దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..!
- Prasad Satyam
- Oct 21
- 1 min read
ఏటీఎంకు వెళ్లే దారేదీ?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత తన పరిధిలో ఉన్న పశువుల సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తుంది. నగరంలో వర్షం పడినప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ మునిగిపోవడమో, శివారు కాలనీలు ముంపునకు గురవడమో పెద్ద సమస్య కాదు. ఎందుకంటే.. ఇది ఇప్పటికిప్పుడు పరిష్కరించేది కాదు. ఇది పెద్ద బడ్జెట్‌తో ముడిపడి ఉన్న సమస్య. కాలనీ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గాలను సైతం అప్పటి పంచాయతీ సర్పంచ్‌లు కప్పేసి అమ్మేసినప్పుడు అన్నీ మూసుకు కూర్చున్న యంత్రాంగం ఇప్పుడు కాలనీలు మునిగిపోతున్నాయంటూ గగ్గోలుపెడితే, స్వయంగా బడ్జెట్‌తో సమావేశాలు పెట్టి దీనికి ముగింపు పలకాలి. కానీ కార్పొరేషన్ అధికారులు తిరుగుతున్న రోడ్ల మీదే సమయం, సందర్భం లేకుండా పశువులను వదిలేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి హెల్త్ అధికారులది. దీనికి తోడు డస్ట్‌బిన్‌లు నిండిపోయి బయటకు చెత్త పడిపోతుంటే పశువులు ఊరుకుంటాయా? ఇప్పుడు అదే దృశ్యం స్థానిక స్టేట్‌బ్యాంక్ మెయిన్ బ్రాంచి ఏటీఎం సెంటర్ వద్ద ప్రతీరోజు రాత్రి కనిపిస్తుంది. రాత్రి శానిటేషన్‌లో భాగంగా బహుశా ఈ డస్ట్‌బిన్లను క్లియర్ చేస్తారేమో? కానీ అంతవరకు పశువులు డస్ట్‌బిన్‌ను ఉంచడంలేదు. ఖాళీ బిన్‌గా మార్చేస్తున్నాయి. దీంతో ఎత్తిన చెత్త అంతా మళ్లీ రోడ్డు మీదకే వస్తుంది. సాధారణంగా ఎస్పీ కార్యాలయం నుంచి బయల్దేరినప్పుడు బంగ్లాకు వచ్చే తోవలో ఆయన వాహనానికి అడ్డు రాకుండా పోలీసులు లైన్‌లో వాహనాలను ఆపుతుంటారు. కానీ అదే టైమ్‌కు పశువులొస్తే మాత్రం చేతులెత్తేయాల్సిన పరిస్థితి. జిల్లా కేంద్రంలో మంత్రులు, న్యాయమూర్తులు, వీఐపీ ప్రోటోకాల్ ఉన్న అనేకమంది ప్రత్యేక సైరన్‌తో వెళ్తుంటారు. అయితే ఇవి వాహనం నడిపేవారికి మాత్రమే. పశువులకు మాత్రం ఇక్కడ ప్రత్యేక రూల్స్ ఉన్నాయి.










Comments