top of page

నకిలీలకు మూలం సదరం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 11, 2024
  • 3 min read
  • వైద్యులకు డబ్బులిస్తే చాలు వైకల్య ధ్రువపత్రం రెడీ

  • దళారుల ద్వారా విచ్చలవిడిగా సాగుతున్న దందా

  • జిల్లాలో పలుచోట్ల వెలుగులోకి వచ్చినా చర్యలు నామమాత్రం

  • రాజకీయ ఒత్తిళ్లతో మేనేజ్‌ చేసేందుకు యత్నాలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం సామాజిక పింఛన్‌ మొత్తాలను భారీగా పెంచింది. దానివల్ల పెరిగిన ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పింఛన్‌ లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షలమంది అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నారని పలువురు మంత్రులే ప్రకటించారు. అటువంటివారిని ఏరివేసే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల ఏడో తేదీ నుంచి గ్రామాల్లో డీఆర్‌డీఏ అధికారులు నిర్వహిస్తున్న ఉపాధి హమీ పథకం సోషల్‌ ఆడిట్‌లో భాగంగా పింఛన్‌ లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించాలని ప్రభుత్వం మౌఖిక అదేశాలు జారీచేసింది. డీఆర్‌డీఏ అధికారులు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారుల వివరాలను ఆరా తీస్తున్నారు. గ్రామాల వారీగా వీరిచ్చిన నివేదకను ఎంపీడీవోలు పరిశీలించి అనర్హుల జాబితాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ చర్యల పట్ల పెన్షన్‌ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నా.. అనర్హులు పెన్షన్లు అందుకుంటున్న విషయం కొత్త కాదు. ముఖ్యంగా వికలాంగ పెన్షన్లు అందుకుంటున్న వారిలో చాలామంది నకిలీ వికలాంగులేనన్నది వాస్తవం. వైకల్యాన్ని ధ్రువీకరించి సర్టిఫికెట్లు జారీ చేసే సదరం కార్యక్రమమే ఈ అవినీతికి కేంద్రంగా మారిందన్న ఆరోపణలు గతం నుంచీ ఉన్నా పెద్దగా చర్యల్లేవు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

డబ్బు ఎర వేస్తే లేని వైకల్యం ఉన్నట్లు చూపించే ప్రభుత్వ వైద్యులు ఉన్నన్నాళ్లూ సకలాంగులు కూడా దివ్యాంగులుగా మారిపోతుంటారు. దాన్ని చూపించి ప్రభుత్వం నుంచి ఆర్థిక, రిజర్వేషన్‌ వంటి అనేక ప్రయోజనాలను అప్పనంగా అనుభవిస్తుంటారు. అదే సమయంలో నిజమైన వికలాంగులు చాలామంది రాజకీయ కారణాలతో ఆ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఈ వారం జెడ్పీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన శ్రీకాకుళం నగరంలోని హయాతీనగరానికి చెందిన ఆర్‌.శ్రీదేవి 2009 నుంచి వికలాంగ పింఛన్‌ అందుకుంటోంది. రూ.200 ఉన్నప్పటి నుంచి రూ.2250కి పెంచే వరకు పింఛన్‌ అందుకున్న ఆమెకు 2022లో నిలిపివేశారు. ఇతరుల సాయం లేకుండా ఒక్క అడుగు కూడా వేయలని వికలాంగురాలైన ఆమె రెండేళ్లగా పింఛన్‌కు నోచుకోవడంలేదు. అధికారులు. రాజకీయ నాయకులు, సచివాలయం చుట్టూ తిరిగినా పంఛన్‌ను పునరుద్ధరించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మరోసారి కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు వెళ్లి పింఛన్‌ పునరుద్ధరించాలని విన్నవించుకుంది. కానీ సలక్షణంగా ఉన్న అనేకమంది ప్రభుత్వ వైద్యులకు రూ.వేలకు వేలు ముట్టజెప్పి సదరం ధ్రువపత్రాలు పొంది పింఛన్‌ వంటి ఆర్ధిక ప్రయోజనాలతో పాటు వికలాంగుల కోటాలో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలు కూడా కొట్టేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి నకిలీ భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆ ఆస్పత్రి నకిలీ సర్టిఫికెట్ల ఫ్యాక్టరీ

ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌లో 11 మంది, జలుమూరు మండలం లింగంనాయుడుపేటలో 21 మంది దళారుల ద్వారా సదరం వైద్యులకు వేలల్లో సొమ్ము ముట్టజెప్పి వైకల్య ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. వీటిలో ఎక్కవ శాతం పత్రాలు నరసన్నపేట సామాజిక ఆస్పత్రి నుంచి జారీ అయినవే కావడం గమనర్హం. గతంలో పొందూరు మండలం తోలాపికి చెందిన 24 మందికి జారీ చేసిన సదరం ధ్రువీకరణ ప్రతాల్లో 23 నరసన్నపేట ఆస్పత్రి జారీ చేసినవే. వీటిపై ఫిర్యాదులు వచ్చినా రాజకీయ జోక్యంతో అధికారులు వారి జోలికి వెళ్లలేదు. ఈ వ్యవహారాన్ని ‘సత్యం’ పత్రిక వెలుగులోకి తెచ్చి వరుస కథనాలు ప్రచురించడంతో ఉన్నతాధికారులు స్పందించి గత ఏడాది అక్టోబర్‌లో విచారణ జరిపించి 24 మందికి జారీ చేసిన సదరం పత్రాలను రద్దు చేయించారు. దీంతో పింఛన్లు నిలిచిపోయాయి. అదేవిధంగా జలుమూరు మండలం లింగంనాయుడుపేటకు చెందిన 21 మందికి సదరం ధ్రువపత్రాల జారీ విషయంలో అందిన ఫిర్యాదులపై విచారణకు ఆదేశించారు. ఆ మేరకు నరసన్నపేట ఆస్పత్రిలో గత నెల 29న జరిగే విచారణకు హాజరుకావాలని గ్రామ కార్యదర్శి ద్వారా లబ్ధిదారులకు నోటీసులు అందించారు. వారెవరూ విచారణకు హాజరుకాకపోవడంతో పింఛన్లు నిలిపివేశారు. ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌లో 11 మంది దొడ్డిదారిన సదరం ధ్రువపత్రాలు పొంది వికలాంగ పింఛన్లు అందుకుంటున్నారని గత ఏడాది అక్టోబర్‌ 16న, ఈ ఏడాది జనవరి 29న, ఈనెల ఒకటో తేదీన అక్కడి ఉపసర్పంచ్‌ ప్రతినిధి ప్రకాశరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చిలకపాలెంలో నివాసం ఉంటున్న ఇబ్రహీంబాద్‌కే చెందిన మాజీ సైనికుడు వీరికి రూ.30 నుంచి రూ.60 వేలు చొప్పున వసూలు చేసి ధ్రువపత్రాలు ఇప్పించాడని గ్రామంలో చర్చ జరుగుతోంది. దీనిపై ఎనిమిది నెలల క్రితం ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. నోటీసులు ఇచ్చినట్టు చూపించి 11 మందిని కాపాడుతూవచ్చారు. వీరందరూ 2022 మే, నవంబర్‌ నెలల్లో సదరం ధ్రువపత్రాలు పొందారు.

విచారణకు వెళ్లకుండా పైరవీలు

ఉపసర్పంచ్‌ ప్రతినిధి ఎనిమిది నెలల్లో మూడుసార్లు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకోలేదు. చివరికి డీఆర్‌డీఏ పీడీ స్పందించి ఏడు రోజుల్లో ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారిని ఆదేశించారు. ఆ మేరకు సమన్వయాధికారి జరిపిన విచారణకు గురుగుబెల్లి దిలీప్‌ తప్ప మిగిలినవారెవరూ హాజరు కాలేదు. దీంతో దిలీప్‌ వైకల్యాన్ని నిర్థారించి పింఛనుకు అర్హుడేనని పేర్కొనడంతో పాటు విచారణకు హాజరుకాని వారి పింఛన్లను తాత్కాలిక నిలిపివేయాలని సూచిస్తూ నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం మరోసారి నోటీసులు జారీ చేశారు. కానీ విచారణాధికారి సూచించినా.. పింఛన్లు ఆగలేదు. ఈ నెల ఒకటో తేదీన మిగిలినవారితో పాటు వీరికి కూడా పింఛన్లు ఇచ్చేశారు. పింఛన్‌ ఇస్తున్నప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మందికి గ్రామ కార్యదర్శి నోటీసులు ఇచ్చి ఈ నెల మూడో తేదీన సచివాలయం వద్ద జరిగే విచారణకు సదరం ధ్రువపత్రాలతో హాజరుకావాలని చెప్పారు. దాంతో వారంతా స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి విచారణను వాయిదా వేయించారు. తిరిగి ఈ నెల ఎనిమిదో తేదీన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు జారీ చేసి పదో తేదీన రణస్థలం సామాజిక ఆస్పత్రిలో జరిగే వైకల్య నిర్థారణ పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఈసారి హాజరుకాకపోతే పింఛన్లు నిలిపివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ మేరకు అధికార పార్టీ నాయకులను తీసుకుని వారంతా రణస్థలం వెళ్లారు. కానీ ఆస్పత్రికి వెళ్లకుండా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వద్దకు వెళ్లి ఆయనతో అధికారులకు ఫోన్‌ చేయించారు. అధికారులతో మాట్లాడిన తర్వాత ఎంపీ సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లారు. ధ్రువపత్రాలు చూసి పంపించేస్తారన్న ధీమాతో ఉన్నవారు.. తమలోని సువ్వారి వెంకటరమణ అనే లబ్ధిదారుడికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని చూసి వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయారు. వైద్య పరీక్షలకు అంగీకరించినందుకు సువ్వారి వెంకటరమణపై మిగతా లబ్ధిదారులతోపాటు అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్య్యక్తం చేశారని తెలిసింది. డబ్బులు తీసుకొని సదరం పత్రాలు జారీ చేయించిన మాజీ సైనికుడు కూడా విచారణకు హాజరై పరీక్షలు చేయించుకున్న సువ్వారి వెంకటరమణపై చిందులు వేశారని తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page