top of page

దేశం ఎటుపోతోంది? ఏమైపోతోంది?

Writer: DV RAMANADV RAMANA

సామాజిక జీవనంలో మతవిద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ‘ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌’ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. 198 దేశాల్లో ‘సామాజిక వర్గాల మధ్య శత్రుత్వ భావన (ఎస్‌హెచ్‌ఐ)’ అన్న అంశంపై అధ్యయనం చేసిన ప్యూ సంస్థ తాజా ఇండెక్స్‌ ప్రకారం భారత్‌ 9.3 పాయింట్లతో తొలి స్థానంలో ఉండటం అత్యంత విషాదం. ఇలాంటి పరిస్థితుల్లో ‘సామాజిక సహకారానికి, భిన్న వర్గాల మధ్య సామరస్యానికి చిచ్చు పెట్టే క్లిష్ట ప్రసంగాలు సమర్ధనీయం కాదు. ఎక్కడికక్కడ కుల, మత, ప్రాంతీయ విభేదాలు రాజేస్తూ ఓట్ల చలి మంటలు కాచుకునే విద్వేష ప్రసంగీకుల్ని అణచివేయని పక్షంలో రాజ్యాంగ విలువలు చచ్చుబడిపోతాయి’ అని సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆందోళనను మరోసారి గుర్తుచేసుకోవాలి. మనుషుల్ని కులం పేరిట, మతం పేరిట, ఆహారం పేరిట ఇంకా సవాలక్ష మౌఢ్యాలతో హింసిస్తూ దేశభక్తుల ముసుగులో తిరగడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అసలైన దేశభక్తి మనుషులను ప్రేమించడంలో ఉందని వందేళ్ల కిందటే మహాకవి గురజాడ చెప్పిన మాటలు ఇంకా మతోన్మాదుల బుర్రకెక్కలేదు. అందుకే ఈ మహా వాక్యానికి ఇంకా ప్రాసంగిత ఉంది. మనుషుల్ని ప్రేమించడం, మానవ శ్రమతో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడం, స్వయం సమృద్ధిని సాధించడం, కులమత మౌఢ్యాల నుంచి విముక్తమై ‘అన్నదమ్ముల వలెను జాతులు/ మతములన్నీ మెలగవలెనోయి/మతం వెరైతేను యేమోయి/ మనసులోకటై మనుషులుంటే’ అని కాంక్షించిన గురజాడ దృష్టిలో దేశభక్తి అంటే ఇది. కానీ, దేశంలో అలాంటి పరిస్థితులే కరువయ్యాయని తాజా నివేదిక స్పష్టం చేస్తుంది. మొన్నటికి మొన్న సాక్షాత్తు పార్లమెంటులోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యాంగ నిర్మాత మీదే అక్కసు వెళ్లగక్కారు. దేశంలోని ముస్లింలు, ఇతర మైనారిటీలకు వ్యతిరేకంగా స్వయంగా మోడీనే విద్వేష ప్రసంగాలు చేసిన సందర్భాలు కోకొల్లలు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్నట్టు ప్రభుత్వ అధినేతలే విద్వేష పూర్వక ప్రసంగాలు చేస్తుంటే వారి పరివారం కట్టడి చేయడం సాధ్యమేనా? తినే తిండి మీద ఆంక్షలు, కట్టుకునే బట్టమీద ఆంక్షలు, భావ ప్రకటనపైనా ఆంక్షలు, పుట్టిన నేలపై స్వేచ్ఛగా జీవించాలన్నా ఆంక్షలు. చివరకు బతుకుతెరువు కోసం చేసే పని మీద కూడా ఆంక్షలే! అసలు దేశం ఎటుపోతోంది? ఏమైపోతున్నది? సగటు భారతీయుని ఆవేదన ఇది. ఓవైపు ఆధునిక ప్రపంచం అంతరిక్షంలో కూడా పరిశోధనలు చేసే స్థాయికి దూసుకుపోతుంటే, దేశాన్ని మరోవైపు మతవిద్వేషాలు, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలమయం చేస్తున్న తీరును ఏమనాలి? పాలకులు దేశానికి ఏం చెబు తున్నట్టు? ఏం సూచిస్తున్నట్టు? ఈ దేశం ‘మీది కాదు మాది’ అంటే భిన్నత్వంలో ఏకత్వంలా కలిసుండే ప్రజలు ఎక్కడివెళ్లాలి? ఇది విచ్ఛిన్న విధానం. ఇదే వ్యవస్థ ఇప్పడు దేశంలో అమలవడం చూస్తుంటే ఆందోళనగా ఉన్నది. మరోవైపు.. చరిత్ర పుటలను మతం రంగు పులిమిన కళ్లద్దాలతో చూసేవాళ్లు.. ఉత్తుత్త పుకార్లను చరిత్రగా నమ్మేవాళ్లు.. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. బడిలో ‘భారతదేశం నా మాతృభూమి/ భారతీయులందరూ నా సహోదరులు’ ప్రతిజ్ఞ చేశాం. ఇప్పుడా ప్రతిజ్ఞకు తిలోదకాలిచ్చి ఒకరినొకరు చంపుకునే దుస్థితికి దిగజారిపోయాం. మణిపూర్‌లో ఏడాదిన్నరగా జరుగుతుందదే. విద్వేష భావజాలం వెళ్లగక్కి సౌభ్రాతృత్వాన్ని చావుదెబ్బ తీసేవాళ్లపై ప్రభుత్వాలు చర్యలకు పూనుకొని ఉంటే నేడు ఇలా అగ్నిగుండంలా మారుతుందా? ఒకరికొకరై అందరొక్కటై కుల మత ప్రాంతీయ భాషా భేదాలకు అతీతంగా ఒకే జాతిగా భారతీయులు ప్రగతి పథాన పురోగమించాలని అలనాటి రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. జరుగుతున్నదేమిటి? ఉమ్మడి భావన బీటలు వారుతోంది. సంకుచిత భావజాల ప్రచారం విభేదాలకు, సామాజిక అశాంతికి, చీలికలకు పాలుపోస్తోంది. జన సమూహాల నడుమ కత్తులు దూసుకునే శత్రుత్వాలకు, నెత్తుటేళ్లు పారించే వైషమ్యాలకు అంటుకడుతోంది. ఈ దుష్ప్రచారాన్ని క్షణాల వ్యవధిలో అసంఖ్యాకులకు చేరవేయడంలో వాట్సాప్‌ మాధ్యమాల యూనివర్సిటీ విద్యార్థులు తలమునకలై ఉన్నారు. అశ్లీల, అసభ్య సమాచార వాహికలుగా భ్రష్టుపట్టి పరువు మోస్తున్న సామాజిక మాధ్యమాలు విద్వేష వ్యాఖ్య ల పంపిణీ ఏజెన్సీలుగా దిగజారి కలుషిత సాగరాల్ని తలపిస్తున్నాయి. తద్వారా వాటిల్లే విపరీత నష్టాల తీవ్రతను ముందుగానే ఊహించి కావచ్చు. అసహనం, భావజాలపరమైన ఆధిపత్యం, దురభిప్రాయాల కుదుళ్ల నుంచి పుట్టుకొచ్చే విద్వేష నేరాలను ఏమాత్రం సహించరాదు. విభజించు, పాలించు నినాదంతో మత, విద్వేష పాలన సాగిస్తున్న కేంద్రం విధానాల్ని ఎదుర్కోవడం ప్రస్తుతం దేశ లక్ష్యం. లౌకిక ప్రజా స్వామ్యం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతునివ్వడం, వారిబాటలో అడుగులేయడం ప్రజల కర్తవ్యం. చీకట్లోకి నెడుతున్న భారతావనికి వెలుగులు చూపడం అందరి బాధ్యత.

 
 
 

תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page