top of page

నగరంలో జంక్షన్‌ జామ్‌

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • రైతుబజార్‌ రోడ్డుపై విచ్చలవిడిగా వ్యాపారాలు

  • వాహన చోదకులకు తప్పని ఇక్కట్లు

  • రహదారిపైనే వాహనాలు పార్కింగ్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నగరంలో జంక్షన్‌ జామవుతుంది. రైతుబజార్‌ వైపు రోడ్డుపై విచ్చలవిడిగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడడం లేదు. రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాల ముందు వాహనాలు పార్కింగ్‌ చేయడం వల్ల వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రణాళికాబద్ధంగా శ్రీకాకుళం నగరాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలం కావడం వల్ల నిరంతరం ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకొని వాహన చోదకులు ఇబ్బందులకు గురికావడం గత రెండు దశాబ్దాలుగా అనుభవంలో ఉంది. 20 ఏళ్లలో నగరంలోని ప్రధాన రహదారులు విస్తరణ చేసినా రాజకీయ జోక్యంతో అనుకున్న స్థాయిలో రోడ్లు వెడల్పు కాలేదు. పెరుగుతున్న నగర జనాభా, అవసరాలు, వాహనాలకు అనుగుణంగా రోడ్లు విస్తరణ క్రమపద్ధతిలో చేయలేదన్న వాదన ప్రజల్లో ఉంది. వ్యాపార సముదాయాల ముందే వాహనాలు పార్కింగ్‌ చేస్తుండడంతో వాహన చోదకులు, పాదచారుల ఇక్కట్లు వర్ణనాతీతం.

నగరంలో రద్దీగా మారిన రోడ్లలో రౖౖెతుబజార్‌ రోడ్డు ఒకటి. ఎనిమిదేళ్ల క్రితం రైతుబజార్‌ నుంచి జీటీ రోడ్డు వరకు 60 అడుగుల మేర విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసినా రాజకీయ నాయకుల జోక్యంతో 60 నుంచి 40 అడుగులకు కుదించి కాలువలతో కలుపుకొని 36 అడుగుల రోడ్డు వేశారు. రోడ్డు విస్తరించారని చెప్పడానికే తప్ప ప్రస్తుతం మనుగడలో ఉన్నది 20 అడుగులే. రైతుబజార్‌ నుంచి ఎస్‌బీఐ వరకు రోడ్డుకు ఇరువైపులా పుట్టగొడుగుల్లా దుకాణాలు తెరిచి రోడ్డుపై వ్యాపారం చేస్తున్నారు. ఈ రోడ్డులో సుమారు 50కి తక్కువ లేకుండా టిఫిన్‌, ఫాస్ట్‌ఫుడ్‌, మిఠాయి, హోటల్స్‌, రెస్టారెంట్స్‌, తినుబండారాలు విక్రయించే స్టాల్స్‌ ఉన్నాయి. వీటి కార్యకలాపాలన్నీ రోడ్డు మీదనే సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి 11 వరకు ఈ దుకాణాలు తెరిచి వ్యాపారం చేస్తున్నారు. వీటి వద్దకు వచ్చే వినియోగదారులు రోడ్డుపై వాహనాలు నిలిపేస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికితోడు రోడ్డుకు ఇరువైపులా దేవాలయాలు ఉన్నాయి. వారాంతాల్లో భక్తుల రద్దీ కారణంగా రోడ్డు కిక్కిరిసి ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది.

నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారు

నగరంలోని అంతర్గత రోడ్డుల్లో ప్రధానమైనదిగా గుర్తింపు పొందిన రైతుబజార్‌ నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా మారిపోయింది. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా జీ ప్లస్‌ టూ కు మాత్రమే అనుమతి ఉంది. దీంతో పెద్ద పెద్ద మాల్స్‌, వాణిజ్య కేంద్రాల స్థానంలో రోడ్డుకు ఇరువైపులా పుట్టుకొచ్చిన చిన్నచిన్న హోటల్స్‌, తినుబండారాలు, టిఫిన్స్‌, తోపుడుబళ్లు వ్యాపారులతో రద్దీగా మారిపోయింది. రోడ్లపై వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు వ్యాపారానిక సంబంధించిన ఫ్లెక్సీ బోర్డులు రోడ్డు మీదనే పెడుతున్నారు. వినియోగదారులు రోడ్డుపై వాహనాలు నిలిపేసి వారి పని పూర్తయిన తర్వాత వెళుతున్నారు. దీంతో రైతుబజార్‌ రోడ్డులో వాహన చోదకులకు నరకయాతన తప్పడం లేదు. దీన్ని క్రమబద్దీకరించాల్సిన పోలీసులు రోజూ ఈ మార్గంలోనే సైరన్‌ వేసుకుంటూ కళ్లు మూసుకొని వెళ్లిపోతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ద్విచక్రవాహనంపై ఉదయం, సాయంత్రం కలియతిరగడమే తప్ప రోడ్డుపై మీద వ్యాపారం చేసేవారిని హెచ్చరించిన దాఖలాలు లేవు. దీనికి కారణం రోడ్డుపైకి వచ్చి దుకాణాలు ఏర్పాటుచేసిన, వ్యాపార సముదాయాల ముందు రోడ్డు మీద పార్కింగ్‌ చేయడానికి ప్రతి నెల మామూళ్లు సమర్పిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ నిలిచి వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నా వీరికి పట్టడం లేదు. వ్యాపారాన్ని బట్టీ మామూళ్లు తీసుకుంటున్నారని వ్యాపారులే చెబుతున్నారు. కాలువలను ఆక్రమించి రోడ్డు మీద వ్యాపారం చేస్తున్నవారికి నగరపాలక సంస్థ అధికారులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం పారిశుధ్య నిర్వహణ అధికారులు వ్యాపారాల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి.

నిత్యం రద్దీతో కిటకిట

ఇలిసిపురం జంక్షన్‌ నుంచి రైతుబజార్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా తోపుడుబళ్లు వ్యాపారాలు సాగిస్తుండడం వల్ల ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతు బజార్‌కు వచ్చేవారితో పాటు పాఠశాల, కాలేజీలకు రాకపోకలు సాగించేవారితో నిత్యం రద్దీతో కిటకిటలాడుతుంది. అదే రోడ్డులో చిన్నబజారు వద్ద రోడ్డు మీద వాహనాలు పార్కింగ్‌ చేసేయడం, తోపుడుబళ్లు నిలపడం వల్ల సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతుంది. దీన్ని పోలీసుల దృష్టికి వాహనచోదకులు తీసుకువెళ్లినా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం లేదు. ఇలిసిపురం జంక్షన్‌, చిన్నబజార్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకొని వాహనాలకు ఫోటో తీయడానికే పరిమితమవుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా రోడ్డుపై వ్యాపారాలు చేస్తున్నవారిని, రోడ్డు మీదనే వాహనాలు పార్కింగ్‌ చేసిన వారిని వదిలేసి రోడ్డుపై వెళుతున్న వారి వాహనాలకు వెనుక నుంచి ఫోటోలు తీసి ఫైన్‌ వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు స్పందించి రైతుబజార్‌ రోడ్డులో రోడ్డుపైనే వ్యాపారాలు నిర్వహిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటే ఆ రోడ్డులో కొంతవరకైనా ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుందని వాహన చోదకులు అభిప్రాయపడుతున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page