వ్యాపారాలు హరిస్తున్న మోనోకార్పస్
పాలకొండ రోడ్డు చీకటిమయం
తొలగించడానికి ముందుకురాని కార్పొరేషన్
రోడ్డున పడుతున్న కుటుంబాలు ఏటికేడాది పెరుగుదల

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
దెయ్యం ఉందో లేదో తెలీదుగానీ, ఆ పేరు చెబితే మనకెందుకు భయం? ఎందుకంటే.. చీకట్లో మాత్రమే కనిపించే ఆకారం కాబట్టి. దెయ్యం మనల్ని చంపేస్తాదనే భావన కాబట్టి. చంపేయడానికి తెల్లటి ముసుగు, విరబోసుకున్న జుత్తు, వెనక్కు తిరిగిన పాదాలే ఉండక్కర్లేదు. జడలు విప్పుకున్న కొమ్మలు, భూమిలోకి పాతుకుపోయిన వేళ్లు, వెలుగును అడ్డుకుంటున్న ఆకులు ఉన్నా కూడా అది దెయ్యమే.. అది భయమే.. అటువంటి దెయ్యాలతో సహజీవనం చేస్తూ పాలకొండ రోడ్డులో వ్యాపారులు చచ్చిపోతున్నారు.. లేదంటే రోడ్డున పడిపోతున్నారు.
దెయ్యంకంటే భయం మహ చెడ్డదని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్టు వెలుతురు లేక, చీకటిని చీల్చే సూర్యుడు కనపడక స్థానిక పాలకొండ రోడ్డు కునారిల్లిపోతుంది. ఏపుగా పెరిగిన మోనోకార్పస్ చెట్లు ఇక్కడ వ్యాపారుల పీక నొక్కేస్తున్నాయి. ఈ చెట్లు విడుదల చేసే వాయువు వల్ల నిజంగా ఊపిరితిత్తులకు నష్టం ఏమేరకు జరుగుతుందో నిర్ధారించలేదు గానీ, ఏపుగా పెరిగిన ఈ చెట్ల వల్ల ఇక్కడి వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చేశారు. ప్రతీ ఏడాది కనీసం 25 వ్యాపారాలకు తక్కువ లేకుండా దివాలా తీస్తున్నారంటే కారణం ఈ దెయ్యంచెట్లే. అసలే పాలకొండ రోడ్డులో వ్యాపారాలు అంతంత మాత్రం. దీనికి తోడు భారీగా పెరిగిన చెట్లు, దాని నుంచి రోడ్డుకు రెండువైపులా ఏమున్నాయో కనపడని పరిస్థితి వెరసి పాలకొండ రోడ్డంటే ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లడానికి ఒక మార్గమన్న స్థాయికి దిగజారిపోయింది. ఈ చెట్లు తొలగించాలని స్వయంగా రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు చెప్పినా మున్సిపల్ యంత్రాంగం మాత్రం ఇంతవరకు ఒక్క అడుగు ముందుకెయ్యలేదు. ఈలోగా పండగ సీజన్ ముగిసిపోతే ఈ దెయ్యంచెట్ల పుణ్యమాని సంక్రాంతి అయిపోయిన తర్వాత ఈసారి దివాలా తీయడం కాదు.. వ్యాపారస్తులు ప్రాణాలు తీసుకునేట్టున్నారు.
శ్రీకాకుళం పట్టణంలో పాలకొండ రోడ్డు గత వైభవంగా మిగిలిపోనుందా? సిక్కోలు మున్సిపాలిటీ ఉదాసీన వైఖరిని చూస్తుంటే ఇది నిజం చేయడానికే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. రోడ్డు మధ్యలో వేసిన డివైడర్‌పై ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్ కళ్లమీద పడకుండా నివారించడానికి వేయాల్సిన చిన్న మొక్కల స్థానంలో ఆరోగ్యానికి హాని కలిగించే మోనోకార్పస్ అనే భయంకర విషప్రభావం చూపే మొక్కలను నాటారు. ఈ చెట్లు ప్రకృతికి, పర్యావరణానికి, ప్రజలకు కలిగించే హాని గురించి ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు లెక్కలేనంత మంది అరిచిగీపెట్టి చెప్తున్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులకు చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదు. ఆ మొక్కలకు ప్రత్యామ్నాయంగా బోగన్‌విలియా లాంటి మొక్కలను పెంచుకోవచ్చు. కాని, ఈ సలహాలను మున్సిపల్ అధికారులు చెవికెక్కించుకోవడం లేదు. కనీసం ఎప్పటికప్పుడు ఈ మొక్కల కొమ్మలు కత్తిరించి, పెద్దగా పెరగకుండా చిన్న ఎత్తులో ఉండే మొక్కలుగా కూడా నిర్వహించడం లేదు. కొమ్మలంటూ కత్తిరిస్తే అది మున్సిపల్ ఎలక్ట్రికల్ పోల్‌కు పక్కనున్న రెండు చెట్లకే పరిమితం చేస్తున్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యపూరిత నిర్వహణ వల్ల ఎత్తుగా పెరిగిన ఈ వృక్షాలు భూగర్భ జలాలను అత్యంత భారీస్థాయిలో వినియోగించుకుంటాయి. ఈ మొక్కల నిర్వహణను మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల ఏపుగా పెరిగిపోయి, ఈ ప్రాంతంలో సంచరించే స్థానికులకు రాత్రిపూట హార్రర్ సినిమాలను తలపిస్తున్నాయి. ఏపుగా పెరిగిన ఈ వృక్షాల వలన వీధిదీపాలు వెలుగుతున్నప్పటికీ రోడ్లను చీకటిమయం చేసేసాయి. ఆ ప్రాంతంలో ఉన్న దుకాణాల నుంచి వస్తోన్న వెలుతురును కూడా ఈ మొక్కలు కబళించడం వలన ప్రయాణీకులు చిమ్మచీకటిలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. అటువైపు ప్రయాణిస్తున్న వారికి డివైడర్‌పైనున్న వృక్షాలు దెయ్యాల చెట్ల మాదిరిగా కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు అటువైపుగా రాకపోకలు సాగించడానికి సాహసించలేకపోతున్నారు. దీంతో వినియోగదారులు రాత్రిపూట అటువైపు వెళ్లడం మానుకుంటున్నారు. పీక్ అవర్స్‌లో బిజినెస్ లేకపోవడంతో చాలామంది దుకాణదారులు క్రమంగా తమ వ్యాపారాలను జిటి రోడ్డు వైపు తరలించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. జీటీ రోడ్డులో దుకాణాలు అద్దెకు తీసుకోవాలంటే ముందు ఏడు తరాలు అంబానీలో, అదానీలో అయివుండాలి. పాలకొండ రోడ్డులో వ్యాపారస్తులకు ఈ మొక్కలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఇప్పటికే ఇవి విడిచిపెట్టిన గాలిని పీల్చి ఊపిరితిత్తుల వ్యాధులతో సతమతం అవుతున్న వ్యాపారస్తులపై ఇప్పుడు వ్యాపారాలు సరిగా సాగక గొడ్డలి వేటు పడుతున్నట్టుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొక్కలపై గొడ్డలి వేటు పడితే తప్ప తమ జీవితాలలో ఉషోదయం ఉండదని ఆవేదన చెందుతున్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి, మున్సిపాలిటీ అధికారుల మీద గట్టి వత్తిడిపెడితే కొమ్మలు కత్తిరించి ఊరుకుంటున్నారు. నెలతిరిగే సరికల్లా తిరిగి యధాతథ పరిస్థితికి చేరుకుంటోంది. దాంతో మళ్లీ అదే సమస్యపై రాజకీయ నాయకుల చుట్టూ తిరగలేక, వ్యాపారాలు సరిగా జరగక తీవ్రంగా సతమతమవుతున్నారు. పట్టణంలో అన్ని ప్రాంతాల మాదిరిగానే అటు జిటి రోడ్డులో, ఇటు ఆర్టీసి కాంప్లెక్స్ రోడ్డులో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితో సమానంగా పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్నప్పటికీ కేవలం మున్సిపాలిటీ అధ్వాన నిర్వహణ వల్ల వ్యాపారాలు సరిగా సాగక కుదేలవుతున్నారు. మరికొద్ది రోజుల్లో పండగ సీజన్ వ్యాపారం పుంజుకోనున్న నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు పూనుకొని పాలకొండ రోడ్డులో డివైడర్‌పైనున్న మొక్కలను తొలగించి ప్రత్యామ్నాయంగా మరేవైనా పొదలను, గుల్మాలను ఏర్పాటుచేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం చలించి దీనిపై తగిన చర్యలు తీసుకోకుండా ఇదేవిధమైన ఉదాసీనతను కొనసాగించినట్లయితే పాలకొండ రోడ్డులో వాణిజ్యమంతా ఆవిరడం ఖాయం. ఆ పైన పాలకొండ రోడ్డులో ఒకప్పుడు వ్యాపారం బాగా జరిగేదని చెప్పుకునే ఒక పూర్వకాల వైభవంగా మాత్రమే మిగిలిపోవడం తథ్యం.
Comments