top of page

దేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డులు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 13
  • 2 min read
  • భారత ప్రభుత్వమే అతిపెద్ద భూస్వామి

  • దాని తర్వాత స్థానాల్లో చర్చి, వక్ప్ సంస్థలు

  • ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యానిదే సింహభాగం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు. ఎక్కువ భూమి ఉన్నవారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరుపొందడం, పిలిపించుకోవడం పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు కూడాహోదాకు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమిందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకు మడుగులొత్తేవారు. దాన్ని అవకాశంగా తీసుకుని ప్రజలు, ప్రాంతాలపై భూస్వాములు పెత్తనం చేయడం, పరిపాలించడం మొదలుపెట్టారు. అయితే తర్వాత కాలంలో జమిందారీ వ్యవస్థ, ల్యాండ్ సీలింగ్ చట్టాలు అమల్లోకి రావడంతో ఆ వ్యవస్థలు పోయాయి. భూములు కూడా చెర వీడి సామాన్యుల చెంతకు చేరాయి. 1950లో తొలి ల్యాండ్ సీలింగ్ చట్టం అమల్లోకి రాగా 1972లో దానికి మళ్లీ పలు సవరణలు చేశారు. ఆ మార్గదర్శకాల ప్రకారం దేûశంలో ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి ఏటా రెండు పంటలు పండే భూమి అయితే 10 నుంచి 18 ఎకరాలు, ఒక పంట పండే భూమి అయితే 27 ఎకరాలు, మెట్టు భూమి అయితే 54 ఎకరాల వరకు ఉండవచ్చు. వ్యవసాయ భూములకు వర్తించే ఈ మార్గదర్శకాల పర్యవేక్షణకు ఏపీ ల్యాండ్ రిఫార్మ్మ్ సీలింగ్ ఆన్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ యాక్ట్`1973ని అమల్లోకి తెచ్చారు. వ్యవసాయ భూములతోపాటు ఇళ్లస్థలాలు వంటివాటి పర్యవేక్షణకు వేరే చట్టాలు ఉన్నాయి. ఈ స్థలాల విషయంలోనూ అనేక పరిమితులు ఉన్నాయి. వీటి ప్రకారం ఇప్పుడు ల్యాండ్ లార్డులు ఎవరూ లేనట్లే. కానీ చిత్రంగా చట్టాలకు అతీతంగా ఇప్పటికీ మన దేశంలో ల్యాండ్ లార్డులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే వారు వ్యక్తులు కారు వ్యవస్థలు. ప్రధానం మూడు వ్యవస్థలు దేశంలోని దాదాపు భూములన్నింటిపై హక్కు, అధికారాలు చెలాయిస్తున్నాయి. మన దేశ విస్తీర్ణం 32,87,590 చదరపు కిలోమీటర్లు. వీటిలో అడవులు, నదులు వంటివి పోగా మిగిలిన భూమిలో సింహభాగం ఈ మూడు వ్యవస్థý చేతుల్లోనే ఉండటం విశేషం. వీటిలో మొదటి భారత ప్రభుత్వం కాగా.. మిగిలిన రెండూ మత సంస్థలే. ఆ సంస్థలు హిందూ మతానికి చెందినవి మాత్రం కావు.

మొదటి స్థానంలో ప్రభుత్వం

గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఎలఐఎస్)లో 2021 జనవరి నాటికి పొందుపర్చిన వివరాల ప్రకారం దేశంలో కేంద్ర ప్రభుత్వమే అతి ఎక్కువ భూములతో మొదటి పెద్ద భూ యజమానిగా ఉంది. దీని ఆధీనంలో సుమారు 15,531 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. ఇది ఖతార్, జమైకా, లెబనాన్ వంటి అనేక దేశాల విస్తీర్ణం కంటే ఎక్కువ. ప్రభుత్వ విభాగాల పరంగా చూస్తే.. రైల్వే శాఖ వద్ద అత్యధికంగా 4902 చ.కి.మీ(490211 హెక్టార్లు). రక్షణ శాఖ వద్ద 2,580 చ.కి.మీ, బొగ్గు శాఖ వద్ద 2,580 చ.కి.మీ, విద్యుత్ శాఖ వద్ద 1,806 చ.కి.మీ, భారీ పరిశ్రమల శాఖ వద్ద 1,209 చ.కి.మీ. భూములు ఉన్నాయి.

రెండో భూస్వామి క్యాథలిక్ చర్చి

కేంద్ర ప్రభుత్వం తర్వాత దేశంలో రెండో పెద్ద భూస్వామి క్యాథలిక్ చర్చి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అంచనాల ప్రకారం ఇది వాస్తవం. ఈ చర్చి దేశవ్యాప్తంగా సుమారు ఏడు కోట్ల హెక్టార్ల (17.29 కోట్ల ఎకరాలు) భూమిని కలిగి ఉంది. దీని విలువ లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ భూముల్లో చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, ఇతర సంస్థలు, క్రిస్టియన్ శ్మశాన వాటికలు ఉన్నాయి. ఈ భూముల్లో అధికశాతం బ్రిటిష్ పాలన కాలంలోనే చర్చికి దఖలు పడ్డాయి. క్రైస్తవ మత ప్రతినిధుల ప్రకారం.. సామాజిక సేవల కోసం నాటి బ్రిటిష్ పాలకులు ఈ భూములను చర్చికి అద్దె లేదా గ్రాంటు ప్రాతిపదికన కేటాయించారు. ఇండియన్ చర్చ్ యాక్ట్`1927 ఈ హోల్డింగ్‌లను మరింత చట్టబద్ధం చేసింది. సీబీసీఐ (కేథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా) కింద 2,457 ఆస్పత్రులు, 240 మెడికల్ కళాశాలలు, 3,765 సెకండరీ పాఠశాలలు, 7,319 ప్రైమరీ పాఠశాలలు ఈ భూముల్లో కొనసాగుతున్నాయి.

వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో

దేశంలో మూడో పెద్ద భూ యజమానిగా వక్ఫ్‌బోర్డు నిలుస్తుంది. 1954 వక్ఫ్ చట్టం ద్వారా ఏర్పడిన జాతీయ వక్ఫ్ బోర్డ్ పరిధిలో రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు పని చేస్తుండగా వాటి ఆధీనంలో మసీదులు, మదర్సాలు, శ్మశానాలు, ఇతర ఇస్లామిక్ ధార్మిక సంస్థల ఆస్తులు ఉన్నాయి. దేశాన్ని గతంలో పాలించిన ముస్లిం రాజులు ఈ భూములను ధారాదత్తం చేశారు. ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా వక్ప్ పరిధిలో 8.7 లక్షలకుపైగా స్థిరాస్తులు ఉన్నాయి. 2025 అంచనా ప్రకారం మొత్తం 39 లక్షల ఎకరాలు ఉన్నాయి.

అయితే ప్రభుత్వ భూముల మాదిరిగా క్యాథలిక్ చర్చి, వక్ఫ్ బోర్డుల పరిధిలో ఉన్న భూములకు సంబంధించి అధికారిక రికార్డులు పెద్దగా అందుబాటులో లేవు. మొత్తానికి దేశంలో అతిపెద్ద భూస్వామి ప్రభుత్వం మాత్రమే కాకుండా శక్తివంతమైన మత సంస్థలు కూడా ల్యాండ్ లార్డులేనని ఈ వివరాలు చెబుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page