్లి ఇంద్ర పుష్కరిణి వద్ద ఈ ఏడాది జూలై 10న అవధాన సరస్వతి డాక్టర్ బలుసు ఆపర్ణ ద్విశతావధాన కళా విలాసం, ఆపర్ణ ప్రతిభా కిరణ ద్యోతకం కార్యక్రమంలో అవధానులచే సత్కారం అందుకున్నారు.
నగరంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం`4కు ఫ్యాన్లు, లైట్లు ఉచితంగా అందించారు.
ఈ ఏడాది రంజాన్ సందర్భంగా నగరంలోని సూర్యమహల్ వద్ద ఉన్న జామియా మసీదులో పేద ముస్లింలకు నిత్యావసర కిట్లు, దుస్తులు అందించారు.
మొన్న వేసవి సీజనులో నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద తమ ట్రస్టు ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహించి విద్యార్థులు, ఆ మార్గంలో రాకపోకలు సాగించేవారి దాహార్తి తీర్చారు.
ఎచ్చెర్ల, శ్రీకాకుళం, సంతబొమ్మాళి మండలం మర్రిపాడు, మేఘవరం, వాలీవలస, వడ్డివాడ, పొన్నాడ, తామాడ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న 500 మంది విద్యార్ధులకు పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి(రథసప్తమి) ఉత్సవాల సందర్భంగా సుమారు 2,500 మంది భక్తులకు పులిహోర ప్యాకెట్లు, మంచినీరు సరఫరా చేశారు.
ఎచ్చెర్లలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి పూజల సందర్భంగా ఆలయానికి వచ్చిన సుమారు మూడువేల మంది భక్తులకు అన్నదానం చేశారు.
Comments