ఇకనుంచి అన్ని అనుమతులు మున్సిపాలిటీల్లోనే
భవన నిర్మాణదారులకు, రియల్టర్లకు పెద్ద ఊరట
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మున్సిపాలిటీల పరిధిలో వేస్తున్న లేఅవుట్లకు, నిర్మిస్తున్న భారీ భవంతులకు అనుమతుల కోసం సుడాకు దరఖాస్తు చేసుకోవడం, వారు వంద కొర్రీలు పెట్టిన తర్వాత రిజక్ట్ చేయడం, తీరా అనుమతులు వస్తే నిబంధనల మేరకు కట్టడంలేదని, అసలు సుడా ఎలా అనుమతులిచ్చిందంటూ కార్పొరేషన్‌లో టౌన్‌ప్లానింగ్ అధికారులు రుబాబు చేయడం వంటి చర్యలకు ఇకనుంచి పుల్‌స్టాప్ పడనుంది. కేవలం అమరావతి సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోను, నగర కార్పొరేషన్‌లోను భారీ భవంతుల నిర్మాణానికి, లేఅవుట్ల ఏర్పాటుకు సంబంధిత స్థానిక సంస్థల్లోనే అనుమతులు పొందవచ్చని ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. వాస్తవానికి ఇది పెద్ద ఊరట. ఇంతవరకు వెయ్యి చదరపు మీటర్లు దాటి నిర్మాణాలు చేపట్టాలంటే శ్రీకాకుళం నగరంలో ఆన్‌లైన్ ద్వారా సుడాకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. సుడాలో ఉన్న ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ వంటివారు దాన్ని పరిపరి విధాలు పరిశీలించి కొర్రీలు పెట్టి వెనక్కు పంపేవారు. కారణం.. ఇక్కడ జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్లు పూర్తిగా లేకపోవడమే. అటు డీటీసీపీకి, ఇటు సుడాకు ఒక్కరే అధికారి కావడంతో అనుమతులు రావడం కష్టంగా మారేది. ఇక ఆమదాలవలస, పాలకొండ, రాజాం, పలాస, ఇచ్ఛాపురం లాంటి మున్సిపాలిటీల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉండేది. ఇక్కడ 300 చదరపు మీటర్లు దాటి నిర్మాణాలు చేపడితే సుడాకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేసేశారు. ఎటువంటి బహుళ అంతస్తుకైనా అన్నిరకాల అనుమతులు ఇచ్చే అవకాశం స్థానిక మున్సిపాలిటీలకు ఇస్తూ మంత్రి నారాయణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించింది. ఇంతవరకు అనుమతులు ఇచ్చేది అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. నిర్మాణాలను పరిశీలించేది మున్సిపాలిటీలు కావడంతో భవన నిర్మాణదారులకు రెండుచోట్లా మేనేజ్ చేయలేక తల ప్రాణం తోకకు వచ్చేది. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో మాదిరిగానే టౌన్‌ప్లానింగ్ విభాగంలో కూడా అసిస్టెంట్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ అధికారి, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్లు ఉంటారు. వీరంతా నిత్యం నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ఇప్పుడు అనుమతులు ఇచ్చేది కూడా వీరే కాబట్టి ఏమేరకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో తెలుసుకునే వీలుంటుంది. గతంలో మున్సిపల్ అనుమతులకు మించి ఒక అంతస్తును ఎక్కువగా నిర్మించాలంటే టీడీఆర్‌లు కొనుగోలు చేసి, దానికి సుడా అనుమతులు తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు టీడీఆర్‌లకు కూడా సుడా వద్దకు వెళ్లక్కర్లేదు. ఇక లేఅవుట్ల విషయానికి వస్తే పంచాయతీ అనుమతులు ఇచ్చినవాటిని సుడా గుర్తించకపోవడం, సుడా గుర్తించాలంటే వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చలేకపోవడం వల్ల అనధికార లేఅవుట్లు అధికంగా వెలుస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మున్సిపాలిటీల పరిధిలో లేఅవుట్లు వేసే నాధుడే ఈమధ్య కాలంలో కనపడకుండాపోయాడు. సుడా అనుమతులు పొందాలంటే అందుకు పెద్ద మొత్తంలో భూమిని వదులుకోవడం, రోడ్లు నిర్మించాలి. శ్రీకాకుళంలో ఉన్న భూమి ధరలకు అంత మొత్తంలో స్థలాన్ని వదిలేసి, ఆ భారాన్ని వినియోగదారుల మీద వేయడంతో గత కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ పడుకుంది. మరోవైపు గ్రామాలకు తరలిపోయింది. అయితే ఇప్పుడు ఈ గ్రామాల మీదే సుడాకు అధికారం ఉంది. జిల్లాలో 30 మండలాలు సుడా పరిధిలో ఉన్నాయి. మున్సిపాలిటీలన్నీ సుడా నుంచి టౌన్‌ప్లానింగ్ చేతిలోకి వచ్చినట్లయింది. ఇకనుంచి మున్సిపాలిటీల పరిధిలో ఎటువంటి భారీ నిర్మాణం చేపట్టాలన్నా స్థానికంగా అనుమతులు తీసుకుంటే సరిపోతుంది. మరికొద్ది రోజుల్లో లేఅవుట్లలో నిబంధనలకు సంబంధించి కూడా కొత్త జీవోను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఇంటర్నల్ రోడ్లు 40 అడుగులు ఉండాలన్న నిబంధన సడలించి, మెయిన్ రోడ్డు 40 అడుగులు ఉంచి, ఇన్నర్ రోడ్లు 10 అడుగులు తగ్గినా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఈమేరకు గెజిట్‌ను విడుదల చేసింది. త్వరలోనే ఇది జీవోగా రానుందని భోగట్టా.
వ్యయప్రయాసలు తగ్గుతాయి

వీఎంఆర్‌డీఏలో ఒకేచోట అనుమతులు ఇచ్చే పరిస్థితి ఎప్పట్నుంచో ఉంది. ఇక్కడే ఉడా ఉన్నా కార్పొరేషన్ పరిధిలో బహుళ అంతస్తులు, లేఅవుట్ అనుమతులకు వీఎంఆర్‌డీఏకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది అమలులోకి వచ్చిన దగ్గర్నుంచి విశాఖలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందింది. ఇప్పుడు అమరావతి మినహా రాష్ట్రమంతా ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల వ్యయప్రయాసలు తగ్గుతాయి.
- కొన్న వెంకటేశ్వరరావు, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్
Comments