శాకాహారం కానిదల్లా అపవిత్రమే అనడం ఎలా సబబు
ఓ లడ్డూ అభిమాని మనోభీష్టం!

తిరుపతి లడ్డూ వివాదం విడ్డూరమైన మలుపులు తీసుకుంటోంది. హిందూ మతం, దాని సనాతన ధర్మం మొత్తం తిరుపతి లడ్డూ నాణ్యత మీదనే ఆధారపడినట్లు ఆ లడ్డూకు హైప్ ఇస్తున్నారు. రెండొందలేళ్ల నుంచి ఏదో రూపంలో ప్రసాదం వుండేది. 1940లలోనే ప్రసాదం లడ్డూ రూపం తీసుకుంది. అంతకుముందు హిందూ మతం, సనాతనత్వం లేవా? భక్తులకే కాక దైవచింతనకి ఆమడ దూరంలో ఉండే నాబోటి వాళ్లకు కూడా తిరుపతి లడ్డూ అంటే ఇష్టం. మా ఆఫీసులో తిరుపతి, షిర్దీ, శబరిమలై వెళ్లొచ్చిన ప్రతివారూ ఆయా ప్రసాదాల్ని పంచుతుంటారు.
పంచదార నోట్లో వేసుకున్నట్లుగా అనిపించే షిర్దీ ప్రసాదం, ఏదో లేహ్యంలా అంటుకునే శబరిమల ప్రసాదం నాకు రుచించేవి కాదు కనుక తీసుకునేవాడిని కాదు. తిరుపతి లడ్డూ పొహళింపు అంటే ఇష్టం కనుక తీసుకునేవాడిని. తిరుపతి లడ్డూలో నాణ్యత తగ్గిన మాట వాస్తవం. అయితే ఈ నాణ్యత పడిపోవడం హఠాత్తుగా ఐదేళ్ల క్రితమే మొదలవలేదు. ఎన్నో ఏళ్ల నుంచి నోట్లో వేసుకున్న ప్రతిసారి నాణ్యతలో లోటు అనిపించేది. లడ్డూ నాణ్యతే కాదు, కాలక్రమంలో సైజు కూడా దారుణంగా పడిపోయింది.
నా చిన్నప్పటి జ్ఞాపకంతో పోలిస్తే ప్రస్తుతం అది చిక్కి శల్యమైపోయింది. అయినా లడ్డూపై వివాదం ఎప్పుడూ చెలరేగలేదు. ఇప్పుడే ఎందుకు ఇంత రభస జరుగుతుందనేది ఆసక్తికరం. సాక్షాత్తు ముఖ్యమంత్రే గత ప్రభుత్వ కాలంలో తిరుపతి లడ్డుకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిపి అపవిత్రం చేశారనగానే భక్తులు ఉలిక్కిపడ్డారు. ఆయన వ్యాఖ్య రెండు నెలల క్రితం గుజరాత్‌లోని ఒక లాబ్ రిపోర్ట్ ఆధారంగా చేసిందని తర్వాత తెలిసింది. రెండు నెలల క్రితం రిపోర్టు గురించి అప్పుడే ఎందుకు చెప్పలేదు? సీఎం నోటి వెంట ఆ వేంకటేశ్వరుడే లడ్డూకి వాడే నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందని పలికించడానికి రెండు నెలల సమయం ఎందుకు పట్టింది? ఈ ప్రశ్నకి సమాధానం లేదు. మూడు నెలలైనా ఎన్నికల హామీలను కనీసం 25 శాతం కూడా అమలు చేయలేని ప్రభుత్వ వైఫల్యాల మీద జనం అసంతృప్తిని డైవర్ట్ చేయడానికే అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూకి గ్లోబల్ పేటెంట్ వుంది. అందులో వాడే నెయ్యి, శనగపిండి వంటి పదార్ధాలు, జీడిపప్పు, కర్పూరం, యాలకులు వంటి దినుసులు ఏ నిష్పత్తిలో, ఎంత పరిమాణంలో వాడాలో అంతా అధికారికంగా రికార్డెడ్‌గా వుంటుంది. కానీ పేటెంట్ ఒక్కటే రుచికి, నాణ్యతకి పూచీ పడదు. అంతకుమునుపు కేజి నెయ్యి ఆరు వందల రూపాయిలకు పైచిలుకు వుంటే, ఒక్కసారిగా రూ.320కి అదే కేజి నెయ్యి వస్తే అది నాణ్యతని ఎలా కలిగి వుంటుందనేది వాలిడ్ ప్రశ్నే కావచ్చు. కానీ అసలు ‘పోటు’ (లడ్డు తయారీ వంటగది)లో పదార్ధాల, దినుసుల వినియోగానికి ముందు వాటి నాణ్యతని పరీక్షించే ప్రక్రియ 2019 ముందు కూడా లేదని గమనించరు. తయారీకి ముందు తిరుమలకి సొంతంగా వున్న లాబ్‌లో పరీక్షిస్తారని జగన్ గారేదో అంటున్నారు కానీ తిరుమలలో ఆహార పదార్ధాల ముడిసరుకుల నాణ్యతని పరీక్షించే సదుపాయమే లేదట. మరి దీనికి 2019కి ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి బాధ్యత కూడా లేదా? ప్రామాణిక పద్ధతికి విరుద్ధంగా లడ్డూ తయారీ జరిగితే అందుకు బాధ్యులైన వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి. కానీ మొత్తం ఎపిసోడ్‌కి పాలకులే మతం రంగు పులమటం సమాజానికి మంచిది కాదు. ఈ వివాదం చాలా దూరం పోతోంది. వర్తమాన ఆధునిక సమాజానికి హైందవ సనాతనత్వం ఎంతవరకు అన్వయించొచ్చనే ఆలోచన లేకుండా అసలు సనాతనత్వం అనే పదం వినగానే వళ్లు పులకరించిపోయి, ఎవరికి వారే సనాతన ధర్మ పరిరక్షకులమైపోయినట్లు మాట్లాడుతున్నారు. దేశం పట్ల ప్రేమ, బాధ్యత కాకుండా దేశభక్తి అనే ఖర్చు లేని, రిస్కు లేని ఆదర్శం సరసన ఇప్పుడు ‘సనాతనత్వం’ చేరింది.
లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ అంతటి ఆయనకే గుండే దడదడలాడిరదట. ఇంక సామాన్య జనం పరిస్థితి ఏమిటి? ప్రసాదం తయారీలో జంతుకొవ్వు కలవటం ప్రామాణిక పద్ధతి కాదంటే ఒప్పుకోవచ్చు. అందుకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి. కానీ అది అపవిత్రం ఎలా అవుతుంది? దేశంలో నూటికి ఎనభై శాతం పైగా నేరుగా మాంసాహారులే అయిన నేపధ్యంలో శాకాహారం కానిదల్లా అపవిత్రమే అనడం ఎలా సబబు? శాఖాహార ఆధిపత్య ధోరణి ఏ సంస్కృతికి ప్రతిబింబం? (మళ్లీ నేరుగా చెబితే నువ్వు ఫలాన కులానికి వ్యతిరేకం అంటూ అసలు చర్చని పక్కదారి పట్టిస్తారు. అదో అనవసర గోల) చిత్రమేమిటంటే మొత్తం ఎపిసోడ్లో ‘అపవిత్రం’ అనే పదాన్ని విపరీతంగా వాడుతున్న శాకాహారేతర సనాతనవాదులు ఇకముందు మాంసాహారం మానేస్తారా సనాతన ధర్మ పరిరక్షణ కోసం? జంతుకొవ్వు కలిస్తేనే అపవిత్రం అయిపోతే ఇంక నేరుగా మాంసాహారం తినడం ఇంకెంత మహాపాపమవ్వాలి? ఎంత వైరుధ్యపూరిత ఉద్రేకాలు? వట్టి రాజకీయం కాకపోతే! తిరుపతి వేంకటేశ్వరుడితో పెట్టుకుంటే పైకే వెళ్లిపోతారట. రాజశేఖరరెడ్డి కూడా అలానే పోయారట.
ఏమిటీ మూఢనమ్మకాలు అసలు? ఎంత వెనకబాటుతనం! చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకి కరువుకాటకాలే గతి అని ప్రచారం చేసిన అప్పటి వైఎస్సార్ కాలం నాటి కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత వైకాపా చేస్తున్న తప్పుడు, అశాస్త్రీయ ప్రచారాలకి ఈ శాపనార్ధాలు ఏ విధంగా విరుద్ధంగా వున్నాయి? మెట్ల మార్గంలో తిరుమల వెళుతున్న పసిపాప ఏ అపచారం, ఏ అపవిత్ర కార్యం చేసిందని చిరుతపులి దాడి చేసి చంపేసింది? ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగాయి తిరుమలలో? అందులో ఎందరు దుర్మరణాల పాలయ్యారు? శాస్త్రీయ దృష్టికోణం లేకపోవడమే ఆధ్యాత్మికత, సనాతనత్వమూనా? పైన కొండమీద ఎస్విబిసి చైర్మన్‌గా పదవి వెలగబెడుతూ చెత్త పని చేస్తూ అడ్డంగా దొరికేసిన నటుడిని ‘కూటమి’లోని ఓ పార్టీ ఎందుకు ఆదరించింది? ఈ వివాదంతో మనస్తాపం చెందిన పవన్ అదేదో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారట. నాకైతే ఇది మరీ విడ్డూరంగా అనిపించింది. అసలు ఆయనకి ప్రాయశ్చిత్త దీక్ష అంటే తెలుసా? గుజరాత్ మారణహోమం అనంతరం ఓ పన్నెండేళ్లకి మోడీ ఇలాంటి దీక్షే చేశారు. అది ఆయన చేశారంటే ఓ అర్ధముంది. జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడలో డాక్టర్లని బూతులు తిట్టి ఒక డాక్టర్ మీద చేయి చేసుకొని అపరాధ భావనతో కుమిలిపోయో లేదా రగిలిపోయో పవన్‌ని అనుకరిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాడట. ఈయన చేస్తాడంటే కూడా అర్ధం వుందనుకోవచ్చు. ఇప్పుడు పవన్ ఎందుకు ఇంతగా డ్రమటైజ్ చేస్తున్నారు దీక్ష చేసేంతగా? మొత్తం వ్యవహారంలో అసలు ఆయన పాత్ర ఏమున్నదసలు? ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానంలో వున్న ఆయన తన పరపతిని చట్టపరమైన తగు చర్యలు తీసుకోడానికి, భక్తులలో భరోసాని, నమ్మకాన్ని కలిగించే విధంగా పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తే బాగుంటుంది మతపరమైన రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రాయశ్చిత్త షోలు మానేసి. ఇది ఫెయిర్ పాలిటిక్స్ కాదండీ పవన్ గారూ! అసలు ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే కోట్ల రూపాయిల్లో భారీ ఎత్తున చేస్తున్న నెయ్యి కొనుగోలు ఏపీకే ఎందుకు పరిమితం చేయకూడదు? స్థానిక పాడి పరిశ్రమని ప్రోత్సహించినట్లవుతుంది కదా! అమూల్ వాడిని లోపలికి రానీకుండా కర్నాటక బోర్డర్ దగ్గరే ఆపేశారు అక్కడి పాడి రైతులు. ఎందుకంటే అమూల్ వస్తే అక్కడి నందిని డెయిరీ దెబ్బ తింటుంది కాబట్టి. ఏఆర్ డెయిరీ కాంట్రాక్ట్ రద్దు చేసి ఇప్పుడు ఏ టెండరింగ్ లేకుండానే నందినికి కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్దలు ఏపీ రాష్ట్ర రైతులకి ప్రయోజనం ఎందుకు కలిగించరు? పవన్ గారూ, స్థానిక రైతులకి ఆ ప్రయోజనం కలిగించి తిరుగులేని ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఇంక వేరే దీక్షలు అనవసరం మీకు! తిరుపతి లడ్డు సైజు, నాణ్యత పెరగాలని ఆ లడ్డు అభిమానిగా నేనూ కోరుకుంటున్నా!
- అరణ్యకృష్ణ
Comments