పాలకొండ రోడ్డులో మోనోకార్పస్ చెట్లు తొలగింపు
‘సత్యం’ కథనాలపై దిగొచ్చిన యంత్రాంగం
కృతజ్ఞతలు చెబుతున్న పాలకొండ రోడ్డు వ్యాపారులు

వ్యాపారమంటే జీటీ రోడ్డు మాత్రమేనని, పాలకొండ రోడ్డులో ఎటువంటి షాపు పెట్టినా కొద్దిరోజులకే మూసేయాల్సిన పరిస్థితి ఉందని తేలిపోయిన రోజుల్లో దెయ్యం పట్టినట్లు డివైడర్ మధ్యనున్న చెట్లు పూర్తిగా ఇక్కడ వ్యాపారాలను దెబ్బతీసిన వైనంపై కొద్ది రోజుల క్రితం ‘సత్యం’ ఓ కథనం ప్రచురించింది. అంతకు ముందే గత ఏడాది ఆగస్టు 3న ‘సిక్కోలుపై విషం కక్కుతున్నాయ్’ పేరిట అసలు ఈ మోనోకార్పస్ మొక్కలు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఎలా ప్రతిబంధకంగా మారిందన్న అంశంపై సైంటిఫిక్ అప్రోచ్‌తో ఆధారాలతో కూడిన కథనాన్ని ‘సత్యం’ ప్రచురించింది. సరిగ్గా అక్కడికి రెండు రోజుల్లో రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి జిల్లాకు వచ్చిన తర్వాత అధికారులతో సమీక్షించిన కింజరాపు అచ్చెన్నాయుడు నగరంలో మోనోకార్పస్ చెట్లు ఎక్కడున్నా తొలగించాలని ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత ఆ స్థానంలో పర్యావరణ హితమైన కొత్త మొక్కలు నాటాలని, అందుకు నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఈ చెట్లు తొలగింపునకు నోచుకోలేదు. తాజాగా ఇక్కడ మున్సిపల్ వీధిదీపాల వెలుగును సైతం ఈ మొక్కలు మింగేసి అమావాస్య చీకట్లను వ్యాపారుల జీవితాల్లో నింపుతోందని ‘సత్యం’ ‘దెయ్యం చెట్లు’ పేరిట డిసెంబరు 24న మరో కథనం ప్రచురించింది. దీంతో కమిషనర్ దుర్గాప్రసాద్ ఆగమేఘాల మీద చెట్లు తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటే టెండర్‌ను ఖరారు చేయించారు. ఇప్పుడు ఆ పనులు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్థానిక ఏడురోడ్ల జంక్షన్ నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు ఉన్న ఈ చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. సరిగ్గా సంక్రాంతి వ్యాపారం జీటీ రోడ్డును నింపేసి పాలకొండ రోడ్డు వైపు మళ్లనున్న ఈ వారం రోజుల్లో మోనోకార్పస్ చెట్లు తొలగించడం పట్ల పాలకొండ రోడ్డు వ్యాపారులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ రోడ్డులో ఉన్న మోనోకార్పస్ చెట్లు తొలగించాలని ‘సత్యం’ మొదట్నుంచి స్థానికుల తరఫున పోరాడుతునే ఉంది. ఆలస్యంగానైనా స్పందించినందుకు కార్పొరేషన్ అధికారులు, కలెక్టర్, మంత్రి అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఎందుకంటే ‘సత్యం’ కథనాలు పట్టుకొని తమ కుటుంబాలతో సహా కలెక్టర్‌ను కలిసి వినతినివ్వడానికి పాలకొండ రోడ్డు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మోనోకార్పస్ చెట్లను తొలగించడం పెద్ద ఊరటే.
Comentarios