
బ్రాహ్మణులలో ఒంటరివాడు రంగరాజన్.. రాముడు పేరుతో ఎవరి మీద అయినా దాడి చేయొ చ్చని నిరూపించినవాడు వీరరాఘవరెడ్డి.. రాముడికి ప్రాణప్రతిష్ట చేసిన శూద్రుడు రాజ్యమేలుతున్న దేశంలో ఆలయాల్లో అర్చకత్వంతో పొట్ట పోసుకునే పూజారులకు రక్షణ కరువైందనడానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు ‘రంగరాజన్’ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తెలంగాణ తిరుపతిగా, వీసా దేవుడిగా, రోజూ 40వేల మంది భక్తులు దర్శించుకునే ఒక పెద్ద ఆలయం ప్రధాన అర్చకుడి మీద వీరరాఘవరెడ్డి తన బృందంతో దాడి చేస్తూ, దానిని వీడియో తీస్తూ, బాహ్య ప్రపంచానికి చాటింపు వేయడం చూసి కూడా బ్రాహ్మణ సమాజం, లేదా అర్చక సమాజం మౌనంగా ఉందంటే కారణాలు ఏమై ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. నిజానికి అర్చక వర్గం బ్రాహ్మణ సమాజంలో చాలా చిన్నది. అర్చకత్వంతో పొట్టపోసుకోవడం, గుడిలో వేదమంత్రాలు చదువుకోవడం, ఆధ్యాత్మిక లోకంలో తరించడం వంటి కార్యక్రమాలకు మాత్రమే పరిమితమై మిగిలిన బ్రాహ్మణ సమాజంతో విడగొట్టబడిరది అర్చక వర్గం. అలా బ్రాహ్మణ సమాజంతో అర్చక సమాజం దూరమై పోయింది. లేకుంటే, రంగరాజన్ మీద దాడిని మొత్తంగా బ్రాహ్మణ సమాజం ఎందుకు స్వీకరించదు? దుర్మార్గమైన ఈ దాడిని ఎందుకు ఖండిరచదు? అదే సందర్భంలో ఒక్క ఆర్‌ఎస్‌ఎస్ తప్ప, మిగిలిన హిందూ సంఘాలు ఈ దాడిని ఎందుకు ఖండిరచడం లేదు? అంత బాహాటంగా దాడి చేసి, దానినీ వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం ద్వారా, శూద్ర సమాజంలోని కొన్ని దుందుడుకు శక్తులు, అర్చక సమాజం ఇచ్చిన దానిని, మిలెటెన్సీగా తీసుకుని, తిరిగి వారి మీదే దాడి చేయడంలో ఉద్దేశమేమిటో మనం అర్థం చేసుకోవాలి. ఎవరు వద్దన్నా కాదన్నా, వీర రాఘవరెడ్డి ‘రామరాజ్యం’ కోసం చేసిన భౌతిక దాడి ద్వారా బ్రాహ్మణ సమాజానికి ఒక హెచ్చరిక చేశాడు. హైందవ ఆధ్యాత్మికత పేరుతో మీరు చేసే కాలక్షేప వ్యవహారానికి ఇక కాలం చెల్లిందంటూనే, మిలిటెంట్ రామరాజ్యానికి సపోర్ట్ చేయకపోతే, అర్చకత్వంలో ఉండే బ్రాహ్మణులకు అందరికీ ఇటువంటి గతి తప్పదని వీర రాఘవరెడ్డి ఒక హెచ్చరిక కూడా చేశాడు. ఇదిలా ఉంటే హైందవ మతాన్ని అనుసరించే ‘రెడ్డి జాగృతి’ వంటి సంఘాలు లోలోపల సంతోషపడుతున్నాయి తప్ప ఈ దాడిని ఖండిరచడం లేదు. అర్చక వర్గం కొనసాగిస్తున్న సాఫ్ట్ హిందూత్వని వ్యతిరేకిస్తూ, వీరరాఘవ రెడ్డి వంటివారు రామరాజ్య స్థాపన పేరుతో ‘మిలిటెంట్ హిందుత్వం’ని కొనసాగించాలని వారి మేని ఫెస్టో, రిక్రూట్మెంట్‌ని బట్టి తేటతెల్లమవుతుంది. దళిత గోవిందం వంటి కార్యక్రమాలకు ఇక కాలం చెల్లింది. పల్లెలో మత మార్పిడి చేస్తున్న పాస్టర్లను కొట్టి ఇక లాభం లేదని, ‘రంగరాజన్’ వంటి వారిని కొడితే తప్ప మనకు దారి దొరకదని వీరరాఘవ రెడ్డి లాంటి వాళ్లు నిరూపిస్తున్నారు. హైందవ ఆధ్యాత్మికతతో పొట్ట పోసుకుంటున్నా అర్చక సమాజం మిగిలిన బ్రాహ్మణ సమాజంతో చేతులు కలిపి దుర్మార్గమైన ఈ దాడి మీద ముక్తకంఠంతో నిరసన తెలియజేయాలి. అదే సందర్భంగా రంగరాజన్ చెప్పినట్టు రాజ్యాంగం తప్ప అర్చకవర్గానికైనా మరో రక్షణ లేదని గుర్తించాలి. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ మీద వీర రాఘవరెడ్డి అనే ఒక తనకు తాను రామరాజ్య స్థాపన కోసం ఏర్పాటు చేసుకున్న సైన్యానికి అధ్యక్షుణ్ణి అంటూ ప్రకటించుకున్న అతను తన గ్యాంగ్‌తో వెళ్లి చేసిన దాడిని కొంతమంది స్వయం ప్రకటిత ధర్మ పరిరక్షకులు, మేము ఎప్పుడూ ఎలాంటి ఇజానికి కట్టుబడకుండా విషయాన్ని సబబు కోణంలో మాత్రమే చూస్తామని తమకు తామే చంకలు గుద్దేసుకునే హస్తదృష్టి జట్టు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. జరిగిన దాడి దాడి కచ్చితంగా ఖండనార్హం. ఆ కోణంలో ఎంత మాత్రం శషబిషలు లేవు, ఉండకూడదు కూడా. కానీ ఒక నాలుగు శ్లోకాలు రెండు మూడు త్యాగరాజు స్వామి పంచరత్న కీర్తనల్లోని ఒకటి రెండు చరణాలు కంఠతా పట్టి వాటిని వల్లె వేస్తూ తనేదో మహా పండితుణ్ణి అయిపోయాను అనుకుని ఒక యూట్యూబ్ గొట్టం తీసు కుని రెండు మూడు డజన్ల వీడియోలు జనం మీదకు వదిలేసి కొంతమంది ఆకతాయిల్ని ఏవేవో ఎర చూపి చేరదీసి ఒక టీమును ఏర్పాటు చేసుకుని, వాళ్లని తీసుకుని ఇలా పూజారుల మీదికి, మామూలు జనం మీదకి స్వేచ్ఛగా వెళ్లి దాడులు చేసి వాళ్లని భయభ్రాంతులను చేయగలిగే స్థితికి వచ్చాడు అంటే దానికి నేపథ్యం ఎక్కడ ఉందనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరిగిన దాడి ఒక ప్రధాన గుడి పూజారి మీద కావడం వల్ల వీళ్లకు రాజ్యాంగం, వ్యక్తి స్వేచ్ఛ, మానవ హక్కులు, న్యాయవ్యవస్థ, పోలీసులు వగైరాలందరూ ఒక్కసారిగా గుర్తుకొచ్చేశారు. సమాజంలో ఎంతటి అరాచక పరిస్థితులు ఉంటే ఇలాంటి శక్తులు అంతలా పేట్రేగిపోతాయి అనే కోణం నుంచి ఇప్పటికైనా మతవాదులు చూడాలి.
تعليقات