రోడ్డు ప్రమాదంలో నలుగురు సిక్కోలువాసులు మృతి
శనివారం ఉదయాన్నే గాలిలో కలిసిపోయిన ప్రాణాలు
మృతులంతా ప్రముఖుల కుటుంబీకులే
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగరం శనివారం ఉదయాన్నే విషాదకరమైన వార్తతో కళ్లు నులుముకుంది. నగరానికి చెందిన నలుగురు యుక్తవయసువారు కారు ప్రమాదంలో మృతిచెందారు. ఇందులో ఒక యువతి కూడా ఉండటం మరింత విషాదకరం. వివరాల్లోకి వెళితే..
విజయనగరం జిల్లాపరిధి జాతీయ రహదారి పోలిపల్లి వద్ద లారీ, కారు ఢీకొనడం ద్వారా నగరానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న ఫార్చూనర్ కారు టైరుకు పంక్చర్ కావడంతో డివైడర్‌ను ఢీకొట్టి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న లైన్‌లో పడి పడిరది. అప్పటికే అటువైపుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురూ మృతిచెందారు. మృతుల్లో నగరానికి చెందిన గవిడి కౌశిక్, వడ్డి అభినవ్, వడ్డి మణిమాల, డ్రైవర్ మొడి జయేశ్ ఉన్నారు. ప్రముఖ కాపు నాయకులు లంక బావాజీనాయుడి కూతురు కొడుకు (మనుమడు) పెళ్లి డిసెంబరు 6న ఉండటంతో ఆయన కుమారుడు అమెరికా నుంచి శ్రీకాకుళం వస్తున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయన్ను రిసీవ్ చేసుకోడానికి శ్రీకాకుళం నుంచి శనివారం ఉదయం బావాజీనాయుడి అల్లుడు గవిడి వాసు కొడుకు గవిడి కౌశిక్ తన ఫార్చూనర్ వాహనంలో బయల్దేరారు. గవిడి వాసు లంక బావాజీనాయుడుకు అల్లుడు. దీంతో మేనమామను తెచ్చేందుకు కౌశిక్ విశాఖపటనం బయల్దేరాడు. శుక్రవారం రాత్రి తాను విశాఖ వెళ్తున్నట్టు మిత్రుడు అభినవ్‌కు చెప్పడంతో విశాఖపట్నంలో తన భార్యకు పరీక్ష ఉందని, తామిద్దరం వస్తామంటూ కౌశిక్ మిత్రుడు వడ్డి అభినవ్ (27), తన భార్య మణిమాలతో కలిసి ఇదే ఫార్చూనర్ ఎక్కారు. సరిగ్గా పోలిపల్లి రహదారి వద్దకు వచ్చేసరికి టైర్ పంక్చర్ కావడంతో వేగంగా వెళుత్న వాహనం అదుపుతప్పి బోల్తాపడిరది. ఎదురుగా వస్తున్న లారీ కూడా ఢీకొనడంతో నలుగురి ప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి. అభినవ్ నగరంలో లియో మెడికల్స్ పేరుతో ల్యాబ్ నిర్వహిస్తున్న వడ్డి మన్మధ కుమారుడు. ఈయన తండ్రితో పాటు నగరంలో లియో ల్యాబ్‌ను నడిపిస్తున్నాడు. ఈయనకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇక గవిడి కౌశిక్ తండ్రి గవిడి వాసుదేవరావు కూడా పేర్లవారి సందులో బంగారం వ్యాపారం చేస్తున్నారు. నగరంలో మరో ప్రముఖ నగల వ్యాపారి లంక గాంధీ కుమార్తెతో ఏడాది క్రితమే కౌశిక్‌కు వివాహం జరిగింది. బంగారం వ్యాపారంలో లంక గాంధీకి పెద్ద పేరు ఉంది. మరోవైపు గవిడి వాసు కూడా బంగారం వర్తకుల సంఘంలో కీలకంగా ఉన్నారు. ఇటువంటి కుటుంబం నుంచి కౌశిక్, మన్మధ కుటుంబం నుంచి కొడుకు, కోడలు మరణించడంతో నగరం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇక ఈ కారుకు డ్రైవర్‌గా పని చేస్తున్న మొడి జయేశ్ తల్లి స్థానిక సున్నప్పువీధి జంక్షన్ వద్ద టీకొట్టు నడుపుతోంది. తండ్రి లేని జయేశ్ చిన్నవయసులోనే పెద్ద వాహనాలను సేఫ్‌గా నడిపే డ్రైవర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2005లో పుట్టిన జయేశ్‌కు తల్లి తప్ప మరొకరు లేరు. ఆ తల్లికి కూడా జయేశే ఆధారం. ఇప్పుడు కొడుకు చనిపోవడంతో ఆ తల్లి దిక్కుతోచని పరిస్థితికి వెళ్లిపోయింది.
Comments