ధర్మేంద్రుడి ముందంతా ముళ్లబాటే!
- DV RAMANA

- Jul 23
- 2 min read

దేశమంతా ఇప్పుడు ఒకే అంశం చుట్టూ తిరుగుతున్నది. అదే కాక్రోచ్ జనతా పార్టీ.. ఆ పార్టీ చేపట్టిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్. ఈ డిమాండ్‌తో గత కొన్నిరోజులుగా లడ్డాఖ్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా, ఆయన్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించడం, దానికి నిరసనగా కాక్రోచ్ జనతాపార్టీ ఛలో పార్లమెంటు ఉద్యమానికి పిలుపునివ్వడం, దేశంలోని చాలా ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత పెద్దసంఖ్యలో తరలిరావడం, ఆ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన తోపులాటలు, లాఠీఛార్జీల్లో రెండువైపులా అనేకమంది గాయపడటంతో ఈ వివాదం మరింత బిగుసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాలు కూడా కాక్రోచ్ ఉద్యమంలోకి రంగప్రవేశం చేయడంతో రాజకీయ రంగు కూడా పులుముకుంది. మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీ ఘోర పాపమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించగా, ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే ప్రకటించింది. అయితే ఆందోళన శిబిరం లేదా ఏదైనా తటస్థ వేదికలపై చర్చలు జరపాలని, ప్రభుత్వ వేదికల్లో అయితే తమకు సమ్మతం కాదని కాక్రోచ్ పార్టీ స్పష్టం చేసింది. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేస్తేనే చర్చలు ముందుకెళ్తాయని బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే కుండబద్దలు కొట్టేశారు. ఇంత జరుగుతున్నా మంత్రి రాజీనామా విషయంలో మాత్రం కేంద్రం తన వైఖరిని ఇంతవరకు వెల్లడించలేదు. ఈ డిమాండ్‌పై మౌనం వహిస్తున్నదంటే ఆయన్ను సాగనంపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తూ.. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఆయనన్ను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు ఎందుకు సుముఖత చూపడం లేదన్న చర్చ మొదలైంది. మంచి వ్యూహకర్తగా పేరున్న ధర్మేంద్ర ప్రధాన్ స్వరాష్ట్రం ఒడిశా. బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన తాల్చేరులో జన్మించారు. ఆయనది తొలినుంచి బీజేపీ కుటుంబమే. తండ్రి దేవేంద్ర ప్రదాన్ పార్టీ సీనియర్ నాయకుడిగా వ్యవహరించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. రాజకీయాలను తండ్రి నుంచి వారసత్వంగా అందుకున్నప్పటికీ ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరఎసఎస్ అనుబంధ అఖిలభారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో పని చేసి అక్కడి నుంచి బీజేపీ యువమోర్చాలోకి, తద్వారా బీజేపీలోకి ప్రవేశించి క్రమంగా ఉన్నతస్థాయికి ఎదిగారు. 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన పార్టీ జాతీయ కార్యవర్గంలో అనేక పదవులు నిర్వహించి వ్యూహ నిపుణత, సమర్థతతో తన స్థానాన్ని బలపరచుకుంటూ వచ్చారు. అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరించి విజయానికి బాటలు వేశారు. 2014లో మోదీ నేతృత్వంలో ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వంలో తొలిసారి మంత్రి అయ్యారు. అప్పటినుంచి కేంద్ర కేబినెట్‌లోనూ పార్టీలోనూ కీలకంగా ఉన్న ఆయన 2021లో విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల అనంతరం ఏర్పడిన మోదీ సర్కారులో కూడా అదే పోర్టుఫోలియో నిలబెట్టుకున్నారు. జాతీయ విద్యావిధానం రూపకల్పనతో పాటు విద్యారంగ సంస్కరణల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని నెలల క్రితం జరిగిన నీట్ పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడం, పరీక్ష రద్దు కావడంతో.. ఆ వైఫల్యాలన్నీ సంబంధిత మంత్రిగా ధర్మేంద్ర ప్రదాన్ మెడకు చుట్టుకున్నాయి. ఆయన రాజకీయ జీతంలోనే పెద్ద సవాల్‌గా పరిణమించాయి. నీట్ నిర్వహణలో లోపాలకు, వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం మాత్రం బాధ్యులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నదే తప్ప మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై స్పందించడం లేదు. దీనికి కారణం ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ కీలక వ్యూహకర్తల్లో ఒకరు కావడమే. పార్టీ సంస్థాగత వ్యవహారాలతో పాటు ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో ఆయనకు ఉన్న అపార అవగాహన, వ్యూహనైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకత్వం ఆయన్ను వెనకేసుకు వస్తున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన నాయకుడైనప్పటికీ ఆయన సమర్థతను గుర్తించిన పార్టీ జాతీయస్థాయిలో ఆయన సేవలను ఉపయోగించుకుంటున్నది. మోదీ`షా ద్వయానికి అతి సన్నిహితంగా ఉండే నాయకుల్లో ఆయన ముందువరుసలో ఉంటారు. అందుకే నీట్ వివాదంలో ప్రతిపక్షాల నుంచి, కాక్రోచ్ ఉద్యమరూపంలో, జాతీయస్థాయిలో జరుగుతున్న ఆందోళనల రూపంలో ఎంత ఒత్తిడి పెరుగుతున్నా పార్టీ నాయకత్వం ఆయనకు అండగా నిలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రదాన్ పరిస్థితి ముళ్ల మీద ఉన్నట్లుగా తయారైంది. పార్టీ నాయకత్వం తన పట్ల సడలని నమ్మకంతో అండగా నిలవడంతో మంత్రి పదవిని కాపాడుకోగలిగినప్పటికీ.. ప్రస్తుత సవాళ్లను అధిగమించి ముందుకు సాగడం ఆయనకు కత్తిమీద సాములా మారనుంది. దేశప్రజలకు హామీ ఇచ్చినట్లు నీట్ లీకేజీ దోషులను చట్టప్రకారం శిక్షించాల్సి ఉంది. అదే సమయంలో ఆ పరీక్షల వ్యవస్థను సమÖలంగా సంస్కరించాల్సిన బాధ్యత కూడా ఆయనదే. దాంతోపాటు జాతీయస్థాయిలో జరిగే అన్ని రకాల పరీక్షల వ్యవస్థల్లోనూ భవిష్యత్తులో లీకేజీలకు ఆస్కారం లేకుండా పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ కఠినమైన సవాళ్లుగానే మేథావులు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. కోట్లాది విద్యార్థులు, యువతలో సన్నగిల్లిన నమ్మకాన్ని తిరిగి పొందడం వీటిపైనే ఆధారపడి ఉంటుంది. అలాకాకుండా ఒత్తిడి పెరిగి మంత్రి పదవి కోల్పోతే కొన్నాళ్లపాటు ప్రదాన్‌కు రాజకీయ వనవాసం తప్పదేమో!






Comments