
మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులందరూ తక్షణమే వెళ్లిపోవాలని దాదాపు ఏడాది క్రితం ఆ ద్వీప దేశం అధ్యక్షుడు హుంకరించారు. ఇప్పుడు అదే అధ్యక్షుడు మా దేశంలోని 28 దీవులను ఇచ్చేస్తున్నాం.. తీసు కోండి అంటూ ఉదారంగా వ్యవహరించారు. ఏడాదిలోనే ఇంత మార్పు ఏంటబ్బా? అని ఈ కథ తెలియని వారు ఆశ్చర్యపోవచ్చు. చైనా కోసం భారత్‌ను కాలదన్నుకున్న ఫలితం మాల్దీవులకు కొద్దిరోజుల్లోనే తెలిసి వచ్చిన ఫలితమే ఈ మార్పు. దీనికంతటికీ కారకుడు ఆ దేశ కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు. వాస్త వానికి మనదేశానికి నైరుతి దిశలో హిందూ మహాసముద్రంలో ఉన్న మాల్దీవులకు సంప్రదాయకంగా శతా బ్దాల క్రితం నుంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఏడాది క్రితం వరకు ఉన్న ప్రభుత్వాలు కూడా భారత్ తో వర్తక, వాణిజ్య, స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాయి. కానీ గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో భారత అనుకూలవాది అయిన అప్పటి అధ్య క్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలి ఓడిపోయి.. చైనా అనుకూలవాది అయిన మొహమ్మద్ మొయిజ్జు అధి కారంలోకి వచ్చారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టడమే ఆలస్యం.. భారత్‌పై యుద్ధం ప్రకటించినంత పనిచేశాడు. మాల్దీవుల్లో తీరరక్షణ కోసం ఆ దేశ అనుమతితోనే భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సైనిక శిబిరాన్ని ఎత్తి వేయాలని, భారత సైనికులందరూ తక్షణమే వెళ్లిపోవాలని మొయిజ్జు ఆదేశించారు. చైనా తమకేదో సాయం చేసేస్తుందన్న భ్రమల్లో ఉండి భారత్‌కు దూరమయ్యారు. శతాబ్దాలుగా కొనసాగతున్న ద్వైపాక్షి సంబంధా లను తెంచుకునేలా వ్యవహరించారు. అదే సమయంలో మొయిజ్జు ప్రభుత్వంలో పలువురు మంత్రులు సైతం దుందుడుకుతనం ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీపైనే విమర్శలకు తెగించారు. ఈ పరిణా మాలు ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసి, ఉద్రిక్తతలు పెంచాయి. తర్వాత మాల్దీవుల ప్రభుత్వం భారత్‌కు క్షమాపణ చెప్పినా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. మాల్దీవుల ఆర్థిక రంగమంతా పర్యాటక ఆదాయంపైనే ఆధారపడి ఉంది. అందులోనూ భారత్ నుంచి వెళ్లే టూరిస్టుల ద్వారానే అత్యధిక ఆదాయం లభిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ లక్షదీవుల పర్యటనకు వెళ్లి అక్కడి సుందర ప్రదేశాలను ప్రస్తావిస్తూ మాల్దీవులకు బదులు భారతీయ పర్యాటకులు లక్షదీవులను సందర్శించాలని సూచించారు. దీన్ని కూడా మాల్దీవుల ప్రభుత్వ నేతలు తక్కువ చేసి మాట్లాడారు. మాల్దీవుల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఉన్న సౌకర్యాలు, స్వచ్ఛత, ఆహ్లాదం లక్షదీవుల్లోగానీ, భారత్‌లోని ఇతర పర్యాటక ప్రాంతాల్లో లభిస్తుందా? అన్న సవాళ్లు చేశారు. దాంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాయ్‌కాట్ మాల్దీవులు అన్న నినాదం భారత్‌లో ట్రెండిరగ్‌లోకి వచ్చింది. పర్యాటకులు, క్రికెట్, సినీ, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీ లందరూ దీన్నే ఫాలో కావడంతో పాటు ప్రచారం చేయడంతో మాల్దీవుల పర్యాటక రద్దీ అంతా లక్షదీవుల వైపు మరలిపోయింది. ఫలితంగా మాల్దీవుల ఆదాయం పడిపోయింది. టూరిజంపై ఆధారపడిన హోటళ్లు, ఇతర రంగాలు కుదేలైపోయాయి. మరోవైపు ఆదుకుంటుందని ఆశలు పెట్టుకున్న చైనా హ్యాండిచ్చింది. అలాగే చైనా నుంచి వచ్చే టూరిస్టుల ద్వారా వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దాంతో మాల్దీవుల ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. కాగా ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఇరుగుపొరుగు దేశాలకు ఇచ్చే ఆర్థిక సాయం కేటగిరీలో మాల్దీవుల వాటాలో భారత సర్కారు భారీగా కోత విధించింది. ఫలితంగా ఆ దేశం పరి స్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా తయారైంది. ఆర్థిక పరిస్థితి గాడిలో పడాలంటే ఇప్పటికిప్పుడు 1.3 బిలియన్ డాలర్లు అవసరం. దానికోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)ను సంప్రదించినా అటు నుంచి సరైన స్పందన రాలేదు. మొయిజ్జు అడ్డగోలు విధానాలతో భారత వ్యతిరేక చర్యలు చేపట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని దేశంలో ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అక్కడి ప్రజలు కూడా తమను ఆదుకోమని భారత్‌ను విజ్ఞప్తి చేయసాగారు. హాసన్ ఖురేషి అనే మాల్దీవుల సీనియర్ సిటిజన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ ‘మా దేశానికి తక్షణం 1.3 బిలియన్ డాలర్లు అవసరం. భారతీ యులందరూ దయచూపి తలా ఒక డాలర్ ఇచ్చి ఆదుకుంటే ఆర్థిక కష్టాల నుంచి బయటపడతాం’ అంటూ తమ దేశ పరిస్థితిని చెప్పకనే చెప్పాడు. ఇక మొయిజ్జూకు కూడా వేరే మార్గాంతరం కనిపించలేదు. అన్యదా శరణం నాస్తి.. అంటూ ఇప్పుడు భారత్ ముందుకు మోకరిల్లక తప్పలేదు. తమ దేశంలో పర్యటించాలని, ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం చేసుకుందాం రండి మహాప్రభో.. అని మొయిజ్జు సర్కారు ఆహ్వానం మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాల్దీవుల్లో అడుగుపెట్టారు. ఆ దేశ అధ్యక్షుడు మొయిజ్జుతో భేటీ అయ్యారు. ఇరుదేశాల సంబంధాల మెరుగుకు భారత్ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే పగడపుదీవుల సమూహమైన మాల్దీవులకు చెందిన 28 చిన్న చిన్న దీవులను భారత్‌కు ఇస్తున్నట్లు మొయిజ్జు ప్రకటించారు. ఈ ఒప్పందంపై సంతకం కూడా చేశారు. ఇకనుంచి ఈ దీవులు భారత నియంత్రణలో ఉంటూ అభివృద్ధి సాధిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగానే భారత సహాయం తో సంయుక్తంగా పూర్తిచేసిన ఆరు ప్రాజెక్టులను జైశంకర్ ప్రారంభించారు. మాల్దీవులతో మళ్లీ దౌత్య, స్నేహ సంబంధాల పునరుద్ధరణ చైనాకు వ్యతిరేకంగా భారత్ సాధించిన పెద్ద విజయంగా చెప్పవచ్చు.
Comentarios