top of page

ధర్మహింస తదైవచ..!

Writer: DV RAMANADV RAMANA

‘దశావతారం’ సినిమా చూశారా? చోళరాజు కుళోత్తుంగ చోలన్‌ శైవమతవ్యాప్తి కోసం వైష్ణవ మతస్తుడైన రామానుజ నంబిని హింసించే సన్నివేశం చూసే ఉంటారు. హీరో కమల్‌హాసన్‌కో, దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌కో ఉబుసుపోక పెట్టిన సన్నివేశం కాదది. ఒకానొక సమయంలో నిజంగానే జరిగిన ఉదంతాలవి. ఆ ఒక్కచోటే కాదు, అలా చాలాచోట్ల.. ప్రపంచంలో చాలా మతాలు ఇతర మతాలపై ఆధిపత్యం కోసం యుద్ధాలు చేశాయి. ఒకే మతంలోని రెండు శాఖల మధ్య కూడా ఆ వైరం నడిచింది. ‘శివ’ నామాన్ని పలకడం పాపం అని వైష్ణవులు, ‘వైష్ణవ’ నామం పలకడం దోషం అని శైవులు భావించిన కాలాలున్నాయి. ఏవీ సాక్ష్యాలు? ఎక్కడా అంటే, టైం మిషిన్‌ ఎక్కించి ఆ కాలానికి తీసుకెళ్లలేం కానీ, ‘మేం శివుణ్ని గౌరవిస్తాం కానీ, పూజించం’ అని చినజీయర్‌ స్వామి చెప్పిన మాటలు దీనికి తార్కాణం. మతాలన్నీ శాంతియుతంగా ఉంటాయనుకోవడం మన అమా యకత్వం. హింస కూడా మతంలో ఒక భాగమైపోయింది. (మతంలో హింస ఉంటుందనేది చెప్పేం దుకు మాత్రమే ఈ సినిమా ఉదాహరణ) ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌ పైనా, ఆయన కుమారుడిపైనా దాడి జరిగింది. ఎందుకు? శ్రీరాముడు పుట్టిన ఇక్ష్వాకు వంశస్తుడినని చెప్పుకునే ‘రామరాజ్యం’ ఫౌండేషన్‌కు చెందిన వీరరాఘవరెడ్డి తన 20 మంది అనుచరులతో కలిసి రంగరాజన్‌ ఇంటికి వచ్చాడు. ‘రామరాజ్య స్థాపన’కు ఆర్థికంగా మద్దతు ఇవ్వా లని కోరాడు. వాళ్ల వాలకం నచ్చలేదో, వాళ్ల ప్రతిపాదన నచ్చలేదో కానీ, దానికి రంగరాజన్‌ అంగీక రించలేదు. చెప్పింది వినకపోతే ఈ ప్రపంచంలో చాలా మతావలంబికులు చేసిందే ఆ రామరాజ్యం వాళ్లూ చేశారు. రంగరాజన్‌ను కొట్టారు. తన్నారు. బెదిరించారు. అడ్డొచ్చిన ఆయన కొడుకునూ కొట్టారు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో వాళ్లు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ‘రామరాజ్య స్థాపకులు’ ఇప్పుడు ఊళ్లు పట్టుకుని, తప్పించుకుని తిరుగుతు న్నారు. రామరాజ్యం, పరలోక రాజ్యం, మతరాజ్యం, దైవరాజ్యం.. ఏదైనా ఇంతే! బలవంతంగా, బెదిరించి, భయపెట్టి, ఇబ్బందిపెట్టి, కొట్టి తెచ్చేదే తప్ప అందులో శాంతి అంటూ ఏమీ ఉండదు. ‘మతం’ కేంద్రంగా జరిగే పనిలో మనం మంచి వెతకాల్సిందే.. తప్ప, అందులో ఏ మంచీ ఉండదు. అన్నదానాలు, రక్తదానాలు అంటూ చెప్పుకునే పనులను అనేక స్వచ్ఛంద సంస్థలు మతప్రస్తావన లేకుండానే చేస్తున్నాయి. మతధోరణి ఎప్పటికైనా ఆధిపత్యమే! ఇక్కడా అదే జరిగింది. తాము చెప్పింది వినకపోతే, తమకు అనుకూలంగా ఉండకపోతే హింసించి మరీ దారికి తెచ్చుకోవాలని చూశారు. అలా చేసేదాన్ని ‘మతం’ అనొచ్చు, ‘ఉన్మాదం’ అని కూడా అనొచ్చు. జరిగిన దాడి పట్ల నాకు తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటివి జరగకూడదన్న నిశ్చయం ఉంది. కానీ నాకు ఈ ఘటనను ఖండిర చాలని అనిపించడం లేదు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కానీ విషయం బయటకు రాలేదు. పైగా ‘నాపై 20 మంది దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మిగతా వివరాలు విచారణలో తెలుస్తాయి. ఇంతకు మించి దీనిపై మాట్లాడను’ అని ఆయన అంటున్నారు. ఇవన్నీ చూస్తే, రేపు ‘ఇదంతా ఏమీ జరగలేదు. అంతా మార్ఫింగ్‌ వీడియోలు’ అనే వాదన ఒకటి తెరపైకి రావొచ్చు. లేదా మతాధిపతులంతా కలిసి ఒత్తిడి తెచ్చి మరీ ఆయన చేత అనిపించొచ్చు. లేదా మేమూ మేమూ ఒకటే, మాది ఒకటే మతం, మరి ఈ కేసులెందుకు అనే మతసౌభ్రాతృత్వ ధోరణి ప్రదర్శించవచ్చు. ఇప్పుడు ఈ దాడిని ఖండిరచి, ఆఖర్లో అప్పుడు వెర్రిపుష్పం అవ్వడం ఇష్టం లేదు.. ఆరోపణలు చేయడం లేదు.. జరుగుతున్న విషయాలను విశ్లేషించి చూసుకుం టున్నాను. కానీ.. దాడి జరిగాక పోలీసులే ఎందుకు స్పందించారనేది అర్థం కావడం లేదు. అర్చ కుడికి ఏదైనా జరిగితే దేవుడు స్పందించొద్దా? మన కష్టాలన్నీ భగవంతుడు తీరుస్తాడని చెప్పే అర్చకుడు తన మీద జరిగిన దాడికి మాత్రం పోలీసుల దగ్గరికి వెళ్లడమేంటి? పోలీసులు నిందితుల్ని పట్టుకోవడమేంటి? ఆయన మీద దెబ్బ పడగానే అక్కడ ఆ దైవం ప్రత్యక్షం కావాలిగా? దుష్టుల్ని సంహరించాలిగా? మన అనారోగ్యం పోగొడతామనే పాస్టర్లు, వాళ్లకు జబ్బులొస్తే ఆసుపత్రుల్లో చేరడ మేంటి? దేవుడు మాలాంటి వారికోసం రాడు సరే, ఎల్లప్పుడూ దైవసేవలో ఉండేవారి కోసం కూడా రాడా? ఏంటో మరి? అన్నట్లు, ‘ఇదంతా ఇతర మతాల కుట్ర, వీరరాఘవరెడ్డి అసలు పేరు వేరే, అతను వేరే మతంవాడు, అలా వేషం వేసుకొని వచ్చాడు. వారి వెంట ఉన్నవారంతా ఆ మతాలకు చెందినవారే!’ అని ఇంకా ఎవరూ ప్రచారం మొదలుపెట్టలేదా? పెడతారేమో? లేక ఈ దాడిని సమర్థించే కథలు రాస్తున్నారేమో? చూడాలి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page