
ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికానుంచి తరలించబడే భారతీయుల్లో గుజరాతీయులే ఎక్కువన్నది తాజా వార్త. భారతదేశం నుంచి అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టినవారి సంఖ్య 67,391. అందులో గుజరాత్ వాసులు 41,330. గుజరాతీలు ఆఫ్రికా నుంచి అమెరికా వరకూ బతుకు తెరువు కోసం వెళ్లటం కొత్తేమీ కాదు. ఈ కాలంలో రాష్ట్రం కూడా సంపన్న రాష్ట్రమైంది. దేశానికే ఆదర్శ రాష్ట్రంగా ప్రచారమూ జరుగుతోంది. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా గుజరాత్‌లో తలసరి ఆదాయం రూ. 1,81,963. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.99,404తో పోలిస్తే దాదాపు రెట్టింపు. మరి అటు వంటి ఆదర్శరాష్ట్రం, ఆర్థికాభివృద్ధిలో దేశానికే పాఠాలు నేర్పిన రాష్ట్రం నుంచి కూలీలు బతుకుతెరువు కోసం పొట్ట చేతపట్టుకుని దేశాలు, ఖండాలు దాటి ఎందుకు వెళ్తున్నారు? సమాధానం చెప్పటం తేలికే. గుజరాత్‌లో ఎంతమంది కుబేరులున్నారో అంతకన్నా వేల రెట్లు బికారులున్నారు. పని చేయటానికి చేతి నిండా పని కల్పించలేకపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న వేగానికి అను గుణంగా ఉపాధి కల్పన జరగటం లేదు. ఉన్న ఉద్యోగాలైనా కార్మికుల కడుపు నింపేవిగా ఉన్నాయా అంటే అదీ లేదు. ఉత్పత్తికి అవసరమైన శ్రమ రానురాను సంఘటిత రూపం వదిలి అసంఘటిత రూపం తీసుకొంటోంది. అంటే గతంలో పని చేసేవారికి కొన్ని కనీస భద్రతలుండేవి. ఇప్పుడు ఏ భద్రతా లేని వాతావరణంలో కష్టపడాల్సి వస్తోంది. సంఘటిత లేదా వ్యవస్థాగత శ్రమకు మరో రూపం పని చేసే వారికి, పని ఇచ్చేవారికి మధ్య ఉండే కాంట్రాక్టు. ఈ కాంట్రాక్టులు ఏదో ఒక స్థాయిలో రాతపూర్వకంగా ఉంటే అందులో కార్మికులకు ఒకటో రెండో హక్కులు ఉంటాయి. 2022లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కార్మిక సర్వే (గణాంక నిపుణుల భాషలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటారు) గుజరాత్‌లో నోటిమాటే కాంట్రాక్టుగా పని చేసే కార్మికులు 72 శాతంగా ఉన్నారు. వీరికి ఫలానా యజమాని నుంచి ఫలానా జీతభత్యాల ప్రాతిపదికన ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకూ పని ఇస్తున్నా మని రాతపూర్వకంగా ఇవ్వరన్నమాట. ఇటువంటి కార్మికులు కర్ణాటకలో 41 శాతం, తమిళనాడులో 53 శాతం, కేరళలో 57 శాతం, మధ్యప్రదేశ్‌లో 64 శాతం, హర్యానాలో 65 శాతం, మహారాష్ట్రలో 68 శాతం ఉన్నారు. ఎటువంటి కాంట్రాక్టు లేకుండా పని చేయటం అంటే పనికీ గ్యారంటీ ఉండదు. జీతా లకూ గ్యారంటీ ఉండదు. దీన్నే వ్యవస్థాగత శ్రమశక్తిని అసంఘటిత శ్రమశక్తిగా మార్చటం అంటారు. సాధారణ భాషలో చెప్పుకోవాలంటే కార్మికులను, ఉద్యోగులనూ భద్రత కలిగిన ఉద్యోగాల నుంచి తొలగించి భద్రత లేని అడ్డా మీది కూలీలుగా మార్చటం. కాజువల్ కార్మికుల సగటు వేతనం జాతీయ స్థాయిలో రోజుకు రూ.433. కానీ గుజరాత్‌లో మాత్రం కేవలం 375 రూపాయలే. ఇది జాతీయ సగటు దినసరి వేతనం కంటే తక్కువ. సగటు దినసరి వేతనాలు కేరళలో అత్యధికంగా రూ.836 ఉంటే, తమిళ నాడులో రూ.584, హర్యానాలో రూ.486, పంజాబ్‌లో రూ.449, కర్ణాటకలో రూ.447, రాజస్థాన్‌లో రూ.442, ఉత్తరప్రదేశ్‌లో రూ.432, బీహార్‌లో రూ.426గా ఉంది. దేశంలో కాజువల్ వర్కర్‌కు గుజ రాత్ కన్నా తక్కువ దినసరి సగటు వేతనం ఉన్న రాష్ట్రం చత్తీస్‌గడ్ ఒక్కటే. పేదరికం తీవ్రతను అర్థం చేసుకోవడానికి వేతనాలు ఒక్కటే కొలమానం కాదు. గుజరాత్‌లో పట్టణ, గ్రామీణ ప్రజల నెలసరి కుటుంబ ఖర్చులు ఆ రాష్ట్రంలోని పేదరికం తీవ్రతను మరింత కొట్టొచ్చినట్లు చూపిస్తాయి. జాతీయ నమూనా సర్వే సంస్థ 2022-23 సంవత్సరానికి చేసిన అధ్యయనం ప్రకారం గుజరాత్‌లో గ్రామీణ ప్రజలు నెలకు రూ.3,798 కంటే మించి ఖర్చుపెట్టే స్థితిలో లేరు. పట్టణ ప్రాంత ప్రజల నెలసరి ఖర్చు కేవలం రూ.6,621 మాత్రమే. తమిళనాడు గ్రామీణ ప్రాంత ప్రజలు రూ.5,130 నెలసరి ఖర్చుతో జీవి తం వెళ్లదీస్తుంటే పట్టణ ప్రాంత ప్రజల నెలసరి ఖర్చు రూ.7,666. కేరళలో రూ.5,924, రూ.7,707, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రజల నెలసరి ఖర్చు రూ.4,870, పట్టణప్రాంత ప్రజల నెలసరి ఖర్చు రూ.6,872. హర్యానాలో రూ.4,859, రూ.7,911, మహారాష్ట్రలో రూ.4,010, రూ.6,657గా ఉంది. పేదరికాన్ని మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఐక్యరాజ్యసమితి బహుముఖ దారిద్య్ర సూచిని రూపొందించింది. ఈ సూచిక కేవలం ఒక కుటుంబం నెలకు చేసే ఖర్చుతో పాటు కుటుంబంలో విద్య, వైద్యం కోసం పెడుతున్న ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకుంటుంది. వీటన్నిటినీ కలిపి చూస్తే గుజరాత్ ఈ సూచికల్లో అత్యంత దిగువ స్థానాల్లో ఉంది. గుజరాత్, బెంగాల్‌లు దురవస్థ విషయంలో పోటీపడు తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో పేదల పరిస్థితి ఈ రాష్ట్రాల కంటే ఎంతో కొంత మెరుగ్గానే ఉంది. గుజరాత్‌లో ఆహార భద్రత లేని కుటుంబాలు రాష్ట్ర జనాభాలో 38 శాతం ఉన్నాయి. గుజరాత్ కంటె ఎక్కువమంది ఆకలితో ఉన్న రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్‌లు మాత్రమే.
Comments