top of page

ధాన్యం కొనడానికి ‘గింజ’కుంటున్నారు

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • 20 మండలాల్లో నిలిచిపోయిన సేకరణ

  • లక్ష్యం పూర్తయిందంటున్న అధికారులు

  • ట్రాక్‌షీట్‌ సాంకేతికత మీద నెపం

  • ప్రతీ గింజా కొంటామన్న మంత్రి

  • దళారులకు తక్కువ ధరకే అమ్మేస్తున్న రైతులు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు పూర్తయినట్టు అధికారులు ప్రకటిస్తే రైతులు మాత్రం మద్దతు ధర దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. లక్ష్యం పూర్తయినట్టు చూపిస్తున్నా రైతుసేవా కేంద్రాల్లో ఆ తర్వాత కొనుగోలు కోసం రైతులు తీసుకువచ్చే ధాన్యానికి ట్రాక్‌షీట్లు జనరేట్‌ కావడం లేదు. దీన్ని ప్రభుత్వం, అధికారులు సాంకేతిక సమస్యగానే చూస్తున్నారు. దీంతో రైతులకు కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు. లక్ష్యం పూర్తికాని మండలాలకు పక్కన ఉన్న మండలాల నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి ట్రాక్‌షీట్లు సర్దుబాటు చేస్తే ఆ మండలంలో కొనుగోలు పూర్తిగా నిలిచిపోతుంది. దీనివల్ల రైతులతో పాటు మిల్లర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈకేవైసీ చేసిన వంద శాతంను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉన్నా కేవలం 70 శాతం ధాన్యం మాత్రమే సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో ఇది సమస్యగా మారి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొనే పరిస్థితి వచ్చింది.

కొనుగోలు నిలిపేశారు

చివరి ధాన్యం గింజ వరకూ కొంటామని ప్రభుత్వం ప్రకటించినా, లక్ష్యం పూర్తయిపోయిందని చెప్పి జిల్లాలో 20 మండలాల్లో కొనుగోలు నిలిపేశారు. ధాన్యం కొనుగోలుకు లక్ష్యమంటూ లేదని, ఎంతైనా కొంటామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఖరీఫ్‌ పంట చేతికి వచ్చే సమయంలో ప్రకటించారు. కానీ సంక్రాంతి నాటికి లక్ష్యమైపోయిందంటూ చేతులేత్తేశారు. లక్ష్యం పూర్తయిందనే పేరుతో జిల్లాలో 20 మండలాల్లో ధాన్యం కొనుగోలు ఆపేయడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికీ కొన్ని మండలాల్లో వరి కుప్పలు పొలాల్లోనే ఉన్నాయి. జిల్లాలో 2024`25 ఖరీఫ్‌ సీజన్లో 8.05 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వీటిలో తిండి గింజలకు 80 వేలు మెట్రిక్‌ టన్నులు మినహాయించగా మార్కెట్‌కు 7.62 లక్షలు మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్లోకి రావచ్చని పౌర సరఫరాల సంస్థ అధికారులు అంచనా వేశారు. వీటిలో 4.90 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కొనుగోలుకు ముందు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో రైతులు పండిరచిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై సమీక్ష తర్వాత లక్ష్యంలో ఏ మార్పు కనిపించలేదు. అధికారులు మొదట ఏది నిర్ణయించారో, ఆ మేరకే ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసి సేకరణ మొదలుపెట్టారు. 30 మండలాల్లో 630 రైతు సేవా కేంద్రాల పరిధిలో ధాన్యం కొనుగోలు చేసి 266 మిల్లులకు సీఎంఆర్‌ విధానంలో సరఫరా చేయాలని జిల్లా పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. జిల్లా లక్ష్యానికి అనుగుణంగా ఆయా మండలాలకు లక్ష్యాలను నిర్దేశించారు. నేటికి 30 మండలాల్లో 4.20 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం సేకరణ పూర్తయిందని కేవలం 70వేల మెట్రిక్‌ ధాన్యం కొనుగోలు చేస్తే లక్ష్యం పూర్తయినట్టేనని అధికారులు ప్రకటించారు. ఇందులో శ్రీకాకుళం, గార, నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పలాస, మెళియాపుట్టి, జి.సిగడాం, సంతబొమ్మాళి, టెక్కలి, బూర్జ, కోటబొమ్మాళి, నందిగాం, ఎల్‌ఎన్‌ పేట, కొత్తూరు, హిరమండలం, సరుబుజ్జిలి, పోలాకి తదితర మండలాల్లో కొనుగోలు నిలిపేశారు. మరో 10 మండలాల్లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు.

ప్రతి ఏటా ఇదే పరిస్థితి

ధాన్యం కొనుగోలు కోసం ఏటా రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఏటా ఇదే సమస్య తలెత్తుతున్నా దాని పరిష్కారంపై ప్రభుత్వమూ దృష్టి సారించడం లేదు. గత సంవత్సరం రైతుల దగ్గర ధాన్యం నిల్వలు ఉంటుండగానే కొనుగోలు ఆపేశారు. మిల్లర్లు అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును కలవడంతో ఆయన పౌర సరఫరాల సంస్థ అధికారులకు ఫోన్‌ చేసి అదనంగా ధాన్యం కొనాలని రికమెండ్‌ చేశారు. మరోవైపు రైతుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రభుత్వం తొలి విడతలో కొంత, ఆ తర్వాత మరికొంత కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయం వెలువడడం లేదు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కొనుగోలు అంశాన్ని రైతు సంఘాల నాయకులు, మిల్లర్లు తీసుకువెళ్లినట్టు తెలిసింది. అయినా ఇప్పటికీ పరిష్కారం దొరకలేదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలులో సాంకేతిక సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే మంత్రి చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం 2024`25 ఖరీఫ్‌కు సాధారణ రకం 100 కేజీలకు రూ.2,300, ఎ`గ్రేడ్‌ రకం రూ.2,320గా ప్రకటించింది. ధాన్యం సేకరణ పూర్తయినట్టు చూపించి కొనుగోలు నిలిపేసిన తర్వాత దళారులు రంగంలోకి దిగి మద్దతు ధరపై రూ.100 నుంచి రూ.200 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

దళారులు తరలించుకుపోతున్నారు

రైతుల నుంచి సేకరించే 80 కేజీల ధాన్యం బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం రూ.1,840 చెల్లించాల్సి ఉంటుంది. అయితే దళారులు మాత్రం సాధారణ రకం, గ్రేడ్‌ రకంతో సంబంధం లేకుండా 80 కేజీల బస్తాను రూ.1650 నుంచి రూ.1740 కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు నిలిపేయడంతో రైతులు మద్దతు ధర కొల్పోయి దళారుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పంట దిగిబడి మేరకు ధాన్యం సేకరణ లక్ష్యం పెంచి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, జి.సిగడాం, గార, పోలాకి తదితర మండలాల్లో ఆలస్యంగా ఉబాలు వేయడం వల్ల డిసెంబరు చివరి వారంలో పంట చేతికొచ్చి పొలాల్లోనే కుప్పలు పెట్టారు. ఆయా మండలాల రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కొంతమంది ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ కొనుగోలు చేసినా ధాన్యాన్ని తమ మండలాలకు సర్దుబాటు చేయొద్దంటూ మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు అధికారులకు చెప్తున్నారు. లక్ష్యం పూర్తయిందనే పేరుతో ఆపేసిన మండలాల్లో రైతుల వద్ద ఎంతమేర ధాన్యం నిల్వలు ఉన్నాయో, ఆ మేరకు కొనుగోలు చేయాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతుంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం వెలువరిస్తుందో అని రైతులు ఎదురు చూస్తున్నారు.


మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
గ్రీవెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం వినతి

జిల్లాలో ధాన్యం కొనుగోలు టార్గెట్‌ పెంచి రైతుల వద్ద ఉన్న మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలమల రమణ, కె.మోహనరావు కోరారు. ఈమేరకు కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో వినతిని అందించారు. జిల్లాలో ఈ ఏడాది ప్రకృతి అనుకూలించి ధాన్యం దిగుబడి పెరిగిందని, దానికి అనుగుణంగా 7 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలనీ అధికారులు అంచనాలు వేసినప్పటికీ ప్రభుత్వం 4.90 లక్షల మెట్రిక్‌ టన్నులకు తగ్గించివేసిందని, ఫలితంగా రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లకు బీజీలు లేవని, టార్గెట్‌ అయిపోయిందని తిప్పిపంపుతున్నారని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ట్రాక్‌సీట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించిన పలాస, మందస తదితర మండలాల్లో దళారీలు తెచ్చిన ధాన్యానికి అర్థరాత్రి ట్రాక్‌సీట్లు ఇస్తున్నారని, దీనిపై పరిశీలించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని కోరారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page