
ఒకప్పుడు మన పని మనం చేసుకొంటూ, ఇల్లంతా శుభ్రం చేసుకొని అయిన వాళ్ళతో ఒక రోజు కాలక్షేపం కోసం పండగలు వచ్చేవి. నలుగురు కలిసి కాసిన్ని పిండివంటలు వండుకొని తలా కొంచెం తీసుకొని అందరూ వరసలతో పిలుచుకొంటూ ఉత్సాహంగా, కల్మషం లేని బతు కులు బతకటానికి పండగలు వచ్చేవి. అలాగే ఊరిలో అమ్మలక్కలు ఒక చోట చేరటానికి ఊరిలో ఒక గుడి. అంతే, అక్కడ ప్రేమ తప్ప ఉన్మాదం లేదు. ఇప్పుడు సందుకొక గుడి. రోజుకొక పండగ. ఎన్నో భక్తి ఛానళ్ళు. వారి రేటింగ్స్ వ్యాపారం కోసం ప్రతి చిన్న దానిని పెద్దగా చూపిస్తూ పబ్బం గడుపుకొంటుంటే, వంటి చుట్టూ మతాన్ని చుట్టుకొని ఆ బాబా, ఈ బాబా అని పేర్లు పెట్టుకుని నోటికొచ్చింది చెప్తూ ఉంటే, ఇక మరికొంత మంది రాజకీయ నాయకుల అవతారం ఎత్తి ధర్మాలు మాట్లాడుతూ ఓట్ల ఎత్తుగడలు వేస్తుంటే, వారు భక్తితో చేస్తున్న వ్యాపారం చూస్తే ముచ్చటేస్తుంది. ఇక సినిమాలు కూడా మతాన్ని, భక్తిని వాడుకునే సినిమాలే. ఇదిగో అయోధ్య, అదిగో పుష్కరం, ఇదిగో శ్రీరామనవమి, అదిగో వినాయక చవితి...ఇలా సంవత్సరం అంతా హడావుడే...పూజలే. ఇలా చూపిస్తూ, చేపిస్తూ, భయపెడుతూ దేముడి మీద భక్తి...కాదు..కాదు భయం పెంచేశారు! ఇళ్ల మీద, బండ్ల మీద మతాన్ని సూచిస్తూ జెండాలు, మనుషుల మెడల్లో, చేతుల మీద ఎక్కడ చూసినా పూసలు. రకరకాల మాలధారణ పేరుతో రకరకాల రంగుల దుస్తు ల్లో గెడ్డాలు పెంచుకొని తిరిగే మనుషులు. ఒక చోట ఒక అరగంట కూర్చుంటే ఏదో ఒక గుడి, దేముడి ప్రస్తావన లేకుండా ఉండదు. మొత్తంగా ఎటు చూసినా దేముడు, మతం, భక్తి వాసనలతో దేశం గుబాళించేస్తుంది! ఇంట్లో దేముడి ఫోటోకి రోజూ పూజ చేస్తారు. అయినా, నమ్మకం లేదు.. వారానికి మూడు సార్లు చుట్టుపక్కల గుడుల చుట్టూ ప్రదిక్షణలు. ఊహూ...అయినా కోరికలు తీరతాయని, పాపాలు పోతాయని నమ్మకం లేదు. రాష్ట్రంలో పెద్ద గుడులన్నిటికి వెళ్లాలి.. అయినా ఊహూ. ఇక దేశంలో ఎక్కడెక్కడ గుడులు ఉన్నాయో తెలుసుకొని వాటినన్నిటిని దర్శించాలి. ఊహూ.. చాలటం లేదు.. నదుల్లో మునగాలి. హమ్మయ్య, ఇప్పటికైనా పాపాలు పోతాయా, కోరికలు తీరతాయా! సందేహమే. ఏమిటో ఈ కాన్సెప్ట్!! సరే ఇంత మందికి భక్తి పెరిగింది కదా, మరి ప్రజలందరూ సాత్వికులుగా, నిజాయితీపరులుగా మారి సమాజంలో అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారా అంటే అదీ లేదు. సాటి మనిషి మీద చూపించాల్సిన ప్రేమను కూడా దేముడి మీద చూపిస్తూ ప్రతి మనిషిని అనుమానిస్తూ, అవమానిస్తూ, ద్వేషిస్తూ బతికేస్తున్నాడు సగటు భారతీయుడు. ఒక మాటిస్తే నిలబెట్టుకోవాలని గానీ, ఒకరికి రూపాయి బాకీ ఉంటే సమయానికి తీర్చాలని గానీ, అందరితో కలిసి మెలిసి సరదాగా బతకాలని కానీ లేదు. సమాజంలో భక్తి మాత్రమే పెరిగింది.. ఇక అన్నీ ఆ దేముడే చూసుకుంటాడని భరోసా కాబోలు కష్టపడి పని చేయ టం నుంచి కుటుంబ వ్యవస్థలను, స్నేహాన్ని గౌరవించటం అన్నీ తగ్గిపోయాయి. వాతావరణ కాలుష్యాన్ని మించి మనుషుల్లో కాలుష్యం పెరిగిపోయింది. భక్తి పెరిగి ఇప్పుడిప్పుడే ఉన్మాద ఛాయలు అల్లుకొంటున్నాయి. పక్క మతాన్ని ద్వేషిస్తూ మొదలయిన భక్తి ఇప్పుడు తన మతం మీద దాడులకు దారి తీస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం దేశంలో సైన్స్ మ్యూజియంలు పెడదామా, టెలిస్కోపు లు స్కూళ్లకు ఇద్దామా అనిపించేది. ఇప్పుడు చూస్తే సైన్స్ మీద దేముడు స్పష్టంగా ఆధిపత్యం సాధించాడు. విద్య, వైద్యం, చదువులు, సైన్స్ వంటి పదాలు ఎవరైనా మాట్లాడినా పిచ్చోడి లెక్కన చూసే స్థితికి ఆ సమాజం వచ్చేసింది. ఇక ఆ సమాజాన్ని దేముడే కాపాడాలి. దేవుడి కంటే దారు ణంగా బాబాలను పూజిస్తున్నారు. ఆమధ్య ఒకాయన పాదధూళి కోసం ఎగబడి వందలమంది ప్రాణాలు కోల్పోతే.. తాజాగా ఆయన నిరపరాధి అంటూ బయటికొచ్చారు. కండలు చూపిస్తూ సినిమాల్లో డ్యాన్సులు చేసే డేరాబాబా కూడా మనకు దేవుడే. మరీ ముఖ్యంగా ఇటువంటివారంతా మన ప్రభుత్వాలు కొలిచే దేవుళ్లు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి పరికరాలు ఉండొచ్చు. కానీ భక్తి కాలుష్యాన్ని మనమే తగ్గించుకోవాలి.
Comments