తెలంగాణ నుంచి వచ్చిన కిరాయి మూకలు
పెద్దిన లక్ష్మణరావు పథకంలో భాగమే గోవింద్ ఇంట్లో చొరబాటు
స్థానికంగా ఉంటూ రెక్కీ
పోలీసుల అదుపులో సూత్రధారీ, పాత్రధారులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఈమధ్య మన శ్రీకాకుళం బాగా డెవలపయింది. పలాసలో టౌన్ టీడీపీ అధ్యక్షుడు బడ్డ నాగరాజును హత్య చేసేందుకు బీహార్ నుంచి ముఠాను దించి దొరికిపోయిన ఘటనలో ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన రోజే నగరంలో ఇంకా చీకటి పడకముందే శనివారం సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే కిన్నెర థియేటర్ పక్కన హెడ్‌డీఎఫ్‌సీ ఏటీఎం కౌంటర్‌కు ఆనుకొని ఉన్న కోరాడ గోవింద్ (ప్రియా గోవింద్) ఇంటిలో కిరాయిమూకలు చొరబడి దోపిడీకి ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. పలాసలో బడ్డ నాగరాజును హత్య చేయడానికి అక్కడి వైకాపా నాయకులు బీహార్ నుంచి ముఠాను దించినట్టే ఇక్కడ కోరాడ గోవింద్ ఇంటిలో దోపిడీ కోసం నగరంలో గూనపాలెంకు చెందిన పెద్దిన లక్ష్మణరావు తెలంగాణ నుంచి కిరాయి మనుషుల్ని రంగంలోకి దించినట్టు పోలీసులు గుర్తించారు. లేదూ అంటే భద్రాచలం నుంచి ఒకరు, నాగర్‌కర్నూల్ నుంచి ఇద్దరు, కొత్తగూడెంకు చెందిన మరొకరు ప్రియా గోవింద్ ఇంట్లో కత్తులు పట్టుకొని చొరబడ్డారంటే కచ్చితంగా దీని వెనుక స్థానికుల సహకారం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే గూనపాలెంలో నివాసముంటున్న పెద్దిన లక్ష్మణరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మార్కెట్ రోడ్ నుంచి కల్యాణి థియేటర్ వైపు వెళ్తున్న మార్గంలో కోరాడ గోవింద్ హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కేఏఎన్ (కోరాడ ఆదినారాయణ ట్రేడర్స్) పేరుతో కోరాడ గోవింద్ సోదరులు అనేక ఫుడ్ కంపెనీలకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్నారు. అందులో ప్రధానమైనది ప్రియా ఫుడ్స్. అందుకే కోరాడ గోవింద్‌ను చాలామంది వర్తకులు ప్రియా గోవింద్ అని కూడా పిలుస్తారు. ఈయనకు స్థానిక కిన్నెర థియేటర్ దాటిన తర్వాత హెడ్‌డీఎఫ్‌సీ ఏటీఎం సెంటర్‌కు ఆనుకొని మెయిన్ రోడ్డులోనే సొంత ఇల్లు ఉంది. గోవింద్‌తో పాటు ఆయన సోదరులిద్దరు కూడా ఇదే ఇంటిలో ఉమ్మడిగా ఉంటున్నారు. అయితే కోరాడ గోవింద్, ఆయన తమ్ముడు దివాకర్ ప్రియా ఫుడ్స్ డిస్ట్రిబ్యూషన్ వద్ద రోజంతా ఉంటారు. మరో సోదరుడు కూరగాయల మార్కెట్ గేటు ఎదురుగా కిరాణా వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఇంటిలో రాత్రి వరకు గోవింద్ తల్లి, మహిళలు మాత్రమే ఉంటారు. ఈ విషయం తెలిసే శనివారం సాయంత్రం 7.20 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. ప్రతీరోజు మాదిరిగా కాకుండా ఆ రోజు గోవింద్ ఇంటికి ఆయన సోదరుడి పిల్లలు కూడా బయటి నుంచి రావడంతో పెరటి నుంచి వచ్చిన ఓ దుండగుడ్ని లోనికి రాకుండా తలుపు వేయడం, ముందు డోర్ నుంచి వచ్చినవారిని నిలువరించడానికి మనుషులు ఉన్నారు. దీంతో దుండగులు పరారయ్యారు. హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం సీసీల్లో నమోదైన ఫుటేజీ మేరకు నిందితుల్ని గాలించగా, గూనపాలెంలో గత కొద్దిరోజులుగా వీరు తచ్చాడుతూ కనిపించారని తెలిసింది. ఒక నిందితుడ్ని పోలీసులు అక్కడికక్కడే పట్టుకున్నారు. వీడిని సీసీఎస్, వన్‌టౌన్ పోలీసులు విచారిస్తే మిగిలినవారు విశాఖపట్నంలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులకు చిక్కారు. అయితే తెలంగాణకు చెందిన ఈ నలుగురూ శ్రీకాకుళంలో ఉన్న కోరాడ గోవింద్ ఇంట్లోకి చొరబడి దోచుకోడానికి ప్రయత్నించడం వెనుక చాలా రోజుల నుంచి రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తుంది. వీరిని గూనపాలెంలో ఉంటున్న పెద్దిన లక్ష్మణరావు అనే వ్యక్తి తీసుకువచ్చి గత కొద్ది రోజులుగా ఆశ్రయం ఇచ్చాడని, కోరాడ గోవింద్ ఇంట్లో దోపిడీకి పాల్పడాలన్న స్కెచ్ కూడా ఆయనదేనన్న అనుమానాలు ఉన్నాయి. బత్తిలి దగ్గర జగన్నాథపురం పరిసర ప్రాంతానికి చెందిన పెద్దిన లక్ష్మణరావు మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా పక్క రాష్ట్రాల నుంచి మనుషుల్ని తెప్పించి ఇక్కడ దోపిడీలకు అవకాశమిచ్చి, దొంగసొత్తును చెరిసగం సర్దుకునేవారని కొందరు చెప్పుకుంటున్నారు. అరవై ఏళ్లు పైబడ్డ పెద్దిన లక్ష్మణరావు ఆయన సామాజికవర్గానికి చెందినవారికి పెళ్లి సంబంధాలు చూస్తామని అందరి ఇంటికి వెళ్తుంటాడని, ఇందులో భాగంగానే ఎవరు ఎంత సౌండ్‌పార్టీయో తెలుసుకొని, ఆ తర్వాత దోపిడీకి ముఠాలను రంగంలోకి దించుతాడని తెలుస్తుంది. చాన్నాళ్ల క్రితం ముంబయి నుంచి డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి సొమ్ములు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే సంబంధిత వ్యక్తి చనిపోవడంతో పెద్దిన లక్ష్మణరావు పేరు తొలిసారిగా నగరంలో వినిపించింది. ఆ తర్వాత ఇలాంటి పనులు అనేకం చేసినా ఎక్కడా దొరక్కుండా తప్పించుకునేవాడని, కొద్ది రోజుల క్రితం స్థానిక రిలయన్స్ మార్ట్‌లో కూడా ఒకే బిల్లుమీద రెండుసార్లు సరుకును తరలించి దొరికిపోయాడని, అయితే పోలీస్‌స్టేషన్ వరకు ఈ కథ చేరకపోవడంతో పెద్దగా ప్రచారం జరగలేదని తెలుస్తుంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ బ్రోకరైజ్ చేస్తునే, మరోవైపు పెళ్లి సంబంధాలని ఎవరికీ తెలియకుండా కిరాయి మూకలను తేవడం వంటివికి పెద్దిన లక్ష్మణరావుకు రొటీనేనని చాలామంది చెబుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు నోరిప్పితే నగరంలో ఇలాగే ఏడెనిమిది చోట్ల ప్రయత్నించి విఫలమైన ఘటనలు బయటకు వస్తాయి.
Komentarze