దేశం, జెండా లేకపోయినా..ఒలింపిక్స్‌లో శరణార్థులు!
- DV RAMANA
- Jul 19, 2024
- 3 min read
`ప్రపంచ క్రీడాసంబరాల్లో ప్రత్యేక ఘట్టం
`ఇతర దేశాలకు వలసవెళ్లిన వారికో అవకాశం
`వరుసగా మూడోసారి పాల్గొంటున్న రెఫ్యూజీ గ్రూప్
`క్రీడావేదిక నుంచి తమ బాధలు, వాదనలు వినిపించడమే లక్ష్యం
`రష్యా, బైలారస్‌లను నిషేధించినా అక్కడి అథ్లెట్లకు వ్యక్తిగత హోదా

సాధారణంగా క్రీడాపోటీల్లో స్కూళ్లు, కాలేజీలు, క్రీడాసంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాటికి సంబంధించిన బ్యానర్ల కిందే క్రీడాకారుల బృందాల్లో పాల్గొంటుంటాయి. అదే క్రమంలో జాతీయస్థాయి పోటీల్లో అయితే రాష్ట్రాల తరఫున, అంతర్జాతీయ పోటీలైతే సొంత దేశాల జెండాలతో క్రీడాబృందాలు పాల్గొనడం రివాజు. కానీ వారికి సొంత దేశమంటూ ఏదీ లేదు. సొంత జెండా లేదు. తమ క్రీడా కౌశలం ప్రదర్శిస్తుంటే వెన్నంటి ఉండి ప్రోత్సహించే అభిమానులూ లేరు. పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించే దిక్కూలేదు. ఉన్నదంతా క్రీడల మీద అపారమైన ప్రేమ.. తమ క్రీడాసత్తాను చాటాలన్న పట్టుదల.. చాటగలమన్న ఆత్మవిశ్వాసం మాత్రమే. ఇవే వారిని ప్రపంచ క్రీడా వేదిక అయిన ఒలింపిక్స్‌లో అడుగుపెట్టే అవకాశమిచ్చాయి. త్వరలో జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అర్హత కల్పించాయి. అటువంటి రెండు గ్రూపులకు ప్రపంచ దేశాల సరసన నిలబడి అతిపెద్ద క్రీడా సంబరంలో పాల్గొనే మహత్తర అవకాశాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కల్పించింది. వీటిలో ఒకటి శరణార్థుల బృందం కాగా.. మరొకటి ఒలింపిక్స్ నుంచి నిషేధానికి గురైన రష్యా, బైలారస్ దేశాలకు చెందిన క్రీడాకారుల బృందం. అదేంటి దేశాలనే నిషేధించినప్పుడు.. మళ్లీ ఆ దేశాలకు చెందిన క్రీడాకారులను ఎలా అనుమతిస్తారు? అలాగే శరణార్థులంటే ఎవరు? తమదంటూ దేశం లేని ఆ శరణార్థులకు ప్రాతినిధ్యం కల్పించడమేమిటి? అన్న సందేహాలు తలెత్తవచ్చు. వాటికి సమాధానమే ఈ కథనం.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ప్రపంచంలో జరిగే అతిపెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్. నాలుగేళ్లకోసారి రెండు విభాగాలుగా ఈ పోటీలు జరుగుతుంటాయి. ఒకటి సమ్మర్ ఒలింపిక్స్ కాగా.. మరొకటి వింటర్ ఒలింపిక్స్.. వీటితోపాటు వివిధ రకాల శారీరక, మానసిక వైకల్యంతో బాధపడేవారి కోసం ప్రత్యేకంగా పారాలింపిక్స్ కూడా నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం సమ్మర్ ఒలింపిక్స్ హడావుడిలో ప్రపంచ దేశాలన్నీ నిమగ్నమయ్యాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఈ క్రీడా ఉత్సవానికి ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరిగే ఈ పోటీల్లో 184 దేశాల నుంచి పదివేలమందికిపైగా క్రీడాకారులు సుమారు 329 వ్యక్తిగత, గ్రూప్ ఈవెంట్లలో పాల్గొనేందుకు ముమ్మర సాధన చేసి సిద్ధమయ్యారు. పోటీల్లో పాల్గొంటున్న దేశాలన్నీ తమ దేశం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక, శిక్షణ ప్రక్రియలు పూర్తి చేశాయి. పలు దేశాల బృందాలు ఇప్పటికే ప్యారిస్ చేరుకుంటున్నాయి. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పోటీలతోపాటు గ్రూప్ పోటీలకు కూడా ఆయా దేశాల తరఫునే క్రీడాకారులు పాల్గొనాల్సి ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ నిబంధనలను సడలించి ప్రత్యేకంగా ఒక దేశం తరఫున పాల్గొనే అవకాశం లేని గ్రూపులకు ఆ అర్హత కల్పించింది. అలా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన శరణార్థి గ్రూప్ ఈ పోటీల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. 2016లో మొదటిసారి అవకాశం పొందిన ఈ గ్రూప్ వరసుగా మూడోసారి ఈ పోటీల్లో పాల్గొనబోతోంది. అయితే నిషేధిత రష్యా, బైలారస్ గ్రూప్‌కు మాత్రం ఇదే తొలిసారి.
పదికోట్ల శరణార్థులకు ప్రతినిధులు
అసలు శరణార్థులంటే ఎవరు? ప్రపంచంలో నిత్యం ఏవో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, మరెన్నో దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్నింటిలో అరాచక పాలకుల పీడ, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల సొంత దేశాల్లో బతకలేక ప్రపంచంలో ఏటా లక్షలాది మంది ఇతర దేశాలకు వలసపోతుంటారు. వారినే శరణార్థులు లేదా రెఫ్యూజీలు అని వ్యవహరిస్తుంటారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మంది వరకు శరణార్థులు ఉన్నారు. వలస వెళ్లిన దేశాల్లోనూ వీరు గౌరవప్రదమైన జీవనం సాగించే పరిస్థితి లేదు. ఉండటానికి ఇల్లు ఉండదు. చేయడానికి కుదురైన పని దొరకదు. ఆశ్రయం లభించినప్పటికీ.. ఆయా దేశాల్లోని ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. దుర్భర జీవితాలు గడపుతున్న వీరిలోనూ అనేక క్రీడారత్నాలు ఉన్నాయి. జీవించడానికే పోరాటం చేస్తున్న వీరిలో క్రీడలపై మమకారం ఉన్నవారు దాన్నీ విడిచిపెట్టకుండా సొంత సాధనతోనే క్రీడాకారులుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఒలింపిక్స్‌లాంటి క్రీడావేదికలపై తమకు అవకాశం కల్పిస్తే తమ బాధలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు వీలవుతుందని వీరు భావిస్తున్నారు. ఈ వాదన సహేతుకమేనని గుర్తించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) ప్రత్యేకంగా దేశం లేకపోయినా శరణార్థి క్రీడాకారులను ఒలింపిక్స్‌లో భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
2016లో మొదలు
ఒలింపిక్ కమిటీ నిర్ణయంతో 2016లో రియోడీజెనీరోలో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో మొదటిసారి శరణార్థి గ్రూప్ ఎంట్రీ ఇచ్చింది. దక్షిణ సూడాన్, సిరియా, కాంగో, ఇథియోఫియా దేశాలకు చెందిన పదిమంది అథ్లెట్ల బృందం తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంది. అలాగే 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో వీరి సంఖ్య 29 మందికి పెరిగింది. వారిలో 11 దేశాలకు చెందిన శరణార్థులు పాల్గొన్నారు. అలాగే 2022లో చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లోనూ నాలుగు దేశాలకు చెందిన ఆరుగురు శరణార్థుల బృందం పాల్గొంది. ఇప్పటివరకు వీరు ఎటువంటి మెడల్స్ సాధించకపోయినా పలువురు క్రీడాకారులు తమ ప్రతిభతో క్రీడాప్రపంచం దృష్టిని ఆకర్షించడంలో మాత్రం విజయం సాధించారు. ఇక ఇప్పుడు జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్‌లో 12 దేశాలకు చెందిన 37 మంది శరణార్థి ఆటగాళ్ల బృందం పాల్గొనబోతోంది.
రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ పేరు, జెండాతో..
ఐవోసీతోపాటు ఐక్యరాజ్యసమితికి చెందిన హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(యూఎన్‌హెచ్‌సీఆర్), ఒలింపిక్స్ రెఫ్యూజీ ఫౌండేషన్ వంటి సంస్థలు శరణార్థి క్రీడాకారులకు అండగా నిలుస్తున్నాయి. రెఫ్యూజీ అధ్లెట్స్ స్కాలర్‌షిప్ ప్రొగ్రాం ద్వారా శరణార్థుల్లోని ఔత్సాహిక క్రీడాకారులను గుర్తించి ఒలింపిక్స్‌కు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన బృందానికి రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ అనే పేరుతో ఇతర దేశాల బృందాలతో పరేడ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ బృందానికి 2020 ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆఫ్ఘన్ శరణార్థి క్రీడాకారిణి మాసోమా అలీ జెడా చెఫ్ డీ కమిషన్‌గా వ్యవహరిస్తోంది. పోటీల్లో గెలవడం కంటే వారికి ఒలింపిక్స్ లాంటి అత్యున్నత వేదికల్లో పాల్గొనడం గొప్ప విషయం. తమ గళాన్ని వినిపించేందుకు గొప్ప వేదికగా ఒలింపిక్స్‌ను వారు భావిస్తున్నారు. ఇప్పటివరకు తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఆటలో నైపుణ్యం సాధించేందుకు నరకం చూశామని.. వచ్చే తరం కూడా అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాము ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నామని శరణార్థి ఆటగాళ్లు అంటున్నారు.
ఆ దేశాలను నిషేధించినా..
శరణార్థి క్రీడాకారుల మాదిరిగా కాకపోయినా మరో గ్రూప్ ఆటగాళ్లది మరో రకం బాధ. ప్యారిస్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనకుండా రష్యా, బైలారస్ దేశాలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధం విధించింది. ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా అప్రకటిత యుద్ధం సాగిస్తున్నందుకు రష్యాపై, దానికి సహకరిస్తున్నందుకు బైలారస్‌పై ఐవోసీ నిషేధం విధించింది. ఫలితంగా ఆ దేశాల క్రీడాకారులకు ఒలింపిక్స్ పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. అయితే క్రీడాకారుల, క్రీడాభిమానుల విజ్ఞప్తి మేరకు నిషేధాన్ని పాక్షికంగా సడలించి ఆ రెండు దేశాల తరఫున గ్రూప్ ఈవెంట్లలో కాకుండా వ్యక్తిగత క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని ఐవోసీ కల్పించింది. ఆ మేరకు 14 మంది రష్యన్, 11 మంది బైలారస్ క్రీడాకారులకు ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో పలు కఠిన షరతులు విధించింది. క్రీడాకారులు పూర్తిగా వ్యక్తిగత హోదాలోనే పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఏవిధంగానూ సమర్థించకూడదని.. రష్యా, బైలారస్ సైన్యంలోగానీ, ఆ దేశ సెక్యూరిటీ ఏజెన్సీల్లోగానీ పని చేస్తుండకూడదని షరతులు విధించి, అటువంటి వారికే అనుమతినిచ్చింది. అలాగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో దేశాలవారీగా, వాటి జెండాలు పట్టుకుని నిర్వహించే పరేడ్‌లో వీరికి పాల్గొనే అవకాశం లేదు. అలాగే మెడల్స్ ట్యాలీలోనూ వీరు గెలిచినా, వీరి దేశాల పేర్లు ప్రస్తావించరు.
Comments